జ్ఞాపకాల ‘సిరి’.. ఆ రెండు చిత్రాలూ ఆణిముత్యాలే..

20 Dec, 2021 11:34 IST|Sakshi
సిరివెన్నెల చిత్రం ప్రారంభోత్సవంలో పూజ చేస్తున్న వీర్రాజు

జీవితానికి సరిపడే సంతృప్తినిచ్చాయి 

సిరిసిరి మువ్వ.. సిరివెన్నెల నిర్మాత

ఉజూరి వీర్రాజు అంతరంగం 

1970, 80లలో ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని తపనతో నిర్మాతలు, దర్శకులు పని చేసేవారు. భక్తి రసం, కళాత్మకం, సందేశాత్మకం ఇలా ఏదో ప్రత్యేకతతో సినిమా తీసి ప్రజల్లో  మంచి పేరు తెచ్చుకోవాలని ఉండేది. ఇప్పుడు పూర్తిగా వ్యాపార దృక్పథంతోనే చిత్రాలు తీస్తున్నారు. సినిమాలు తీయడానికి రూ.కోట్లలో ఖర్చు అవుతున్నా ఆడించేందుకు థియేటర్లు ఉండటంలేదు.

రామచంద్రపురం: తెలుగు సినీరంగంలో గుర్తుండిపోయే రెండు చిత్రాల నిర్మాణ సారథ్యంలో ఆయన పాలుపంచుకున్నారు. ఆ రెండు సినిమాలూ విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపొంది అపూర్వ విజయాలు సాధించినవే.. చిరస్మరణీయ చిత్రాలైన సిరివెన్నెల, సిరిసిరిమువ్వ చిత్రాల నిర్మాతల్లో ఒకరు  తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన ఊజూరి వీర్రాజు.. ఈ రెండు సినిమాలూ ఆఖండ విజయభేరి మోగించినా తర్వాత ఆయన మరో సినిమా జోలికి పోలేదు. 76ఏళ్ల వీర్రాజుకు ఒక అబ్బాయి..నలుగురు అమ్మాయిలు ఉన్నారు. తనను సినిమా నిర్మాణం వైపు అడుగులు వేయించిన పరిస్థితులను ఆయన సాక్షితో పంచుకున్నారు. తన జీవితంపై చెరగని ముద్ర వేసిన ఆ సినిమాల గుర్తులు తన గుండెలో ఎప్పటికీ పదిలంగాఉంటాయంటారాయన.

రాజస్దాన్‌లో షూటింగ్‌ అనంతరం  సిరివెన్నెల చిత్రం బృందం 

అంగరతో స్నేహమే నడిపించింది.. 
రామచంద్రపురంలో మాకు మార్కేండేయ ఇంజినీరింగ్‌ వర్క్‌ షాపు ఉండేది. సిని నిర్మాత అంగర సత్యం నేను స్నేహితులం..కలిసి చదువుకున్నాం. ఆయన తరచూ మా వర్క్‌షాప్‌ వద్దకు వచ్చేవారు. ఈయన ద్వారా పూర్ణోదయ క్రియేషన్స్‌ సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు పరిచయమమ్యారు. వీరు మా షెడ్డు వద్దే సినిమా ప్లాన్ల గురించి చర్చించుకునేవారు. అప్పుడే నా మనసు సినిమా నిర్మాణం వైపు మళ్లింది. 1975లో అంగర సత్యంతో కలిసి తమిళ వెర్షన్‌ ‘‘తిరుమల దైవం’’ సినిమాను శ్రీవెంకటేశ్వర కల్యాణంగా డబ్‌ చేసి నిర్మించాం. రూ. 2 లక్షల వరకూ ఖర్చయింది.

రూ.1లక్ష లాభం వచ్చింది. తరువాత రెండు మూడు సినిమాలు డబ్బింగ్‌ సినిమాలు రిలీజ్‌ చేశాం. ఏడిద నాగేశ్వరరావు డైరెక్ట్‌ సినిమాకు ప్లాన్‌ చేద్దామన్నారు. 1976లో దర్శకులు కె విశ్వనాథ్‌ వద్దకు వెళ్లాం. నా క్లాస్‌మేట్‌ నల్లమిల్లి భాస్కర్రెడ్డితో కలిసి సిరిసిరిమువ్వ సినిమాను నిర్మించాలనుకున్నాం. రూ. 3లక్షలు అవుతుందని ఏడిద నాగేశ్వరరావు నన్ను ఒప్పించారు. రూ 13లక్షలయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్‌ సహాయ పడ్డారు.

నవయుగ డిస్ట్రిబ్యూటర్స్‌ సగం పెట్టుబడి పెట్టి వెనక్కి వెళ్లిపోయారు. సినిమా కథ.. దర్శకుని మీద నమ్మకంతో అప్పులు చేసి సినిమా తీశాం. సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. మాకు రూ.కోటి వరకు లాభమొచి్చంది. ఈ సినిమా హక్కులు మాకే ఉన్నాయి. దీనిపై ఇప్పటికీ ఎంతోకొంత డబ్బులు వస్తూనే ఉన్నాయి. సిరిసిరిమువ్వ ఎక్కువ సార్లు రిలీజ్‌ చేశాం. 1978లో శంకరాభరణం తీద్దామని అనుకున్నా కుదరలేదు. అదే సమయంలో రామచంద్రపురంలో గీతా థియటర్‌ నిర్మాణంలో ఉండటంతో అవకాశం మిస్సయ్యాను.

ప్రముఖులకు దగ్గరయ్యా.. 
‘‘ సిరిసిరి మువ్వ సినిమా చాలా వరకు రామచంద్రపురం పరిసరాల్లోనే చిత్రీకరించాం. ఇక్కడి వాళ్లు చాలా మంది అందులో నటించారు. అప్పట్లో ఇక్కడ బస చేయటానికి సరైన వసతులుండేవి కావు. దర్శకులు కె విశ్వనాథ్‌తో పాటు చంద్రమోహన్, జయప్రద వంటి నటులను మా స్నేహితుల ఇళ్లలోనే ఉంచేవాళ్లం. ఈ సినిమాకు జాతీయ స్ధాయిలో రెండు, రాష్ట్ర స్ధాయిలో 6 అవార్డులను అందుకున్నాం. విశ్వనాథ్, వేటూరి, కనకాల దేవదాసులాంటి వారికి దగ్గరయ్యాను. పదేళ్ల గ్యాప్‌ తర్వాత 1986లో మళ్లీ విశ్వనాథ్‌గారితో కలిసి సిరివెన్నెల సినిమా నిర్మించాం. సందేశాత్మక చిత్రంగానే విడుదల చేశాం. నిర్మాణ సందర్భంలో మా చిత్రం హిట్‌ అవ్వదని.. డబ్బులు రావని విమర్శలు వినిపించేవి.

కానీ డబ్బులు గురించి ఆలోచించలేదు. సందేశంతో కూడిన కళాత్మకమైన చిత్రం అందించాలనే భావించాం. దీనికి కూడా అవార్డుల పంట పండింది. ఇందులో సీతారామశాస్త్రి రాసిన పాటలు పెద్ద హిట్‌ అయ్యాయి. ఆ చిత్రమే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన పేరు విన్నప్పుడల్లా గర్వంగా..ఆనందంగా ఉంటుంది. బాలకృష్ణ, ఏ కోదండరామిరెడ్డిలతో,  స్వాతి ముత్యం తరువాత కమలహాసన్‌తో సినిమాలకు ప్లాన్‌ చేసినా కుదరలేదు.  విశ్వనాథ్‌గారితో పరిచయంతో స్వాతికిరణం, స్వాతిముత్యం, శుభసంకల్పం చిత్రాలకు పనిచేశాను. రామచంద్రపురంలో తీసిన ప్రతి చిత్రానికి వెనకుండి సహకరించేవాడ్ని. 

ఇప్పటికీ సినిమా మీద మక్కువ పోలేదు. రామచంద్రపురంలో ఏదైనా సినిమా షూటింగ్‌ చేస్తే కచ్చితంగా నన్ను సంప్రదిస్తుంటారు. నాటి సినిమా జ్ఞాపకాలు నేటికి గుర్తుకు వస్తునే ఉంటాయి. హిందీలో సర్గమ్‌(సిరిసిరిమువ్వ) కోసం మద్రాసు నుంచి బెంగళూరుకు హిందీ నటి రేఖను విమానంలో తీసుకువచ్చే బాధ్యతను నాకు పురమాయించారు. అప్పుడు టిక్కెట్‌ ధర  రూ250. ఎంతో పేరున్న హిందీ హీరోయిన్‌ రేఖను తీసుకువస్తుంటే అందరి మావైపే చూశారు. 

సినిమా తీశాక ఆర్థిక పరంగా ఎలా ఉన్నా సంతృప్తి అనేది మిగిలి ఉంటుంది. సిరిసిరి మువ్వ, సిరివెన్నెల నిర్మాతలలో ఒకడిగా నా జన్మకు సరిపడా సంతృప్తి మిగిలింది. సిరిసిరిమువ్వ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ భాషలతో పాటుగా అమెరికా, మాస్కో వంటి దేశాలలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. నేటికి ఆ సినిమా సంఘటనలు తీపి గుర్తులే.   

మరిన్ని వార్తలు