‘పాన్‌ కథ’లకే టాలీవుడ్‌ ఇండస్ట్రీ మొగ్గు.. ఈ ఏడాది తెలుగు నుంచి దాదాపు డజనుకి పైగా

23 Jan, 2023 04:03 IST|Sakshi

‘బాహుబలి’తో తెలుగు సినిమాలో మార్పు వచ్చింది. అప్పటివరకూ మన తెలుగు సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చితే చాలన్నట్లు ఉండేది. అయితే ‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌కి ఎదిగింది. అందుకే ప్రస్తుతం ‘పాన్‌ కథ’లకే ఇండస్ట్రీ మొగ్గు చూపుతోంది. ఈ ఏడాది తెలుగు నుంచి దాదాపు డజనుకి పైగా ‘పాన్‌ ఇండియా’ చిత్రాలు రానున్నాయి. ఇక ఈ ‘పాన్‌ కథా చిత్రమ్‌’ వివరాలు తెలుసుకుందాం.

‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ (రవితేజ కీ రోల్‌ చేశారు) చిత్రాల సక్సెస్‌ జోష్‌లో ఉన్న రవితేజ చేస్తున్న తాజా చిత్రాల్లో  ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ఒకటి. స్టూవర్టుపురం దొంగగా చెప్పుకునే టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వంశీ. 1970 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం ఈ ఏడాదే రిలీజ్‌  కానుంది. అలాగే రవితేజ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘రావణాసుర’ కూడా పాన్‌ ఇండియా రిలీజ్‌ అని తెలుస్తోంది.

సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. మరోవైపు ‘బాహుబలి’ పాన్‌ ఇండియా సక్సెస్‌ తర్వాత ప్రభాస్‌ చేసే ప్రతి సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిం§ó.. ఈ ఏడాది మూడు పాన్‌ ఇండియా చిత్రాలతో ప్రభాస్‌ రానున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్‌’, దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించిన మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘ఆదిపురుష్‌’ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

జూన్‌ 16న ‘ఆదిపురుష్‌’, సెప్టెంబరు 28న ‘సలార్‌’ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలే కాకుండా ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్‌’ (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే పాన్‌ ఇండియా రిలీజ్‌గా థియేటర్స్‌లోకి వస్తుందనే టాక్‌ వినిపిస్తోంది. ఇక హీరో మహేశ్‌బాబు తాజా చిత్రం పాన్‌ ఇండియా రిలీజ్‌ కానుంది.

‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఫ్యామిలీ అండ్‌ ఎమోషనల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్   హైదరాబాబాద్‌లో జరుగుతోంది. ఆగస్టు 11న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇక పవన్‌ కల్యాణ్‌ నుంచి కూడా ఓ పాన్‌ ఇండియా చిత్రం రానుంది. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ హీరోగా నటిస్తున్న పీరియాడికల్‌ ఫిల్మ్‌ ‘హరిహర వీరమల్లు’. 17వ శతాబ్దం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వేసవిలో రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు శంకర్‌ దర్శకత్వంలో హీరో రామ్‌చరణ్‌ ఓ పాన్‌ ఇండియా మూవీ చేస్తున్నారు. రాజకీయాలు, ఐఏఎస్‌ ఆఫీసర్ల నేపథ్యంతో కూడిన ఈ యాక్షన్‌ ఫిల్మ్‌ ఈ ఏడాదే థియేటర్స్‌లోకి రానుంది. ఇంకోవైపు ఆల్రెడీ ‘పుష్ప: ది రైజ్‌’తో పాన్‌ ఇండియా సక్సెస్‌ కొట్టిన అల్లు అర్జున్‌ ఇదే సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప: ది రూల్‌’ సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ‘పుష్ప: ది రూల్‌’ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ మాస్‌ ఫిల్మ్‌ ‘దసరా’ కూడా పాన్‌ లిస్ట్‌లో ఉంది. ఈ చిత్రం మార్చి 30న రిలీజ్‌ కానుంది.

‘శాకుంతలం’తో సమంత కూడా పాన్‌ ఇండియా జాబితాలో చేరారు. దేవ్‌ మోహన్‌ ఓ లీడ్‌ రోల్‌ చేసిన ఈ మైథలాజికల్‌ లవ్‌స్టోరీకి గుణశేఖర్‌ దర్శకుడు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న రిలీజ్‌ కానుంది. ఇంకోవైపు హీరో రామ్, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా స్థాయిలో ఓ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ రూపొందుతోంది. అలాగే అఖిల్‌ హీరోగా సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న స్టైలిష్‌ యాక్షన్‌ మూవీ ‘ఏజెంట్‌’ వేసవి రిలీజ్‌కి రెడీ అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌దేవర కొండ–సమంతల పాన్‌ ఇండియా ప్రేమకథా చిత్రం ‘ఖుషి’ ఈ ఏడాది వెండితెరపై ప్రేమ
కురిపించనుంది.

అలాగే రంజిత్‌ జయకొడి దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా చేసిన గ్యాంగ్‌స్టర్‌ ఫిల్మ్‌ ‘మైఖేల్‌’ వచ్చే నెల 3న రిలీజ్‌ కానుంది. సాయిధరమ్‌తేజ్‌ హీరోగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో రూపొందిన మిస్టిక్‌ థ్రిల్లర్‌ ‘విరూపాక్ష’ ఏప్రిల్‌ 21న విడుదల కానుంది. వరుణ్‌ తేజ్‌ కూడా పాన్‌ క్లబ్‌లో చేరారు. తెలుగు, హిందీ భాషల్లో శక్తీకాంత్‌ దర్శకత్వంలో వరుణ్‌ ఓ పాన్‌ మూవీ కమిట్‌ అయ్యారు. ఇక ‘గూఢచారి’కి సీక్వెల్‌గా అడివి శేష్‌ చేస్తున్న ‘గూఢచారి 2’ కూడా పాన్‌ ఇండియా రిలీజే. ఇంకా గ్యారీ బీహెచ్‌ దర్శకత్వంలో నిఖిల్‌ చేసిన స్పై థ్రిల్లర్‌ ‘స్పై’, తేజా సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తీసిన అడ్వెంచరస్‌ మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘హను మాన్‌’ (మే 12న రిలీజ్‌) తదితర చిత్రాలు పాన్‌ ఇండియా రిలీజ్‌లుగా ఈ ఏడాదే రానున్నాయి.

మరిన్ని వార్తలు