నవరాత్రులు - సినిమాల్లో నారీమణులు: హీరోయినే.. హీరో

27 Sep, 2022 18:16 IST|Sakshi

ఐదేళ్ల కెరీర్. బానే ఉన్నట్టు. పదేళ్లు. అబ్బో కేక. చాలా పెద్ద హీరోయిన్. ఒక దశాబ్దం పాటు తెలుగు సినిమాని ఏలేసింది అంటారు. అదే హీరోలకైతే పదేళ్లు అన్నది చాలా తక్కువ టైమ్. వాళ్లకి 60 దాటినా హీరోలే. సో విషయం ఏంటంటే హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా చిన్నది. ఇలా వచ్చారు. అలా వెళ్లిపోయారు అన్నట్టుగా ఉంటుంది. ఈ టైమ్‌లో వాళ్లు పోషించే ఛాలెంజింగ్ పాత్రలే ఆ తర్వాత కూడా వాళ్ల గురించి మాట్లాడుకునేలా చేస్తాయి. లేదా వాళ్ల లైఫ్ స్పాన్స్‌ని పెంచుతాయి.

లేడి ఓరియంటెడ్ సినిమాలే తెలుగులో తక్కువ. అందులో ఒక గ్లామర్ హీరోయిన్ ఏకంగా లేడి అమితాబ్ అన్న బిరుదును దక్కించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. విజయశాంతికి అది ఎందుకు సాధ్యమైందంటే తను అసామాన్యురాలు కాబట్టి. ఒకటి కాదు. రెండు కాదు. తానే ముందుండి నడిపించిన సినిమాల లిస్ట్ ఒసేయ్ రాములమ్మ దాకా చాలా పెద్దదే ఉంది. అయితే వీటన్నింటికీ పునాది మాత్రం కర్తవ్యం సినిమానే. అందులో పోలీస్ ఆఫీసర్‌గా విజయశాంతి పెర్ఫామెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సావిత్రి బయోపిక్ తీస్తున్నారు. కీర్తిసురేష్ సావిత్రిగా చేస్తుందన్న వార్త బయటకు రాగానే రకరకాల రియాక్షన్స్ వచ్చాయి. సావిత్రిని మరిపించేలా కీర్తి సురేష్ నటించగలదా అన్న సందేహాలు కూడా వ్యక్తమైయ్యాయి. కానీసావిత్రి పాత్రలో పరాకాయ ప్రవేశం చేసింది కీర్తి సురేష్. సావిత్రి జీవితంలోని ప్రతి దశను అద్భుతంగా వెండి తెర మీద ఆవిష్కరించింది.

శివపుత్రుడు చిత్రంలో గోమతి క్యారెక్టర్‌తో అందరినీ ఆశ్చర్యపర్చింది సంగీత. అందులో గంజాయి అమ్మే యువతి పాత్రలో డీ గ్లామర్గా కనిపించింది. ఆ పాత్రలో జీవించింది. ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్ల తర్వాత 2002లో ఖడ్గంతో హిట్ అందుకుంది సంగీత. ఆ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిలిమ్ఫేర్ అవార్డు తెలుగు అందుకుంది. ఆ వెంటనే పితామగన్ చిత్రంలో గంజాయి అమ్మే పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గ్లామర్ పాత్రలతో ఇల్లు చక్కపెట్టుకోవాల్సిన టైమ్‌లో ఇలాంటి రోల్స్ అవసరమా అని సలహాలు కూడా ఇచ్చారట. కానీ డైరెక్టర్ బాలా మీద నమ్మకంతో డేట్స్ ఇచ్చేసింది సంగీత.

హీరోయిన్ అంటే గ్లామర్ రోల్. అంతే అని ఇండస్ట్రీ అంతా ఫిక్స్ అయిన టైమ్‌ సోలో గా కథలను లీడ్ చేసే ప్రతిభను ప్రదర్శించిఅవకాశాలనూ దక్కించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో సమంత ఒకరు. పర్ఫార్మెన్స్‌ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ తొలి నుంచి సమంతకి దక్కు తూనే ఉన్నాయి. ఏమాయ చేశావే, రంగస్థలం, ఓ బేబీఇలా చాలా సినిమాల్లో నటిగా తన సత్తాని చాటింది.

ఛాలెంజింగ్ రోల్స్ గురించి ప్రస్తావించాలంటే అనుష్క గురించి చాలా చాలా మాట్లాడుకోవాలి. కేవలం గ్లామర్ డాల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అనుష్క ఆ తర్వాత అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంది. అయితే అనుష్కలోని ప్రత్యేకత ఏంటంటే ఒక మూస లోనే ఉండకపోవడం. అరుంధతి విడుదలైన తర్వాత ఇక అనుష్కకి గ్లామర్ పాత్రలు పెద్దగా రావంటూ చాలా విశ్లేషణలు వచ్చాయి.

కానీ ఆ అంచనాలను తప్పని నిరూపించింది. అటు గ్లామర్ రోల్స్, అటు ఛాలెంజింగ్ రోల్స్‌ అదరగొట్టింది. విభిన్నమైన పాత్రలు చేయాలని సహజంగానే ఎవరికైనా ఉంటుంది. కానీ దాని కోసం కెరీర్‌ని రిస్‌లో పెట్టడానికి కూడా వెనుకాడని వాళ్లు అతి అరుదుగా ఉంటారు. నటన పై వారికున్న గౌరవానికి అతి ప్రతీక. స్వీటి ఆ కోవలోకే వస్తుంది. అసలు హీరోయిన్ అంటేనేగ్లామర్. కేవలం ఒక పాత్ర కోసం బరువు పెరగడం అంటే కెరీర్ చుట్టూ క్వశ్చన్ మార్క్లు పెట్టుకోవడమే. ఆ సాహసాన్ని అనుష్క చేసింది. సైజ్ జీరో సినిమా కోసం 17 కేజీలు బరువు పెరిగింది.

మరిన్ని వార్తలు