Sreekaram Review: శర్వానంద్‌ మెప్పించాడా?

11 Mar, 2021 11:45 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : శ్రీకారం
నటీనటులు :  శర్వానంద్, ప్రియాంకా అరుళ్‌ మోహన్, సాయికుమార్‌, మురళీ శర్మ, రావు రమేశ్‌ తదిరులు
నిర్మాణ సంస్థ : 14 రీల్స్‌ ప్లస్‌ 
నిర్మాతలు : రామ్‌ ఆచంట, గోపీ ఆచంట 
దర్శకత్వం : బి.కిశోర్‌
సంగీతం : మిక్కీ జె. మేయర్
సినిమాటోగ్రఫీ : జే యువరాజ్‌
ఎడిటింగ్‌ : మార్తండ్‌ కె వెంకటేశ్‌
విడుదల తేది : మార్చి 11, 2021

'జాను' సినిమాతో నిరాశపర్చిన శర్వానంద్‌ ఈసారి లవ్‌స్టోరీని కాకుండా రైతుల స్టోరీని ఎంచుకున్నాడు. "కావాల్సినంత ప్రేమ.. సరిపోయే సెంటిమెంట్.. అల్లరి చేసే ఫ్రెండ్స్.. ఏడిపించే నాన్న.. నవ్వించే విలన్.. అందమైన అమ్మాయి.. అన్నం పెట్టే భూమి.. దీని చుట్టూ తిరిగే హీరో కారెక్టర్.. ఇదే శ్రీకారం కథ" అంటూ ప్రీ రిలీజ్‌​ ఈవెంట్‌లో కథ, కాన్సెప్ట్‌ పూర్తిగా రివీల్‌ చేశాడు శర్వానంద్‌. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందన్న ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా నేడు(మార్చి 11)న రిలీజైంది. దీనికి పోటీగా మరో రెండు, మూడు సినిమాలు కూడా విడుదలయ్యాయి. అయితే ఇటీవల రైతు కథాంశం మీద వచ్చిన సినిమాలు తక్కువే. చాలా కాలం తర్వాత వస్తున్న ఈ కర్షకుల చిత్రం ఎలా ఉంది? రైతు బిడ్డగా శర్వానంద్‌ ఏ మేరకు మెప్పించాడు? అన్న అంశాలను రివ్యూలో తెలుసుకుందాం...

కథ:
అనంతరాజపురానికి చెందిన రైతు కేశవులు(రావు రమేష్) కొడుకు కార్తీక్ (శర్వానంద్) ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్. తన పనితనంతో ఆఫీస్‌లో అందరి మన్ననలు పొందుతాడు. చైత్ర(ప్రియాంకా అరుళ్‌ మోహన్) ఇతడిని బుట్టలో వేసుకునేందుకు ఎంత ట్రై చేసినప్పటికీ ఆమెను పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతుంటాడు. ఒక ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతం చేయడంతో కంపెనీ యాజమాన్యం అతన్ని అమెరికా పంపించేందుకు డిసైడ్ అవుతుంది. కానీ కార్తీక్ మాత్రం ఉద్యోగం మానేసి వ్యసాయం చేయడానికి తన గ్రామానికి వెళ్తాడు. వ్యవసాయం దండుగ అని వదిలేసిన కొంత మంది రైతులతో కలిసి ఉమ్మడి వ్యవసాయం మొదలు పెడతాడు. అసలు కార్తిక్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం వైపు ఎందుకు మళ్లాడు? ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటి? ఉమ్మడి వ్యవసాయంలో ఎదురైన సమస్యలను కార్తిక్‌ ఎలా పరిష్కరించాడు? టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయాన్ని ఎలా లాభసాటిగా మలిచాడు అనేదే మిగతా కథ.

నటీనటులు
విభిన్నమైన కథాంశాలను ఎంచుకునే శర్వానంద్‌ ఈ సినిమాలోనూ నటనతో మెప్పించాడు. కంప్యూటర్‌ ముందు యంత్రంలా పని చేసే యువ సాఫ్ట్‌వేర్‌ పొలంలోకి దిగుతే ఎలా ఉంటుందన్నది కళ్లకు కట్టినట్లు చూపించాడు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన కార్తిక్‌ పాత్రలో శర్వానంద్‌ ఒదిగిపోయాడు. తనకు ఉన్న అనుభవంతో కొన్ని ఎమోషనల్‌ సీన్లను కూడా చక్కగా పండించాడు. కథనంతా తన భూజాన వేసుకొని నడిపించాడు. తుంటరి పిల్ల చైత్ర పాత్రలో ప్రియాంకా అరుళ్‌ మోహన్ మెప్పించింది.ఇక ఈ సినమాకు మరో ప్రధాన బలం హీరో తండ్రి కేశవులు పాత్ర చేసిన రావు రామేశ్‌ది‌. నిరుపేద రైతు కేశవులు పాత్రలో రావు రమేశ్‌ ఒదిగిపోయాడు. ఇక మంచితనం ముసుగు కప్పుకొని జనాన్ని మోసం చేసే ఏకాంబరం పాత్రలో సాయి కుమార్‌  పర్వాలేదనిపించారు. హీరో తల్లిగా ఆమని ఆకట్టుకుంది. నరేశ్‌, మురళి శర్మ, సత్య తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ
చదువుకున్న యువకులు వ్యవసాయం చేస్తే ఎంత లాభం ఉంటుందో తెలియజేసే కథే ‘శ్రీకారం’. వ్యవసాయం, రైతు యొక్క గొప్పతనాన్ని తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు బి.కిశోర్‌. కష్టంపడి పనిచేసి పంటను పండించిన రైతు.. తన పంటను అమ్ముకోలేక ఎంతటి కష్టాలు పడుతాడో ఈ  సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే రైతులకు అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు.. వారిని ఎలా పీక్కుతింటారనేది వాస్తవానికి దగ్గరగా చూపించాడు. మంచి సందేశాత్మక కథ అయినప్పటికీ.. ఇది అందరికి తెలిసిన సబ్జెక్టే. రైతుల కష్టం నేపథ్యంలో ఇప్పటికే బోలెడు చిత్రాలు వచ్చాయి. కొత్తదనం లేకపోవడం ఈ సినిమా ప్రధాన లోపం. దానికి తోడు స్లో నెరేషన్‌ కూడా ప్రేక్షకుడిని కాస్త ఇబ్బంది పెడుతుంది. మిక్కీ జె. మేయర్ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. పెంచలదాస్ రాసి పాడిన ‘వస్తానంటివో’ పాట తప్ప మిగతావన్ని అంతంతమాత్రమే.

ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్స్‌.  ‘ఒక హీరో తన కొడుకును హీరో చేస్తున్నాడు.. ఒక డాక్టర్ తన కొడుకును డాక్టర్ చేస్తున్నాడు.. ఒక ఇంజనీర్ తన కొడుకును ఇంజనీర్ చేస్తున్నాడు.. కానీ ఒక రైతు మాత్రమే తన కొడుకును రైతు చేయడం లేదు’, ‘తినేవాడు నెత్తి మీద జుట్టంతా ఉంటే.. పండించేవాడు మూతి మీద మీసం అంత లేరు’లాంటి సంభాషణలతో రైతుల దీనగాథను వివరించారు. అలాగే ‘పనిని పట్టి పరువు.. పరువుని పట్టి పలకరింపు’, ‘ఉద్యోగం వస్తే అమ్మని బాగా చూసుకుందాం అని అనుకున్నానురా.. ఇప్పుడు ఉద్యోగం తప్ప ఇంకేం చూసుకోలేకపోతున్నా’అనే డైలాగ్స్‌ యువతను ఆలోచింపజేస్తాయి. స్క్రీన్‌ప్లే బాగుంది. ఎడిటర్‌ మార్తండ్‌ కె వెంకటేశ్‌ తన కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది. చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్‌ చేస్తే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. b

ప్లస్‌ పాయింట్స్‌
శర్వానంద్‌ నటన
సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్స్

మైనస్‌ పాయింట్స్‌
రొటీన్‌ స్టోరీ
స్లో నేరేషన్‌
సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లు
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు