‘నారప్ప’ ఓటీటీలోకి రావడంతో రెండ్రోజులు భోజనం చేయలేదు: శ్రీవిష్ణు

16 Aug, 2021 09:27 IST|Sakshi

హసిత్‌ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్‌ జంటగా నటించిన చిత్రం ‘రాజరాజ చోర’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘నేను వెంకటేశ్‌గారి వీరాభిమానిని. ‘నారప్ప’ చిత్రం ఓటీటీలోకి రావడంతో బాధ వేసి రెండు రోజులు భోజనం చేయలేదు.

పెద్ద సినిమాలు థియేటర్లలోకి రావాలంటే మాలాంటి చిన్న సినిమాలను బాగా ఆదరించాలి.. అప్పుడే మన సూపర్‌స్టార్‌ సినిమాలను స్క్రీన్‌పై చూసుకుంటాం. అందరి హీరోల అభిమానులు మా సినిమాని ఆదరిస్తే అనిల్‌గారు చెప్పినట్లు ప్యాన్‌ ఇండియా చిత్రం అవుతుంది. రాజ రాజ చోర సినిమా చూసే మహిళలకు నేను చాలా రోజులు గుర్తిండిపోతాను.

నన్ను చాలా అభిమానిస్తారు. ‘రాజరాజ చోర’ సినిమా ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. ఇది మన తెలుగు సినిమా. విడుదల తర్వాత ప్రతి భాషలోనూ ఈ చిత్రాన్ని కచ్చితంగా రీమేక్‌ చేస్తారు’ అని అన్నాడు. అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. శ్రీ విష్ణు కథల ఎంపిక బాగుంటుందని, ఈ చిత్రం తన కెరీర్‌లో ఓ బెస్ట్‌ మూవీ కావాలని కోరుకుంటున్నానన్నాడు. ‘రాజ రాజ చోర’ సినిమా చూశా.. కచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’ అని హీరో నారా రోహిత్‌ చెప్పుకొచ్చాడు. అలాగే డైరెక్టర్‌ హసిత్‌ గోలి మాట్లాడుతూ.. ‘నేను కూడా శ్రీవిష్ణుకు పెద్ద అభిమానిని. ఈ సినిమాలో కొంటె శ్రీవిష్ణును చూస్తారు’అని అన్నాడు. కాగా కార్యక్రమంలో దర్శకుడు వివేక్‌ ఆత్రేయ, నటుడు తనికెళ్ల భరణి, హీరోయిన్స్‌ మేఘా ఆకాష్, సునైన పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు