‘పెదకాపు’ ఓ కులానికీ సంబంధించిన చిత్రం కాదు: శ్రీకాంత్‌ అడ్డాల

29 Sep, 2023 00:47 IST|Sakshi

‘‘కొత్త బంగారు లోకం’, ‘ముకుందా’ ఇలా కొత్తవాళ్లతో సినిమాలు చేసిన అనుభవం నాకుంది. కొత్తవారితో పని చేయడం ఫ్రెష్‌గా బాగుంటుంది. అలా ఇప్పుడు ‘పెదకాపు 1’ చేశాను. అయితే కొత్తవాళ్లతో  రెండు భాగాలుగా ‘పెదకాపు’ వంటి భారీ బడ్జెట్‌ సినిమా తీయడం దర్శకుడిగా నాకో సవాల్‌. ఇంత ఖర్చు చేస్తున్నారు కాబట్టి సినిమాలో బాగా నటించడం అనేది విరాట్‌ ముందున్న సవాల్‌. 

సినిమా నిర్మాణం సజావుగా సాగేలా చేయడం రవీందర్‌ రెడ్డిగారి ముందున్న చాలెంజ్‌. ‘పెదకాపు 1’లో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరూ సవాల్‌గా తీసుకుని బాధ్యతతో పని చేశారు’’ అన్నారు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. విరాట్‌ కర్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పెదకాపు 1’. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో శ్రీకాంత్‌ అడ్డాల చెప్పిన విశేషాలు.

► 1982, 83 సమయాల్లో చోటు చేసుకున్న కొన్ని రాజకీయ సమీకరణాలకు కొంత ఫిక్షన్‌ను జత చేసి ఈ సినిమాను తెరకెక్కించాం. ఆ సమయంలో మా ఊర్లోని రాజకీయాల్లో మా నాన్నగారు క్రియాశీలకంగా ఉండేవారు. ఓ రకంగా ఈ సినిమాకు మా నాన్నగారు కూడా ఓ స్ఫూర్తి. ఇది ప్రత్యేకంగా ఏ కులానికీ సంబంధించిన చిత్రం కాదు. ఓ సారి ఓ ఊరికి వెళ్లినప్పుడు బోర్డుపై ఓ వ్యక్తి పేరు పక్కన ‘పెదకాపు’ అని ఉంది. అలా ఎందుకు అని అక్కడివారిని అడిగితే... పది మందిని కాపాడుతూ, పది మందికి సాయం చేసేవారిని పెదకాపుగా పిలుస్తామని చెప్పారు. మనం  చెబుతున్న కథ కూడా ఈ తరహాలోనే ఉంటుంది కాబట్టి ‘పెదకాపు’ టైటిల్‌ పెడదామని నిర్మాత రవీందర్‌గారితో చెప్పినప్పుడు బాగుంది.. సరే అన్నారు.

► ఓ సామాన్యుడి పోరాటమే ఈ సినిమా కథ. అందరికీ కనెక్ట్‌ అవుతుంది. సాధారణంగా కొత్తవారి కోసం కథలు రాసుకుంటుంటాం. ఇలా నేను రాసుకున్న కథల్లో ‘పెదకాపు’ ఒకటి. కథగా ఉన్నప్పుడే రెండు భాగాలుగా తీయాలనుకున్నాం. విరాట్‌ కర్ణకు ఇది తొలి సినిమా. మొదటి చిత్రానికి ప్రతి హీరోకు కొన్ని కష్టాలుంటాయి. అయితే విరాట్‌తో నటింపజేసే బాధ్యత ఓ దర్శకుడిగా నాది. తన నుంచి మంచి నటన రాబట్టుకున్నా. ఈ చిత్రానికి మిక్కీ సంగీతం ఓ ప్రధాన ఆకర్షణ. చోటాగారు మంచి విజువల్స్‌ ఇచ్చారు  

► ‘పెదకాపు’లో నేను చేసిన పాత్రకు ముందు ఓ మలయాళ నటుడిని అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల ఆయన సెట్స్‌కు రాలేదు. నాగబాబు, రావు రమేష్‌గార్లు ఇలా చాలామందితో కాంబినేషన్‌ సీన్స్‌ ఉన్నాయి. ప్రొడక్షన్‌ ఖర్చు కనిపిస్తోంది. దీంతో ఆ పాత్రను నేనే చేశాను. ఈ సినిమాకి నేను రాసిన డైలాగ్స్‌కు మంచి స్పందన వస్తుండటం హ్యాపీగా ఉంది. ‘నీకే అంత ఉంటే మాకు ఎంత ఉండాలి’ అనే డైలాగ్‌ అందరికీ చాలా కనెక్ట్‌ అయ్యింది. ఆల్రెడీ వేసిన కొన్ని ప్రీమియర్స్‌లో మంచి స్పందన వచ్చింది. ఆ డైలాగ్‌ కొన్నేళ్లు నిలిచిపోతుంది. ఇక ‘అన్నాయ్‌’ అనే మల్టీస్టారర్‌ కథ నా దగ్గర ఉంది. నా తర్వాతి ప్రాజెక్ట్‌ గీతా ఆర్ట్స్‌లో ఉంటుంది.

మరిన్ని వార్తలు