ప్రోత్సాహం ఉంటేనే ఉత్సాహం ఉంటుంది

24 Sep, 2023 03:46 IST|Sakshi
శ్రీకాంత్‌ అడ్డాల, మిర్యాల రవీందర్‌ రెడ్డి, వశిష్ఠ, విరాట్‌ కర్ణ, ప్రగతి శ్రీవాత్సవ

– దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల

విరాట్‌ కర్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పెదకాపు’. ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్‌ . శ్రీకాంత్‌ అడ్డాల నటించి, దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా తొలి భాగం ‘పెదకాపు 1’ ఈ నెల 29న విడుదల కానుంది.

ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అతిథిగా పాల్గొన్న ‘బింబిసార’ ఫేమ్‌ దర్శకుడు వశిష్ఠ మాట్లాడుతూ– ‘‘శ్రీకాంత్‌ అడ్డాలగారి సినిమాలు సాధారణంగా ప్రశాంతంగా ఉంటాయి. కానీ ఆయన జానర్‌ మార్చి షాక్‌ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ కావాలి’’ అన్నారు.

విరాట్‌ కర్ణ మాట్లాడుతూ– ‘‘ఇంత పెద్ద సినిమాను నాతో తీసిన నా బావగారికి రుణపడి ఉంటాను. ఓ నటుడిగా తొలి సినిమాకు ఉండాల్సిన జ్ఞాపకాలన్నీ నాకు ఈ సినిమాతో ఉన్నాయి’’ అన్నారు. శ్రీకాంత్‌ అడ్డాల మాట్లాడుతూ– ‘‘కొత్త హీరోతో పెద్ద స్క్రిప్ట్‌ చేస్తున్నప్పుడు రవీందర్‌లాంటి నిర్మాత తోడుగా ఉన్నప్పుడు...‘ఓ డైరెక్టర్‌ రా.. అందరి తరఫున నిలబడి ఓ సినిమా చేసుకోగలిగాడు’ అనే పేరు ఏదైతే ఉంటుందో దాన్ని ఎందుకు వదులుకోవాలి? అదే మనల్ని నడిపించేది.

ఎప్పుడైనా ప్రోత్సాహం ఉంటేనే ఉత్సాహం ఉంటుంది. ఈ చాన్స్‌ ఇచ్చిన రవీందర్‌ రెడ్డికి థ్యాంక్స్‌. ‘లైఫ్‌ ఆఫ్‌ పెదకాపు’గా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు.  మిర్యాల రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘విరాట్‌ కోసమే ‘పెదకాపు’ కథ కుదరిందనుకుంటున్నాను. మనం అనుకున్నది సాధించాలంటే పోరాటం తప్ప మరొకటి లేదు. అదే ఈ చిత్రకథ. ‘పెదకాపు 1’ రిలీజ్‌ తర్వాత తెలుగు సినిమా వెట్రిమారన్‌ గా శ్రీకాంత్‌ అడ్డాలని చెప్పుకుంటారు.

ఒక మనిషి.. ఒక కుటుంబం.. ఒక ప్రాంతం.. ఒక సమూహం.. ఇలా ఏదైనా కావొచ్చు.. నా అనుకునేవారి కోసం కాపు కాచుకుని ఉండే ప్రతి కాపుకు ఈ సినిమా అంకితం’’ అన్నారు. ‘‘ఆర్టిస్ట్‌గానూ శ్రీకాంత్‌ అడ్డాలగారికి పేరు రావాలని, విరాట్‌ పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు రావు రమేష్‌. ‘‘నేను శిక్షణ ఇచ్చిన వారిలో 245 మంది యాక్టర్స్‌ అయ్యారు. వీరిలో 156 మంది హీరోలుగా చేశారు. విరాట్‌ కర్ణ 156వ హీరో. విరాట్‌ను చూడగానే ప్రభాస్‌ గుర్తొచ్చారు’’ అన్నారు సత్యానంద్‌. ఛోటా  కె. నాయుడు, అనసూయ, బ్రిగిడ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు