Actor Srikanth: హీరోగా నన్ను తొలగించి రాజశేఖర్‌ని పెట్టారు.. చాలా బాధపడ్డా

17 Mar, 2022 21:34 IST|Sakshi

విలన్‌గా కెరీర్‌ ప్రారంభించి.. ఆ తర్వాత వరుస కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ ఫ్యామిలీ హీరోగా మారాడు శ్రీకాంత్‌. కొన్నాళ్ల పాటు హీరోగా పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. మరోవైపు సపోర్టింగ్‌ యాక్టర్‌గానూ రాణించాడు. చాలా కాలం తర్వాత ‘అఖండ’తో మళ్లీ విలన్‌గా మారాడు శ్రీకాంత్‌. అయితే తన కెరీర్‌ స్టార్టింగ్‌లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారట శ్రీకాంత్‌. హీరోగా చాన్స్‌లు రాకపోవడంతో వరుసగా విలన్‌ పాత్రలు చేసుకుంటూ వెళ్లారట. తమ్మారెడ్డి భరద్వాజ్‌ తనలో హీరోని చూసి.. వన్‌బై టు చిత్రంలో అవకాశం ఇచ్చారట.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ ఆమె, తాజ్‌మహాల్‌ చిత్రాలు నా కెరీర్‌కు చాలా ప్లస్‌ అయ్యాయి. పెళ్లి సందడి తర్వాత వెనక్కితిరిగి చూడలేదు. ఒకనొక దశలో ఏడాదిలో 13 సినిమాల్లో నటించాను. పగలు ఒక సినిమా, రాత్రి ఒక సినిమా షూటింగ్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి’అని శ్రీకాంత్‌ చెపుకొచ్చారు. అలాగే రాజశేఖర్‌ హీరోగా నటించిన వేటగాడు సినిమాలో తొలుత తననే హీరోగా తీసుకున్నారని, కానీ కొన్ని కారణాల వల్ల పక్కకు తప్పించారని చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో సౌందర్య, రంభ హీరోయిన్లు అని తెలియడంతో చాలా సంతోషపడ్డానని, కానీ చివరి క్షణంలో తీసేయడంతో అంతకు ఎక్కువగా బాధపడ్డానని చెప్పాడు. అయితే హీరోగా తొలగించినప్పటికీ.. ఆ సినిమాలో ఓ చిన్న పాత్రను చేశానని శ్రీకాంత్‌ చెప్పుకొచ్చాడు. 

మరిన్ని వార్తలు