అవ‌కాశాలొస్తే త‌ప్ప‌కుండా తెలుగు సినిమాలు చేస్తా: శ్రీరామ్‌

21 Oct, 2021 19:47 IST|Sakshi

శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా,  య‌ధార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం ‘అస‌లేం జ‌రిగింది’. ఎన్‌వీఆర్ దర్శకత్వం వహించగా, ఎక్సోడ‌స్ మీడియా ప‌తాకంపై మైనేని నీలిమా చౌద‌రి, కొయ్యాడ కింగ్ జాన్స‌న్ సంయుక్తంగా నిర్మించారు. గ్రామీణ నేప‌థ్యంతో కూడిన ఈ సినిమా  ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీరామ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. 

► రాఘ‌వ (ఎన్‌వీఆర్‌) మంచి ద‌ర్శ‌కుడు, క‌థ‌కుడు. అస‌లేం జ‌రిగింది సినిమా క‌థ నాకు చెప్పేట‌ప్పుడే దాంతో ప్రేమ‌లో ప‌డిపోయాను. క‌థ వినేట‌ప్పుడే ఇది మంచి ప్రాజెక్టు అయినా, ఇందులో చాలా ప‌రిమితులుంటాయ‌ని అర్థ‌మైంది. సినిమాలు చేయ‌డంలో ఈ బృందం మొత్తం చాలా ఉత్సాహంగా ఉండి, నిజాయితీగా ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని నాకు తెలియ‌డంతో.. ఇందులో చేసి తీరాల‌ని నిర్ణ‌యించుకున్నాను.

► ఇంత‌కుముందు నా సినిమాల‌కు తెలుగు డ‌బ్బింగ్ చెప్పుకునేట‌ప్పుడు కొన్ని ప‌దాలు ఇలా కాదు, అలా అనాల‌ని చెప్పేవారు. నాకు హైద‌రాబాదీ తెలుగు బాగా వ‌చ్చు. అది తెలంగాణ యాస‌కు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో నా ప‌ని సులువైంది. హైద‌రాబాదీని కావ‌డంతో ఈ సినిమా డ‌బ్బింగ్ చెప్ప‌గ‌లిగాను. అదొక్క‌టే కాదు, తెలంగాణ ప‌ల్లెల్లో షూటింగ్ జ‌ర‌గ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ చూడ‌ని ప్రాంతాల‌కు వెళ్ల‌గ‌లిగాను. నాపై న‌మ్మ‌కం ఉంచినందుకు నిర్మాత జాన్స‌న్ కు కృత‌జ్ఞ‌త‌లు.

► చెన్నై నుంచి ఇక్క‌డ‌కు షూటింగ్ రావ‌డం ఇబ్బంది అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ చ‌క‌చ‌కా సింగిల్ టేక్‌ల‌లోనే షాట్ల‌న్నీ ఓకే అవుతున్న తీరు చూసి మా యూనిట్ అంతా ఆశ్చ‌ర్య‌పోయింది. మ‌రిన్ని తెలుగు సినిమాలు చేయాల‌ని అంద‌రూ కోరారు. నిజంగానే అవ‌కాశాలొస్తే త‌ప్ప‌కుండా తెలుగు సినిమాలు చేస్తా. రొమాన్స్, ప్రేమ, ఫిక్ష‌న్.. అన్నీ క‌ల‌గ‌లిసి ఉన్న ఈ సినిమాలో పాట‌ల్లోని సాహిత్యం నాకు చాలా బాగా న‌చ్చింది.

► హీరోయిన్‌ సంచిత సినిమాల‌కు కొత్తే అయినా చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే త‌త్వం ఆమెది. భాష తెలియ‌క‌పోయినా, త‌న శాయ‌శ‌క్తులా క‌ష్ట‌ప‌డింది. ఈ సినిమా షూటింగ్ బాగా వేడివాతావ‌ర‌ణంలో జ‌ర‌గ‌డం, కొన్నిసార్లు అస‌లు గ్యాప్ లేకుండా చేయ‌డం.. ఇలాంటివి ఎన్నో ఉన్నా అన్నింటినీ సుల‌భంగా త‌ట్టుకుంది. కొన్ని లొకేష‌న్లు అస‌లు అమ్మాయిల‌కు స‌రిపోయేవి కావు. అయినా ఆమె ముందుకు రావ‌డం నాకు చాలా న‌చ్చింది.

మరిన్ని వార్తలు