ఆర్యన్ డ్రగ్స్‌ వివాదంపై షారుక్‌కి.. మద్దతు తెలిపిన బాలీవుడ్‌ ప్రముఖులు

4 Oct, 2021 08:29 IST|Sakshi

డ్రగ్స్‌ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం 8మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారందరికీ వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో హాజరు పరిచారు.

అయితే డ్రగ్స్‌ కేసు విషయంలో పలువురు బాలీవుడ్‌ సెలబ్రీటీలు షారు‍క్‌ ఖాన్‌కి మద్దతు ప్రకటించారు.  అందులో బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌ తల్లి పూజా భట్‌ ఒకరు. ‘చాహత్‌’లో బాద్‌షాతో కలిసి పని చేసిన ఈ నటి ‘నేను మీకు సపోర్టుగా నిలుస్తున్నాను షారుఖ్‌. ఇది మీకు అవసరం లేకపోవచ్చు. కానీ నేను చేస్తాను. ఈ సమయం కూడా గడిచిపోతుంది’ అని సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేసింది.

అంతేకాకుండా ‘కభీ హన్ కభీ నా’ మూవీలో షారుక్‌తో కలిసి నటించిన సుచిత్ర కృష్ణమూర్తి సైతం ఆయనకు సపోర్టుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. పిల్లలు ఇబ్బందులు పడడం చూడడం కంటే పెద్ద కష్టం తల్లిండ్రులకు ఏది ఉండదని నటి తెలిపింది. అంతేకాకుండా..‘ ఇంతకుముందు కూడా ఇలాగే బాలీవుడ్‌ నటులపై రైడ్స్‌ జరిగాయి. కానీ అందులో ఏం దొరకలేదు. ఏది ప్రూవ్‌ కాలేదు. మాతో తమషా చేయడం మామూలు అయిపోయింది కానీ అది మా ఫేమ్‌ని దెబ్బతీస్తుంది’ అని రాసుకొచ్చింది.

అయితే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ ప్రకారం ఏదైనా మాదక ద్రవ్యం లేదా సైకోట్రోపిక్ పదార్థాన్ని వినియోగించినందుకు వివిధ సెక్షన్ల కింద ఎన్‌సీబీ ముగ్గురిపై కేసులు నమోదు చేసిందని తెలుస్తోంది.

చదవండి: షారుక్‌ కొడుకు ఫోన్‌ సీజ్‌.. డ్రగ్స్‌ కేసులో ప్రమేయంపై విచారణ?

మరిన్ని వార్తలు