జనని పాట ఆర్‌ఆర్‌ఆర్‌ ఆత్మ

26 Nov, 2021 05:11 IST|Sakshi
డీవీవీ దానయ్య, రాజమౌళి

– రాజమౌళి

‘‘జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి ఆత్మలాంటిది. ఈ పాట కోసం పెద్దన్న (కీరవాణి) రెండు నెలలు శ్రమించారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్‌ కూడా రాశారు’’ అని దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి అన్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో ఆలియా భట్, ఒలీవియా మోరీస్‌ కథానాయికలుగా నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా జనవరి 7న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌ని ప్రారంభించింది.

ఇందులో భాగంగా నేడు ‘జనని..’ అనే పాటను విడుదల చేయనుంది. దేశభక్తిని చాటే విధంగా రూపొందించిన ఈ పాటను ఒక్కరోజు ముందుగా గురువారం హైదరాబాద్‌లో విలేకరుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ– ‘‘డిసెంబరు మొదటి వారంలో ట్రైలర్‌ విడుదల చేస్తాం. వరుసగా ప్రీ రిలీజ్‌ వేడుకలు ఏర్పాట్లు చేస్తున్నాం. ‘జనని..’ పాటలో కనిపించని భావోద్వేగాలుంటాయి. ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలానే సాఫ్ట్‌ ఎమోషన్‌ కనిపించదు. కానీ సినిమా సోల్‌ మొత్తం ఆ పాటలోని భావోద్వేగంలోనే దాగి ఉంటుంది’’ అన్నారు. నిర్మాత డీవీవీ దానయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు