Rajamouli Emotional Post: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆయనతో ఓ షాట్‌ ప్లాన్‌ చేశా, కానీ..

1 Dec, 2021 17:27 IST|Sakshi

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ మృతిపై దర్శక ధీరుడు రాజమౌళి సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్‌ షేర్‌ చేస్తూ సిరివెన్నెలకు సంతాపం తెలిపారు. తన ట్విటర్‌లో పోస్ట్‌ షేర్‌ చేస్తూ సిరివెన్నెలతో తన జర్నీని పంచుకున్నారు. ‘‘1996లో మేము ‘అర్దాంగి’ అనే సినిమాతో సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని స్థితి. అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చి, వెన్నుతట్టి ముందుకు నడిపించినవి ‘ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. ఎప్పుడూ వదులు కోవద్దురా ఓరిమి’ అన్న సీతారామశాస్త్రి గారి పదాలు. భయం వేసినప్పుడల్లా గుర్తు తెచ్చుకుని పాడుకుంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేది. 

అప్పటికీ నాకు శాస్త్రి గారితో పరిచయం చాలా తక్కువ. మద్రాసులో డిసెంబర్‌ 31వ తారీకు రాత్రి పది గంటలకు ఆయన ఇంటికి వెళ్లాను. ‘ఏం కావాలి నందీ’ అని అడిగాడు. ఒక కొత్త నోట్‌బుక్‌ ఆయన చేతుల్లో పెట్టి మీ చేతుల్తో ఆ పాట రాసివ్వమని అడిగాను. రాసి ఆయన సంతకం చేసి ఇచ్చారు. జనవరి 1న మా నాన్నగారికి గిఫ్ట్‌గా ఇచ్చాను. నాన్న గారి కళ్లల్లో ఆనందం. మాటల్లో కొత్తగా ఎగదన్నుకొచ్చిన విశ్వాసం ఎప్పటికీ మర్చిపోలేను. ‘సింహాద్రి’ చిత్రంలో ‘అమ్మాయినా.. నాన్నయినా.. లేకుంటే ఎవరైనా’ పాట, ‘మర్యాద రామన్న’లో ‘పరుగులు తియ్‌’ పాట, ఆయనకి చాలా ఇష్టం. అమ్మ నాన్న లేకపోతే ఎంత సుఖమో అని కానీ, పారిపోవడం చాలా గొప్ప అని కానీ ఎలా రాస్తాము నంది అని తిట్టి,

మళ్లీ ఆయనే ‘ఐ లైక్‌ దిస్‌ ఛాలెంజ్‌’ అంటూ మొదలు పెట్టారు. కలిసినప్పుడల్లా ప్రతీ లైన్‌ నెమరేసుకుంటూ అర్థాన్ని మళ్లీ విపులీకరించి చెప్తూ ఆయన స్టైల్‌లో గది దద్దరిల్లేలా నవ్వుతూ, పక్కనే ఉంటే వీపుని గట్టిగా చరుస్తూ ఆనందించేవారు. చివరగా ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో దోస్త్‌ మ్యూజిక్‌ వీడియోకి లిరిక్‌ పేపర్‌లో ఆయన సంతకం చేసే షాట్‌ తీద్దామని చాలా ప్రయత్నించాం. కానీ అప్పటికే ఆరోగ్యం సహకరించక కుదర్లేదు. ఇది ఆయనతో నాకున్న గొప్ప జ్ఞాపకం. నా జీవన గమనానికి దిశా నిర్ధేశం చేసిన సీతారామశాస్తి కలానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ’’ అంటూ రాజమౌళి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. 

మరిన్ని వార్తలు