కిరీటి లుక్స్‌ బాగున్నాయి– రాజమౌళి

5 Mar, 2022 05:30 IST|Sakshi
శ్రీలీల, కిరీటి, జెనీలియా, రాజమౌళి

‘‘కిరీటిని పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. తన లుక్స్‌ చాలా బాగున్నాయి. నటుడికి కావాల్సిన అన్ని అర్హతలు కిరీటిలో ఉన్నాయి. నటన, డ్యాన్స్, ఫైట్స్‌ అన్నీ బాగా చేయగలడు. వారాహి బేనర్‌లో కిరీటి సినిమా చేయడం ఆనందంగా ఉంది. మంచి తారాగణం, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రం రూపొందుతోంది’’ అని డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళి అన్నారు. కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్‌ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమవుతున్న చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌.

జెనీలియా, డాక్టర్‌ రవిచంద్రన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వారాహి చలనచిత్రం పతాకంపై తెలుగు–కన్నడ భాషల్లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి కన్నడ స్టార్‌ రవిచంద్రన్‌ వి. కెమెరా స్విచ్చాన్‌ చేయగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి క్లాప్‌ కొట్టారు. ఈ సందర్భంగా జెనీలియా మాట్లాడుతూ– ‘‘నేను నటనకు దూరమై పదేళ్లయింది. కిరీటి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాను’’ అన్నారు. ‘‘నేను సినిమాల్లోకి రావడానికి అప్పు సార్‌ (పునీత్‌ రాజ్‌కుమార్‌) స్ఫూర్తి. యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది’’ అన్నారు కిరీటి. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: సెంథిల్‌ కుమార్‌.

మరిన్ని వార్తలు