SS Rajamouli In Kalki 2898 AD: కల్కికి అతిథిగా...

1 Sep, 2023 04:10 IST|Sakshi

దర్శకుడిగా ఎక్కువగా కెమెరా వెనకాల ఉండే రాజమౌళి అప్పుడప్పుడూ  నటుడిగా కెమెరా ముందుకు వస్తుంటారు. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘సై’, ‘మగదీర’, ‘బాహుబలి: ది బిగినింగ్‌’ ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాల్లో సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించారు రాజమౌళి. ఇతర దర్శకుల చిత్రాలైన ‘రెయిన్‌ బో’, ‘మజు్న’ల్లో అతిథి పాత్రల్లో కనిపించారు. తాజాగా ‘కల్కి 2898ఏడీ’ చిత్రంలో అతిథిగా కనిపించేందుకు రాజమౌళి అంగీకరించారని సమాచారం.

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశి్వన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నేడు ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌ సన్నివేశాలను చిత్రీకరించేలా నాగ్‌ అశ్విన్‌ ప్లాన్‌ చేశారని తెలిసింది. ఈ ఒక్క రోజుతో రాజమౌళి పాత్ర చిత్రీకరణ పూర్తవుతుందని భోగట్టా. ఇక దీపికా పదుకోన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ వచ్చే ఏడాది విడుదల కానుంది.

మరిన్ని వార్తలు