SS Rajamouli: అందుకే మీకు చరణ్‌ డామినేషన్‌ ఎక్కువ ఉందనిపిస్తుంది

13 Apr, 2022 14:01 IST|Sakshi

ఈ కోణంలో చూస్తే మీకు తారక్‌ డామినేషన్‌ కనిపిస్తుంది

Rajamouli Response On Ram Charan Domination In RRr Movie: ఆర్‌ఆర్‌ఆర్.. మూవీ విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ మూవీ మేనియా ఏమాత్రం తగ్గేలేదు. ఇప్పటికీ థియేటర్లో ఆర్‌ఆర్‌ఆర్‌ హావానే కొనసాగుతుంది. ఇందులో కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామారాజుగా రామ్‌ చరణ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాకు ముందు ప్రమోషన్‌ కార్యక్రమాలతో ఫుల్‌ బిజీ అయిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీం విడుదల అనంతరం సక్సెస్‌ మీట్స్‌తో క్షణం తీరిక లేకుండా వరుసగా ఇంటర్య్వూలు ఇస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన దగ్గర్నుంచి ఓ అంశంపై మాత్రం సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. 

చదవండి: బంపర్‌ ఆఫర్‌, బీస్ట్‌ మూవీ చూసిన వారికి ఒక లీటర్‌ పెట్రోల్‌ ఉచితం!

ఈ క్రమంలో ఇటీవల ముంబైలో జరిగిన సక్సెస్‌ మీట్‌లో దీనిపై చరణ్‌కు ఓ రిపోర్టర్‌ నుంచి ప్రశ్న కూడా ఎదురైంది. అయితే దీనికి చరణ్‌ ‘ఒక్క క్షణం కూడా నేను అలా అనుకోను. డామినేషన్‌ అన్న పదాన్ని నేను నమ్మను కూడా. అందులో నిజం లేదు’ అంటూ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. అయినా దీనిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రస్తావన వచ్చిప్పుడల్లా ఈ అంశాన్ని లెవనెత్తున్నారు. దీంతో చరణ్‌ డామినేషన్‌పై చర్చలు, గుసగుసల తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో ఈ అంశంపై రాజమౌళి స్పందించారు. 

ఇందులో ఎవరి డామినేషన్‌ లేదని.. తారక్‌, చరణ్‌లు ఇద్దరు తమ బెస్ట్‌ ఇచ్చారన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘చరణ్ డామినేషన్ ఎక్కువగా ఉంది అన్నమాట సరైనది కాదు. ఏదైనా మనం చూసే దృష్టిలోనే ఉంటుంది. క్లైమాక్స్‌లో రామ్ చరణ్‌కు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండడం వల్ల.. అది చూసి బయటికి వచ్చే ప్రేక్షకులకు చరణ్ డామినేషన్ ఉందినిపించవచ్చు. అదే కొమురం భీముడో పాట దగ్గరే క్లైమాక్స్ ఉండుంటే అప్పుడు ఎన్‌టీఆర్ డామినేషన్ ఉన్నట్టు అనిపించేది’ అంటూ జక్కన తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. 

చదవండి: ‘బీస్ట్‌’మూవీ రివ్యూ

అలాగే ‘‘ఈ సినిమాలో తారక్‌, చరణ్‌ను రెండుసార్లు రక్షించాడు. చరణ్‌ మాత్రం తారక్‌ను ఒక్కసారి మాత్రమే సేవ్‌ చేశాడు. అంతేకాదు ఓ చోట చరణ్‌ ‘15 సంవత్సరాలుగా స్పష్టత లేని నా గోల్‌కు తారక్‌ దారి చూపించాడు. ఆయుధం ఒక్కటే ధైర్యం అనుకున్న నాకు అతడు ఎమోషన్‌ కూడా ఓ ఆయుధంగా చూపించాడు’ అంటూ చరణ్‌, తారక్‌ను ప్రశంసిస్తాడు.. అంటే ఇక్కడ తారక్‌ హీరో.. చరణ్‌ అతని ఫాలోవర్ అనుకోవచ్చు కదా. ఈ విధంగా చూస్తే మీకు తారక్‌ డామినేషణ్‌ కూడా కనిపిస్తుంది’’ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. కాగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ 3 వారాల్లోనే రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. 

మరిన్ని వార్తలు