భారీ ధరకు అమ్ముడుపోయిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ హక్కులు!

3 Mar, 2021 17:38 IST|Sakshi

బాహుబలితో తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చాడు దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. ఈ సినిమా తర్వాత సుదీర్ఘ గ్యాప్‌ తీసుకుని తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రమే ఆర్‌ఆర్‌ఆర్‌. టాలీవుడ్‌ స్టార్లు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు సైతం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా డిజిటల్‌ హక్కులను విక్రయించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

స్టార్‌ నెట్‌వర్క్‌ సంస్థ ఈ సినిమా ఓటీటీ హక్కులను అక్షరాలా రూ.200 కోట్లకు కొనుగోలు చేనట్లు ఓ వార్త తెగ వైరల్‌ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ హక్కులను స్టార్‌ నెట్‌వర్క్‌ సొంతం చేసుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అంటే థియేటర్‌లో రచ్చరచ్చ చేసిన తర్వాత ఈ చిత్రం నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫాం డిస్నీ + హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వస్తుందంటున్నారు. ఇక అప్పుడే 200 కోట్ల రూపాయల బిజినెస్‌ జరిగితే ఇక థియేటర్లలో అడుగు పెట్టినప్పుడు ఇంకే రేంజ్‌లో బిజినెస్‌ జరుగుతుందోనని అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇది కానీ నిజమైతే మాత్రం ఓటీటీలోనూ ఆర్‌ఆర్‌​ఆర్‌ కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సుమారు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సుమారు పది భాషల్లో విడుదల కానుంది.

ఇందులో రామ్‌ చరణ్‌–ఆలియా ఓ జంటగా, ఎన్టీఆర్‌–ఒలీవియా మోరిస్‌ ఓ జంటగా నటిస్తున్నారు. కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో రామ్ ‌చరణ్‌-అలియా భట్‌పై రెండు పాటలు చిత్రీకరించనుండగా అందులో ఒకటి రొమాంటిక్‌ సాంగ్‌ అని టాక్‌. ఒక పాటను ఆలియా స్వయంగా పాడనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆమె పాడనుంది హిందీ వెర్షన్‌కి సంబంధించిన పాట అని సమాచారం. దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదల కానుంది.

చదవండి: ఆలిండియా బాక్సాఫీస్‌ను షేక్‌ చేయనున్న తెలుగు సినిమాలు

ఆర్‌ఆర్‌ఆర్‌: రాజమౌళి కాపీ కొట్టారట!

మరిన్ని వార్తలు