SS Rajamouli: ఆ విషయంలో నిరాశపడ్డాను! విమర్శకుల ప్రసంశల గురించి పెద్దగా ఆలోచించను.. నాకు కావాల్సింది అదే!

21 Jan, 2023 01:12 IST|Sakshi

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు ఇండియా తరఫున అఫీషియల్‌ ఎంట్రీగా ఎంపిక కాకపోవడం అనేది కాస్త నిరుత్సహపరిచిందని దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు. ఓ ఆంగ్ల ఆన్‌లైన్‌ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విధంగా స్పందించారు. ‘‘మన దేశం తరఫున ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు అధికారిక ఎంట్రీ లభించకపోవడంతో నిరాశ చెందాను.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఆఫీషియల్‌ ఎంట్రీ లభిస్తే బాగుండేదన్నట్లుగా విదేశీయులు సైతం అనుకుంటున్నారు. అయితే మా సినిమాకు ఎందుకు అధికారిక ఎంట్రీ లభించలేదు? అని పదే పదే ఆలోచిస్తూ ఉండే మనస్తత్వాలు కావు మావి. జరిగిందేదో జరిగిపోయింది. మనం ముందుకు సాగిపోవాలి. అయినా ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌ఐ) కమిటీ నియమ, నిబంధనలు, మార్గదర్శకాలు వంటి అంశాల గురించి నాకు తెలియదు కాబట్టి నేను ఈ విషయంపై కామెంట్‌ చేయాలనుకోవడం లేదు. ఇక దేశం తరఫున అఫీషియల్‌ ఎంట్రీగా పంపిన ‘ఛెల్లో షో’ (గుజరాతీ ఫిల్మ్, ఇంగ్లిష్‌లో ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో) చిత్రానికి ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌లో స్థానం లభించినందుకు నాకు సంతోషంగా ఉంది.

ఎందుకంటే ఇది కూడా ఇండియన్‌ సినిమాయే’’ అని చెప్పుకొచ్చారు రాజమౌళి. కాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటునాటు’ సాంగ్‌కు ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌లో స్థానం లభించింది. ఇక గుజరాతీ ఫిల్మ్‌ ‘ఛెల్లో షో’ ఇండియా తరఫున అధికారిక ఎంట్రీగా బెస్ట్‌ ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ విభాగంలో షార్ట్‌లిస్ట్‌ కాగా, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాటు మరో ఎనిమిది ఇండియన్‌ చిత్రాలు ‘ఆస్కార్‌ రిమైండర్‌ లిస్ట్‌’లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు సంబంధించిన నామినేషన్స్‌ ఈ నెల 24న వెల్లడికానున్నాయి. అవార్డ్‌ ఫంక్షన్‌ మార్చిలో జరగనుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన విషయం తెలిసిందే.

డబ్బు కోసమే... డబ్బు, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఓ దర్శకుడిగా నేను సినిమాలు తీస్తాను. విమర్శకుల ప్రసంశల గురించి పెద్దగా ఆలోచించను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓ కమర్షియల్‌ ఫిల్మ్‌. బాక్సాఫీస్‌ వద్ద నా సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ అయితే నేను హ్యాపీ. అవార్డ్స్‌ను బోనస్‌లా భావిస్తాను. అయితే ఓ సినిమా కోసం పడిన కష్టానికి గుర్తింపు లభిస్తే నాకు, నా చిత్రబృందానికి సంతోషం అనిపిస్తుంది’’ అని కూడా పేర్కొన్నారు రాజమౌళి. ఇక మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి తర్వాతి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు