త్రివిక్రమ్‌ సినిమా : మరోసారి మహేశ్‌కు జోడిగా ఆ హీరోయిన్‌

4 May, 2021 14:40 IST|Sakshi

దాదాపు 11 ఏళ్ల తర్వాత సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి సినిమా ‘అతడు’ బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టింది. అప్పటి వరకు వరుస పరాజయాలతో సతమతమవుతున్న మహేశ్‌కు ఈ మూవీలో మరో భారీ హిట్‌ దొరికింది. ఇక ఆ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ఖలేజా’ కు మిశ్రమ స్పందన వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడినప్పటికీ...బుల్లితెరపై రికార్డు సృష్టించింది. ఈ రెండు సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతుందని ఎప్పటి నుంచో పుకార్లు వినిపించాయి. తాజాగా ఆ ప్రాజెక్ట్‌ ఓకే అయింది. త్రివిక్రమ్‌ చెప్పిన కథ మహేశ్‌కి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడు.

ఇదిలా ఉంటే  తివిక్రమ్‌తో మహేశ్‌ సినిమా అనగానే.. టైటిల్‌ ఏంటి? సినిమా కథ ఏంటి? అసలు ఈ మూవీలో మహేశ్‌కు జోడి కట్టనున్న బ్యూటీ ఎవరనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ హ్యాట్రిక్‌ మూవీకి సంబంధించి ఓ వార్త ‘ఫిల్మీ దునియా’లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను అనుకుంటున్నట్లు ఆ వార్త సారాంశం.

త్రివిక్రమ్‌-అల్లు అర్జున్‌ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్‌ హిట్‌ ‘అల వైకుంఠపురములో’ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. అలాగే మహేశ్‌తో ‘మహర్షి’లోనూ పూజానే హీరోయిన్‌. ఈ రెండు సినిమాలు సూపర్‌ హిట్‌గా నిలవడంతో.. తమ హ్యాట్రిక్‌  మూవీకి కూడా పూజానే అయితే బెటర్‌ అని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడట. మహేశ్‌ కూడా ఓకే చెప్పినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో మహేశ్‌ కొత్తగా కనిపించబోతున్నాడట. గత చిత్రాల మాదిరిగా ఈ సినిమాలో యాక్షన్‌ సీన్లు ఉండబోవని సమాచారం. ఇక ఈ సినిమా టైటిల్‌ని మే 31న అఫిషియల్‌గా అనౌన్స్‌ చేయబోతున్నట్లు సమాచారం. ఇక మహేశ్‌ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది.  ఈ మూవీ చిత్రీకరణ అనంతరం త్రివిక్రమ్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుంది. 

మరిన్ని వార్తలు