Tollywood Meeting: టాలీవుడ్‌ మీటింగ్‌కు స్టార్‌ హీరోల డుమ్మా

21 Feb, 2022 08:50 IST|Sakshi

మూడు నెలల తర్వాత మరోసారి సమావేశం

‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్, 24 క్రాఫ్ట్స్‌ ఫెడరేషన్, ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) కలిసి సమస్యల పరిష్కారం కోసం కలిసి కట్టుగా ముందుకు వెళతాం’’ అని ఫిల్మ్‌ చాంబర్‌ జనరల్‌ సెక్రటరీ, నిర్మాత దామోదర ప్రసాద్‌ అన్నారు. కోవిడ్‌ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించేందుకు ‘తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆధ్వర్యంలో నిర్మాత జి.ఆది శేషగిరిరావు అధ్యక్షతన సినీ ప్రముఖులు ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.

సమావేశం అనంతరం దామోదర ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ– ‘‘చాంబర్‌ తరఫున సబ్‌ కమిటీ ఏర్పాటు చేసి అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయాల కోసం ముందుకువెళతాం. మూడు నెలల తర్వాత మరోసారి సమావేశమై చర్చిస్తాం’’ అన్నారు. ‘‘టాలీవుడ్‌కి ఫిల్మ్‌ చాంబర్, నిర్మాతల మండలి పెద్ద దిక్కు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సినిమాలకు సంబంధించి ఏ చర్చ అయినా వీటితోనే జరపాలి’’ అని నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌ అన్నారు. సినిమా పరిశ్రమకు మేలు జరిగేందుకు ప్రభుత్వాలతో ఎవరు చర్చించినా అభ్యంతరం లేదు. కానీ, కలిసే ముందు ఫిల్మ్‌ చాంబర్, నిర్మాతల మండలిని సంప్రదించాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమయింది.

కాగా ఈ సమావేశానికి 250మందిని ఆహ్వానించినా కేవలం 60–70 మంది మాత్రమే వచ్చారు. స్టార్‌ హీరోలెవరూ ఈ సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం. దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్, నవీన్‌ ఎర్నేని, చదలవాడ శ్రీనివాసరావు, నిరంజన్‌ రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, ఎన్‌.వి.ప్రసాద్, అశోక్‌ కుమార్, వై. రవి, అనిల్‌ సుంకర, నటులు మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు