Happy Birthday Sai Pallavi: మరో అద్భుతమైన మూవీలో డ్యాన్సింగ్‌ క్వీన్‌

9 May, 2022 11:13 IST|Sakshi

టాలీవుడ్‌లో అందాల తారగా పల్లవించి పరిమళిస్తున్న స్టార్‌ హీరోయిన్‌ సాయిపల్లవి. అభినయమే ఆభరణంగా, నాట్యమయూరిగా ఆడియెన్స్‌ను మెస్మరైజ్‌ చేయగల నైపుణ్యం సాయి పల్లవి సొంతం. అందుకే కేవలం ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు అనేక వైవిధ్యమైన పాత్రల్లో అమోఘంగా ఒదిగిపోయే నాచురల్ బ్యూటీ సాయి పల్లవి అంటే దర్శక నిర్మాతలకు కూడా ఆల్‌ టైం ఫావరెట్‌ హీరోయిన్‌. మే 9న సాయి పల్లవి బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌, పలువురు సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలందిస్తున్నారు. 

సాయిపల్లవి 1992 మే 9న తమిళనాడు నీలగిరి జిల్లాలోని కోటగిరిలో జన్మిచింది. కొయంబత్తూర్ లోని అవిలా కాన్వెంట్ స్కూల్ లో సాయి పల్లవి విద్యాభ్యాసం సాగింది. చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ఎంతో ప్రాణం. నాట్యంలో ప్రత్యేక శిక్షణ ఏమీ లేనప్పటికీ, సినిమా పాటలకు అలవోకగా డాన్స్‌లతో ఆకట్టుకుంది. చివరికి  జార్జియాలోని టిబిలిసి మెడికల్ యూనివర్సిటీలో డాక్టర్ కోర్సు  స్టడీకి  బ్రేక్‌ ఇచ్చి మరీ  సినిమా రంగంవైపు అడుగులు వేసింది.


 
2005లో మళయాళం దర్శకుడు ఎ.కె.లోహిత్ దాస్ తాను దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కస్తూరి మాన్’లో తెరంగేట్రం చేసింది సాయిపల్లవి. 2008లో జయం రవి హీరోగా రూపొందిన ‘ధామ్ ధూమ్’లోనూ నటించింది. 2014లో మళయాళ చిత్రం ‘ప్రేమమ్’లో నాయికగా నటించి  ఆకట్టుకుంది. ఇక 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో  తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరైంది. భానుమతి పాత్రలో, తెలంగాణా యాసలో డైలాగులు పలికి తన  ప్రతిభను చాటుకుంది. అలాగే కోట్ల రూపాయల విలువ చేసే ఫెయిర్‌ నెస్‌ క్రీము,తదితర వాణిజ్య ప్రకటనలకు  నిరాకరించి, మరింతమంది అభిమానులను సొంతం చేసుకుంది. 

తాజాగా గౌతం రామచంద్రన్‌ దర్శకత్వంలో గార్గ్‌ అనే మూవీలో నటిస్తోంది.  సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌  గ్లిమ్స్‌ను విడుదల చేసింది.  ఈ మూవీ తమిళం, మలయాళం, కన్నడ తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. సాయి పల్లవి కవల సోదరి పూజకూడా సినిమాల్లోనే రాణించేందుకు ప్రయత్నిస్తోంది. 

ఇక ఆ తరువాత నాని హీరోగా‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ , మారి 2 మూవీలో  రౌడీ బేబీగా  సాయి పల్లవి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది. “కణం, పడి పడి లేచె మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్” చిత్రాల్లో సాయిపల్లవి తనదైన అభినయంతో ఆకట్టుకుంది. ఇంకా కణం,  దియా, సూర్య 36,  ఎన్‌జీకే లాంటి మూవీల్లో కూడా  నటించింది. ముఖ్యంగా లవ్‌ స్టోరీ మూవీలోని స్టెప్టులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇటీవల శ్యామ శింగరాయ్‌  మూవీలో దేవదాసి రోజీ పాత్రలో సాయి పల్లవి మంచి మార్కులు కొట్టేసింది.  తెలుగుతోపాటు తమిళ, మళయాళ చిత్రసీమలోనూ సాయిపల్లవి దూసుకుపోతోంది.

టాలీవుడ్‌ విలక్షణ హీరో దగ్గుబాటి రానాతో కలసి సాయిపల్లవి నటించిన ‘విరాటపర్వం’ మూవీకోసం ఫ్యాన్స్‌ చాలా  ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్రం జూలై 1న  రిలీజ్‌   కానున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరోయిన్‌ పుట్టిన రోజు సందర్భంగా రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో తన ప్రతిభను చాటుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు