నా కెరీర్‌లో గేమ్‌ చేంజర్‌ అయ్యే చిత్రమిది: సుధీర్‌ బాబు

5 Dec, 2023 10:22 IST|Sakshi

‘‘హరోం హర’ సినిమా కోసం యూనిట్‌ అంతా చాలా కష్టపడ్డాం. ఒక్కో రోజు సెట్స్‌లో వెయ్యిమంది ఉండేవారు. మంచి ఎమోషన్స్, హై కమర్షియల్‌ కంటెంట్‌ ఉన్న చిత్రమిది. ఇందులో చాలా బలమైన పాత్ర చేశాను. ఈ సినిమా నా కెరీర్‌లో గేమ్‌ చేంజర్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సుధీర్‌ బాబు. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో సుధీర్‌ బాబు హీరోగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ పతాకంపై సుమంత్‌ జి. నాయుడు నిర్మించిన పాన్‌ ఇండియా చిత్రం ‘హరోం హర’. మాళవికా శర్మ హీరోయిన్‌.

హైదరాబాద్‌లో యూనిట్‌ నిర్వహించిన ఈ చిత్రం టీజర్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో సుధీర్‌ బాబు మాట్లాడుతూ– ‘‘సుమంత్‌ జి. నాయుడు వంటి నిర్మాతలు చిత్ర పరిశ్రమకు రావాలి. మైత్రీ, సితార, వైజయంతి.. లాంటి బ్యానర్స్‌లానే కథని నమ్మి ఎంతైనా ఖర్చు పెట్టే నిర్మాణ సంస్థగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ పరిశ్రమలోకి వచ్చినట్లేనని నమ్ముతున్నాను.

నా కోసమే ఈ చిత్రకథ రాసుకొచ్చిన సాగర్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘నా రెండో చిత్రానికి ఇంత హై బడ్జెట్‌ ఇస్తారని ఊహించలేదు. మంచి సినిమా చేశాం’’ అన్నారు జ్ఞానసాగర్‌. ‘‘నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. టీజర్‌కి వస్తున్న స్పందన చూస్తుంటే ఓ మంచి సినిమా చేశాననే నమ్మకం వచ్చింది’’ అన్నారు సుమంత్‌ జి. నాయుడు. ఈ వేడుకలో కెమెరామేన్‌ అరవింద్, యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు