గట్టిగానే కొట్టిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' కలెక్షన్స్‌.. నేడు ఈ థియేటర్స్‌లోకి హీరో,హీరోయిన్‌

4 Feb, 2024 07:56 IST|Sakshi

క‌ల‌ర్‌ఫొటో, రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్​ హీరో సుహాస్​. గతంలో వచ్చిన ఆ రెండు చిత్రాలు సూపర్‌ హిట్‌ కొట్టాయి. తాజగా విడుదలైన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌తోనే దూసుకుపోతుంది. స‌మాజంలోని అంత‌రాలు, ప‌రువు, ప్రేమ నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్‌కు బాగా దగ్గరైందని చెప్పవచ్చు.

దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివాని నాగరం హీరోయిన్‌గా మెప్పిస్తే.. హీరో అక్కగా శరణ్య ప్రదీప్ దుమ్మురేపిందని ప్రేక్షకులు తెలుపుతున్నారు. 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ బండారి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ అయిన మోషన్ పిక్చర్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రానికి తొలిరోజు అద్భుతమైన ఓపెనింగ్స్‌ దక్కాయి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ సాధించినట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం అందరి అంచనాలకు మించి  ఓపెనింగ్స్‌ను  సాధించింది. హార్డ్ హిట్టింగ్ బ్లాక్‍బాస్టర్ అంటూ మేకర్స్‌ ఒక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. రెండో రోజు సుమారు రెండున్న కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లోనే రూ.5.16 కోట్లు రాబట్టింది. ఏదేమైనా హీరో సుహాస్‌ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సౌండ్‌ గట్టిగానే వినిపిస్తోంది.

రాయలసీమకు రానున్న హీరో,హీరోయిన్‌
'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' చిత్రానికి పాజిటివ్‌ రావడంతో చిత్ర యూనిట్‌తో పాటు సుహాస్‌, హీరోయిన్‌ శివాని నాగరం రాయలసీమలో సక్సెస్‌ టూర్‌ ప్లాన్‌ చేశారు. ఇందులో భాగంగా నేడు (ఫిబ్రవరి 4న) మొదటగా కర్నూలులోని ఆనంద్‌ థియేటర్‌కు మధ్యాహ్నం 12: 30గంటలకు చిత్ర యూనిట్‌ రానుంది. ఆ తర్వాత కడపలోని రాజా థియేటర్‌కు మధ్యాహ్నం 3:30 గంటలకు వారి షెడ్యూల్‌ ఉంది. చివరగా తిరుపతిలోని ప్రతాప్‌  థియేటర్‌ వద్దకు సాయింత్రం 7 గంటలకు చిత్ర యూనిట్‌ రానుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega