Gamanam: ఈ కథ విని హీరోయిన్‌ శ్రియ ఏడ్చేసింది: సృజనా రావు

4 Dec, 2021 08:29 IST|Sakshi

‘‘జీవిత ప్రయాణం గురించి చెప్పడమే ‘గమనం’ చిత్రం ఉద్దేశం. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉండే లైఫ్‌ సర్కిల్‌ను చూపించాలనుకున్నాను. ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్రకు ఓ ప్రయాణం ఉంటుంది’’ అని డైరెక్టర్‌ సృజనా రావు అన్నారు. శ్రియ, శివ కందుకూరి, నిత్యా మీనన్, ప్రియాంకా జవాల్కర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘గమనం’ ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్న సృజనా రావు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలని ఉందని ముందు మా ఇంట్లో చెప్పలేదు. తర్వాత నేను తీసిన డాక్యుమెంటరీని మా నాన్నగారికి చూపించాను. ‘నేనైతే హెల్ప్‌ చేయను కానీ నువ్వే కష్టపడి ప్రూవ్‌ చేసుకోవాలి’ అని నాన్న అన్నారు.

ఆ తర్వాత సపోర్ట్‌ చేశారు. చిన్నప్పుడు మా నాన్నతో పాటు షూటింగ్‌లకు వెళ్లినప్పుడు సెట్‌లో ఎవరెవరు ఏమేం చేయాలో చెప్పేది దర్శకుడే అని గ్రహించాను. అప్పుడే డైరెక్టర్‌ అవ్వాలనుకున్నాను. నా చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సంఘటనలన్నీ ‘గమనం’లో ఉంటాయి. స్క్రిప్ట్‌ రాసుకున్నప్పుడు నటీనటులను అనుకుని రాయలేదు. శ్రియకి కథ చెప్పగానే ఏడ్చేసి, నన్ను గట్టిగా హత్తుకున్నారు. ఇందులో శ్రియ చాలా కొత్తగా కనిపిస్తారు. నిత్యా మీనన్, చారు హాసన్‌ బాగా చేశారు. ‘గమనం’ కథ నిర్మాత జ్ఞానశేఖర్‌గారికి బాగా నచ్చింది. ఇళయరాజాగారికి కథ చెప్పడానికి వెళ్లినప్పుడు ‘నన్నే సంగీతదర్శకుడిగా ఎందుకు అనుకుంటున్నావు?’ అని అడిగారు. కథ చెప్పడం ప్రారంభించాక సగంలోనే ‘మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారు.  సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. మా సినిమా చేసినందుకు రచయిత సాయి మాధవ్‌ బుర్రాకి థ్యాంక్స్‌. ‘గమనం’ విడుదల కోసం ఎంతో ఎగై్జటింగ్‌గా ఉన్నాను. నా తర్వాతి చిత్రం కోసం ఓ కథ సిద్ధం చేశా’’ అన్నారు.  

మరిన్ని వార్తలు