జగడం రీమేక్‌ చేయాలని ఉంది: సుకుమార్‌

16 Mar, 2021 08:23 IST|Sakshi
‘జగడం’ షూటింగ్‌ లొకేషన్‌లో రామ్, సుకుమార్‌

పదిహేడేళ్ల కుర్రాడు కొత్తగా గ్యాంగ్‌లో జాయిన్‌ అయ్యాడు. కొట్లాటకు గ్యాంగ్‌ సభ్యులతో కలిసి వెళ్లాడు. ఎదురుగా పెద్ద గ్యాంగ్‌. వాళ్లను చూసి కుర్రాడి గ్యాంగ్‌ లీడర్‌ భయపడి వెనకడుగు వేశాడు. కానీ, కుర్రాడు వేయలేదు. చురకత్తుల్లాంటి చూపులతో తనకంటే బలవంతుడిని ఢీ కొట్టి ధైర్యంగా నిలబడ్డాడు... చదవగానే ఈ సీన్‌  ‘జగడం’ సినిమాలోది అని ఆ సినిమా చూసినవారికి గుర్తొచ్చి ఉంటుంది.

రామ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగడం’ సినిమాలోని ఈ సన్నివేశానికి దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఫ్యాన్‌ అని చెప్పడం అతిశయోక్తి కాదు. రామ్, ఇషా సహానీ జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జగడం’. ఆదిత్య బాబు నిర్మించిన ఈ సినిమా విడుదలై నేటితో 14 ఏళ్లు పూర్తి అయి 15వ ఏట (2007 మార్చి 16) ప్రవేశిస్తోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను, అప్పటి సంగతుల గురించి సుకుమార్‌ పంచుకున్న విశేషాలు.

నా చిన్నప్పుడు ఎక్కడైనా గొడవ జరుగుతుంటే వెళ్లేవాణ్ణి.. కొట్టుకుంటారేమో, కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉండేది. కానీ నేను వెళ్లేసరికి ఆగిపోతుండేది. దీంతో నిరుత్సాహపడేవాణ్ణి. నా స్నేహితులైనా అరుచుకుంటుంటే బాధ అనిపించేది. వీళ్లు కొట్టుకోవడం లేదేంటి అని! ఎక్కడో నాలో వయొలెన్స్‌ ఉంది. వయొలెన్స్‌ చూడాలని తపన ఉంది. దాన్నుంచి మొదలైన ఆలోచనే ‘జగడం’. 
‘జగడం’ కథ పూర్తయ్యే సమయానికి రామ్‌ ‘దేవదాసు’ విడుదలై ఏడు రోజులు అయింది. ఆ సినిమాలో రామ్‌ నటన చూసి ‘జగడం’ తనతో చేయాలని ‘స్రవంతి’ రవికిశోర్‌గారిని కలిశాం. ఆయన సరే అనడంతో ‘జగడం’ మొదలైంది. అప్పుడు రామ్‌కి పదిహేడేళ్లు. ఏం చెప్పినా చేసేసేవాడు. వండర్‌ బాయ్‌ అనిపించింది. మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నాను. ఈ రోజు అదే నిజం అయ్యింది.

‘ఆర్య’ సినిమా కంటే ముందు ‘జగడం’ చేద్దామనుకున్నాను. అప్పట్లో సెన్సార్‌ ప్రాసెస్‌ గురించి పూర్తిగా తెలియకపోవడం వల్ల చాలా కట్స్‌ వచ్చాయి. కట్స్‌ లేకుండా సినిమా ఉంటే ఇంకా బావుండేది. మా చిత్రానికి ఎడిటర్‌గా చేసిన శ్రీకర్‌ ప్రసాద్‌గారు ఓసారి విమాన ప్రయాణంలో కలిసినప్పుడు, ‘జగడం’ గురించి మాట్లాడుతుంటే, ‘ఫ్లాప్‌ సినిమా కదా... మాట్లాడుకోవడం ఎందుకండీ?’ అన్నాను. ‘‘నేను ముంబై నుంచి వస్తున్నాను. చాలామంది దర్శకుల దగ్గర, వాళ్ల లైబ్రరీల్లో ‘జగడం’ సినిమా ఉంది. నీకు అంతకన్నా ఏం కావాలి?’’ అని ఆయన అనడం సంతోషంగా అనిపించింది. 
దేవిశ్రీ ప్రసాద్‌తో నాకు ఉన్న అనుబంధంతో ‘జగడం’ చిత్రానికీ తనను సంగీత దర్శకుడిగా తీసుకున్నాను. అప్పట్లో ’జగడం’ ఆల్బమ్‌ సెన్సేషన్‌. అలాగే సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలుగారి సినిమాల్లో ది బెస్ట్‌ ‘జగడం’ అని చెప్పొచ్చు. అప్పట్లో స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తన సినిమాలకు ఏ కెమెరా ఎక్విప్‌మెంట్‌ ఉపయోగించారో, మేమూ అదే ఎక్విప్‌మెంట్‌ ఉపయోగించాం. సూపర్‌ 35 ఫార్మాట్‌లో షూట్‌ చేశాం. అప్పటి వరకు మన దగ్గర ఎవరూ ఆ ఫార్మాట్‌లో చేయలేదు.

చిత్ర నిర్మాణంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ జేడీ సోంపల్లిగారు ఎంతో మద్దతుగా నిలిచారు. వాళ్ల అబ్బాయి ఆదిత్యబాబు తరపున ఆయన సినిమా నిర్మించారు. ఈ సినిమాకి ఆరు నెలలు ఆడిషన్స్‌ చేశాం. తాగుబోతు రమేష్, వేణు, ధనరాజ్‌... ఇలా ఆ సినిమా నుంచి చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. 
రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. త్వరలో మళ్లీ తప్పకుండా చేస్తా. నిజం చెప్పాలంటే ఇప్పటి రామ్‌తో మళ్లీ ‘జగడం’ రీమేక్‌ చేయాలని ఉంది.

మరిన్ని వార్తలు