దీపికతో సుమంత్‌ అశ్విన్‌ వివాహం

3 Feb, 2021 14:32 IST|Sakshi

వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా?, ఒక్కడు వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన ఏకైక కుమారుడు, హీరో సుమంత్‌ అశ్విన్‌ పెళ్లికి రెడీ అయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన దీపిక అనే అమ్మాయి చిటికన వేలు పట్టుకుని ఏడడుగులు నడవనున్నాడు. ఫిబ్రవరి 13న వేదమంత్రాల సాక్షిగా ఈ వివాహం జరగనుంది. కరోనా నిబంధనలను దృష్టిలో పెట్టుకుని కేవలం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్యే ఈ పెళ్లి వేడుక జరగనున్నట్లు ఎమ్‌ఎస్‌ రాజు తెలిపాడు. (చదవండి: నమ్రత పోస్టుపై హర్ట్‌ అయిన నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు)

సుమంత్‌ కెరీర్‌ విషయానికొస్తే.. తండ్రి ఎమ్‌ఎస్‌ రాజు డైరెక్షన్‌లో 'తూనీగ తూనీగ' సినిమా ద్వారా వెండితెరపై అడుగు పెట్టాడు. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేక బొక్కబోర్లాపడింది. తర్వాత ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో చేసిన 'అంతకు ముందు ఆ తరువాత' హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఇక మూడో చిత్రం 'లవర్స్'‌ మాత్రం అతడికి కమర్షియల్‌ బ్రేకిచ్చి హీరోగా నిలబెట్టింది. కేరింతతో బిగ్‌ సక్సెస్‌ అందుకున్నాడు. ప్రస్తుతం ఇతడు శ్రీకాంత్‌, భూమిక, తాన్యా హోప్‌తో కలిసి 'ఇదే మా కథ'(రైడర్స్‌ స్టోరీ)లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గురుపవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఎమ్‌ఎస్‌ రాజు విషయానికొస్తే.. ఆయన సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగానే కాదు, మంచి దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్నాడు. తూనీన తూనీగ, వాన సినిమాలకు డైరెక్షన్‌ చేసిన ఆయన ఈ మధ్య డర్టీ హరి సినిమాకు దర్శకత్వం వహించాడు. (చదవండి: పుష్ప రిలీజ్‌ డేట్‌పై సుకుమార్‌ అసంతృప్తి!)

మరిన్ని వార్తలు