‘ఏ1 ఎక్స్ ప్రెస్’ మూవీ రివ్యూ

5 Mar, 2021 13:01 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : ఏ1 ఎక్స్ ప్రెస్
జానర్ : స్పోర్ట్స్ డ్రామా
నటీనటులు : సందీప్ కిష‌న్‌, లావ‌ణ్య త్రిపాఠి, రావు ర‌మేష్‌, మురళీ శ‌ర్మ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్యా, రాహుల్ రామ‌కృష్ణ‌ తదితరులు
నిర్మాతలు :  టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్‌ అగర్వాల్
దర్శకత్వం : డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను
సంగీతం : హిప్‌ హాప్‌ తమిళ 
ఎడిటింగ్‌:  చోటా కె. ప్ర‌సాద్‌
సినిమాటోగ్రఫీ : కెవిన్ రాజ్‌
విడుదల తేది : మార్చి 05, 2021

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఒకరైన సందీప్ కిషన్ కొద్ది కాలంగా కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు.  చాలా కాలం తర్వాత ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో, ఆతర్వాత తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ సినిమాతో మళ్లీ ఫ్లాప్ చవిచూశాడు.  అయితే ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి తో ఉన్న సందీప్..  ఏ1 ఎక్స్‌ప్రెస్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ ట్రై చేయడం,  సౌత్ ఇండియాలోనే హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా కావడంతో  ఈ మూవీపై పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్, ఆడియో కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? లావణ్య త్రిపాఠి గ్లామర్ ఈ సినిమాకు ఎంత వరకు తోడైంది? సందీప్ కిషన్ కెరీర్ లో 25వ చిత్రంగా వచ్చిన ఏ1 ఎక్స్‌ప్రెస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ
యానాం షాట్స్‌తో సినిమా మొదలవుతుంది. అక్కడ ఉన్న చిట్టిబాబు హాకీ గ్రౌండ్‌కి ఒక చరిత్ర ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి ఏడాది కనీసం ఇద్దరైనా జాతీయ జట్టుకు ఎంపికవుతుంటారు. హాకీ కోచ్‌ మురళీ (మురళీ శర్మ) అక్కడి  పేద క్రీడాకారులకు ఉచితంగా కోచింగ్‌ ఇస్తుంటారు. చిట్టిబాబు గ్రౌండ్‌ అంటే కోచ్‌ మురళితో పాటు అక్కడి ప్రజలకు కూడా గుడితో సమానం. అలాంటి గ్రౌండ్‌పై  ఓ కంపెనీ కన్ను పడుతుంది. ఆ స్థలంలో మెడికల్‌ ల్యాబ్‌ని కట్టాలనుకుంటారు. ఇందుకోసం క్రీడాశాఖ మంత్రి రావు రమేశ్‌(రావు రమేశ్‌)కి లంచం ఇస్తారు కంపెనీ యజమానులు. దీంతో తన అధికారాన్ని ఉపయోగించిన మంత్రి ఆ క్లబ్‌ని అండర్‌ ఫర్ఫార్మింగ్‌ లిస్ట్‌లో వేస్తాడు.

మరోవైపు.. నేషనల్‌ లెవల్‌ టోర్నమెంట్‌ గెలిస్తే.. తమ గ్రౌండ్‌ దక్కించుకోవచ్చని భావించిన కోచ్ మురళి.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడు. కట్‌ చేస్తే... హైదరాబాద్‌ నుంచి యానాం బంధువుల ఇంటికి వచ్చిన సందీప్‌(సందీప్‌ కిషన్‌) తొలి చూపులోనే హాకీ ప్లేయర్‌ లావణ్య(లావణ్య త్రిపాఠి)తో ప్రేమలో పడిపోతాడు. ఆమెకు సహాయం చేసే క్రమంలో హాకీ ఆడతాడు. ఎలాంటి కోచింగ్‌ లేకుండా హాకీ గేమ్‌ని అద్భుతంగా ఆడిన సందీప్‌ని చూసి అందరూ ఆశ్చర్యపడతారు. అతని ప్లాష్‌బ్యాక్‌ విని షాకవుతారు. అసలు సందీప్‌ ఎవరు? అతను హాకీ గేమ్‌ని అంత అద్భుతంగా ఎలా ఆడాడు? చిట్టిబాబు గ్రౌండ్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న కోచ్‌ మరళికి సందీప్‌ ఎలా సహాయపడ్డాడు? చివరకి చిట్టిబాబు గ్రౌండ్‌ ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ.

నటీనటులు
నేషనల్‌ హాకీ ప్లేయర్‌ సందీప్‌ పాత్రలో సందీప్‌ కిషన్‌ ఒదిగిపోయాడు. ఈ‌ పాత్ర కోసం సందీప్‌ కిషన్‌ పడ్డ కష్టం ప్రతీ సీన్‌లో కనిపిస్తుంది. అలాగే కొన్ని ఎమోషనల్‌ సీన్లలో కూడా సందీప్‌ కిషన్‌ అవలీలగా నటించేశాడు. ఇక హాకీ క్రీడాకారిణిగా‌ త్రిపాఠి తన పరిధి మేరకు ఆకట్టుకుంది. టామ్‌ బాయ్‌ రోల్‌లో మెప్పించారు. ఇక ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌ తర్వాత బాగా పండిన పాత్ర మురళీ శర్మది. హాకీ కోచ్ పాత్రలొ ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. ఒక నిజాయతీగల కోచ్‌కు గేమ్‌పై, గ్రౌండ్‌పై ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమాలో మరళీ శర్మ పాత్ర తెలియజేస్తుంది.

ఇక క్రీడాశాఖ మంత్రిగా రావు రమేశ్‌ జీవించేశాడు. ఒక అవినీతి రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో, స్వార్థం కోసం ప్రజల మధ్య ఎలా చిచ్చు పెట్టిస్తారో కళ్లకుగట్టారు. హీరో స్నేహితులుగా రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ఆకట్టుకున్నారురు. నిడివి తక్కువే అయినా.. వీరిద్దరి పాత్రే సినిమాకు కీలకం. హీరో స్నేహితుడిగా సత్య తనదైన శైలిలో నవ్వించేశాడు. మహేశ్‌ విట్టా, పొసాని కృష్ణమురళి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 

విశ్లేషణ
క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో తెలుగులో చాలానే వచ్చాయి. ఒక్కడు, సై తో పాటు ఇటీవల విడుదలయిన ‘చెక్‌’ సినిమా కూడా ఆ నేపథ్యంలో తెరకెక్కిందే.  అయితే  ఏ1 ఎక్స్ప్రెస్ ప్రత్యేకత ఏంటంటే.. హాకీ క్రీడా నేపథ్యంలో సౌత్ ఇండియాలోనే వచ్చిన మొదటి సినిమా ఇది. తొలి సినిమాతోనే ఈ ప్రయోగం చేశాడు దర్శకుడు డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను. ఫస్టాఫ్‌ అంతా సింపుల్‌గా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌ నుంచి అసలు కథని చూపించాడు. మన దేశంలో ఒక క్రీడాకారుడికి జరుగుతున్న అన్యాయంతో పాటు స్నేహం  గొప్పతనాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో దర్శకుడు కొంతవరకే సఫలం అయ్యాడని చెప్పొచ్చు.

హీరో ప్లాష్‌బ్యాక్‌లో వచ్చిన సీన్లలో నాటకీయత ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే హీరో స్నేహితులులు హాకీ జట్టుకు ఎంపికకాకపోవడానికి చూపించిన కారణాలు కూడా అంత కన్విన్స్‌గా అనిపించవు. గేమ్‌ కంటే లోకల్‌ పాలిటిక్స్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టిన భావన కలుగుతుంది. ఇక ప్రత్యర్థి హాకీ టీం కోచ్‌ రోల్‌ కూడా అంత స్ట్రాంగ్‌గా ఉండదు. అతని స్థానంలో ఒక ఫేమస్‌ నటుడిని తీసుకొని ఉంటే రెండు టీమ్స్‌ మధ్య జరిగే పోటీ సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా ఉండేవి. 

అయితే, సినిమా చివరి 20 నిమిషాలు మాత్రం అదిరిపోతుంది. సినిమా చూస్తున్నామనే ఫీలింగ్‌ మర్చిపోయి హాకీ ఫైనల్‌ మ్యాచ్‌ని తిలకిస్తున్న భావన కలుగుతుంది. ఇక సినిమాకు ప్రధాన బలం హిప్‌ హాప్‌ తమిళ సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ముఖ్యంగా సినిమా చివరి 20 నిమిషాలు తన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో ప్రేక్షకుడికి ఉత్కంఠను పెంచుతాడు. కెవిన్ రాజ్‌ సినిమటోగ్రాఫి బాగుంది. గ్రౌండ్‌ విజివల్స్‌ సినిమాకే హైలెట్‌. చోటా కె. ప్ర‌సాద్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. ఫస్టాఫ్‌లో కొన్ని చోట్లు తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

ప్లస్‌ పాయింట్స్‌
సందీప్‌ కిషన్‌ పెర్ఫార్మెన్స్‌
సంగీతం
సినిమా చివరి 20 నిమిషాలు

మైనస్‌ పాయింట్స్‌
ఫస్టాఫ్‌
రొటీన్‌ స్టోరీ
ప్రత్యర్థి హాకీ టీం కోచ్‌ బలంగా లేకపోవడం

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)
Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు