ఊర మాస్‌గా వరుణ్ సందేశ్‌.. ‘యద్భావం తద్భవతి’ లుక్‌ అదుర్స్‌

21 Jul, 2022 16:52 IST|Sakshi

‘హ్యపీడేస్‌’, ‘కొత్త బంగారులోకం’ చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు యంగ్‌ హీరో వరుణ్‌ సందేశ్‌. ఆ రెండు చిత్రాల తర్వాత ఆయన నటించిన చిత్రాలేవి బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేదు కానీ.. నటుడిగా తనకు మంచి పేరుని తీసుకొచ్చాయి.  ప్రస్తుతం ఆయన మరో వినూత్న కథతో తెరకెక్కబోతున్న ‘యద్భావం తద్భవతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద  ప్రసన్న లక్ష్మీ భూమి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి..  రమేష్ జక్కల దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో వరుణ్ సందేశ్‌కు జోడిగా ఇనయ సుల్తానా నటిస్తున్నారు. వరుణ్ సందేశ్ పుట్టిన రోజు(జులై 21) సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యంగ్ హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు.ఇందులో వరుణ్‌ కొత్తగా కనిపిస్తున్నాడు. పోస్టర్ చూస్తుంటే వరుణ్ సందేశ్ యాక్షన్ మోడ్‌లో మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉన్నారు.

ఈ సందర్భంగా హీరో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ.. ‘మైఖెల్ సెట్‌లో వరుణ్ సందేశ్ బర్త్ డే సందర్భంగా యద్భావం తద్భవతి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. మైఖెల్ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నానో..  ఈ చిత్రం కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నాను. ఈ పోస్టర్‌లో వరుణ్ సందేశ్ ఎంతో కొత్తగా కనిపిస్తున్నారు. మాస్‌కు రీచ్ అయ్యేలా ఉంది.’ అని అన్నారు.‘నా సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేసినందుకు సందీప్ కిషన్‌కు థ్యాంక్స్. ఇలాంటి సర్ ప్రైజ్ ఇచ్చిన మా నిర్మాత భూమి గారికి, దర్శకుడి గారికి థ్యాంక్స్‌’అని వరుణ్‌ సందేశ్‌ అన్నారు. మిహిరమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

మరిన్ని వార్తలు