సినీ నటి రాధ కేసులో యూటర్న్‌..

17 Apr, 2021 14:51 IST|Sakshi
వసంత రాజ్‌తో రాధ  

పదోన్నతికి భంగంకాకూడదని ఫిర్యాదు వెనక్కి

సాక్షి, చెన్నై: భర్త మోసంచేశాడు, వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వర్ధమాన నటి రాధ రాజీబాటపట్టారు. భర్త ఎస్‌ఐ వసంతరాజ్‌పై ఇచ్చిన ఫిర్యాదును కేవలం 24 గంటల్లో వెనక్కి తీసుకున్నారు. కలిసి కాపురం చేస్తూ జీవితంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. పలు తమిళ చిత్రాల్లో నటించిన రాధ తన భర్తకు విడాకులిచ్చి చెన్నై సాలిగ్రామంలోని లోగయ్య వీధిలో తల్లి, కుమారుడితో నివాసం ఉంటున్నారు. ఎస్‌ఐగా పనిచేస్తున్న వసంతరాజ్‌ను రెండో వివాహమాడి అదే ఇంటిలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా, చెన్నై విరుగంబాక్కం పోలీస్‌స్టేషన్‌లో గురువారం భర్త వసంతరాజ్‌పై ఫిర్యాదు చేశారు. వసంతరాజ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో కొన్నేళ్ల క్రితం ఇంటిలోనే తాము వివాహం చేసుకున్నాం. అయితే ఇటీవల తన నడతను అనుమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్న, భౌతికదాడులకు పాల్పడుతున్న భర్తపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.

ఆ ఫిర్యాదును అనుసరించి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాల్సిందిగా రాధ, వసంతరాజ్‌లకు సమన్లు పంపారు. అయితే సూచించిన సమయానికి వారిద్దరూ హాజరుకాలేదు. గురువారం రాత్రి విరుగంబాక్కం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన నటి రాధ.. తానిచ్చిన కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు లిఖితపూర్వకంగా ఉత్తరం అందజేసి ఫిర్యాదుపత్రాన్ని తీసుకుని వెళ్లిపోయారు. ఫిర్యాదు వెనక్కి తీసుకున్న వైనంపై శుక్రవారం ఆమె మీడియాకు వివరణ ఇచ్చారు.  ఒక మహిళా న్యాయవాది ద్వారా వసంతరాజ్‌తో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. కొన్నాళ్లుకు అతను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని కోరాడు. త్వరలో ఇన్స్‌పెక్టర్‌గా పదోన్నతి వస్తుంది. నిన్ను రాణిలా చూసుకుంటానని బతిమాలాడాడు. మొదట్లో నేను నిరాకరించినా ఒంటరి జీవితంలో ఒక మగతోడు కావాలని భావించి అంగీకరించాను.

చదవండి: పెళ్లి.. మోసం: రచ్చకెక్కిన సినీ నటి

ఇంటిలోనే నా మెడలో తాళికట్టగా భార్యాభర్తల్లా మెలిగాం. అడయారులోని ఈ–కేంద్రానికి తీసుకెళ్లి నా ఆధార్‌కార్డులో, బ్యాంకు ఖాతాలో భర్తగా తనపేరు నమోదు చేయించాడు. పదేళ్లుగా వాడుతున్న కారును అమ్మివేసి నా డబ్బుతో కొత్తకారు కొనుక్కున్నాను. కారు కొనుగోలుకు వసంతరాజ్‌ డబ్బులు ఇవ్వలేదు. అతడు కొనుక్కున్న కారుకు నేనే రూ.4.50 లక్షలు ఇచ్చాను. ఇదిగాక అప్పుడప్పుడూ రూ.20వేలు, రూ.30వేలు తీసుకెళ్లేవాడు. నన్ను అనుమానించి కొట్టడం వల్లనే ఫిర్యాదు ఇచ్చాను. అయితే, జరిగిన సంఘటనలకు విచారం వెలిబుస్తూ పోలీసుల సమక్షంలో నన్ను క్షమాపణ కోరడం, నా ఫిర్యాదు వల్ల అతని పదోన్నతి దెబ్బతినకూడదని వెనిక్క తీసుకున్నానని చెప్పారు. 

మరిన్ని వార్తలు