Sunil On F3 Movie: పొద్దున కామెడీ..రాత్రి విలన్‌.. చాలెంజిగ్‌గా అనిపించింది: సునీల్‌

14 May, 2022 17:48 IST|Sakshi

అనిల్‌ రావిపూడి గ్రేట్‌ ఆల్‌ రౌండర్‌. అతనిలో గొప్ప ఆర్టిస్ట్‌ ఉన్నాడు. ప్రతి సీన్‌ అతనే చేసి చూపిస్తాడు. నా టైమింగ్ నా కంటే అనిల్ కే బాగా తెలుసు.ఇంతమంది స్టార్‌ కాస్ట్‌తో ఈ మధ్య కాలంలో ఎవరూ సినిమా తీయలేదు. తీసినా ఇంతమంది ఆర్టిస్ట్ లకి వేరే సినిమాలకి సర్దుబాటు చేస్తూ తీయలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నవ్వుతూ ఉంటాడు. ఆయనను చూసిన వెంటనే ఒక పాజిటివ్‌ ఎనర్జీ, స్మెల్‌ వస్తుంది. అదే ఆయన సక్సెస్‌ సీక్రెట్‌. ఆయన ఎంత ఎనర్జిటిక్‌, పాజిటివ్‌గా ఉంటారో ఆయన సినిమాలు కూడా అలానే ఉంటాయి’అన్నారు నటుడు సునీల్‌.  విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. దిల్ రాజు సమర్పణ లో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సునీల్‌ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు..

ఎఫ్ 3 లోకి ఎలా వచ్చారు ? 
'కామెడీ రాసే వాళ్ళు తగ్గిపోయారు. మనం కలసి చేస్తే బావుంటుంది కదా'' అని 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడితో చెప్పా. 'తప్పకుండ చేద్దాం అన్నగారు.. మీ 'సొంతం' సినిమా పదేపదే చూస్తుంటా. మీ టైమింగ్ లోనే మాట్లాడుతుంటాం. మనం కలసి చేద్దాం' అన్నారు అనిల్. చెప్పినట్లే ఎఫ్ 3లో మంచి పాత్ర ఇచ్చారు. ఎఫ్ 3లో వింటేజ్ సునీల్ ని చూస్తారు. 

ఎఫ్‌3లో మీ పాత్ర సినిమా అంతటా ఉంటుందా?
సినిమా అంతా వుంటుంది. ఐతే ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ సోలో పెర్ఫార్మెన్స్ కి అవకాశం వుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి గ్రూప్ కామెడీగా వుంటుంది. నేను వరుణ్ తేజ్ ఒక బ్యాచ్, వెంకటేష్ గారు , రఘుబాబు ఒక బ్యాచ్, తమన్నా ఫ్యామిలీ ఒక బ్యాచ్, పృద్వీగారు, స్టంట్ శివ ఒక  బ్యాచ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ఒక బ్యాచ్, వెన్నల కిషోర్, రాజేంద్రప్రసాద్ గారు ఒక బ్యాచ్.. మళ్ళీ అందరం కలసి ఒక బ్యాచ్.. అందరం కలసి తర్వాత కామెడీ మాములుగా వుండదు. నాన్ స్టాప్ నవ్వులే. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్3లో ఉంటుంది.

ఎఫ్2 - అంటే ఫన్ అండ్‌ ఫ్రస్ట్రేషన్.. మరి ఎఫ్3 అంటే మీరేం చెప్తారు ? 
ఫన్ & ఫ్రస్ట్రేషన్..మూడు రెట్లు  (నవ్వుతూ). ఐతే ఫ్రస్ట్రేషన్ లో కూడా ఫన్ వుంటుంది. ఫ్యామిలీ అంతా థియేటర్ కి వెళ్లి గట్టిగా నవ్వుకొని,  మళ్ళీ వెళ్దాం అనుకునే సినిమా ఎఫ్ 3. 

వరుణ్‌ తేజ్‌లో నచ్చిన బెస్ట్‌ క్వాలిటీ?
వరుణ్ తేజ్ అప్పియరెన్స్ చుస్తే రష్యా సినిమాలో కూడా హీరోగా పెట్టేయొచ్చు. హాలీవుడ్ కటౌట్ ఆయనది. ఆలాంటి అప్పియరెన్స్ వున్న వరుణ్ గారు.. ఒక మిడిల్ క్లాస్ రోల్ చేయడం సర్ప్రైజింగా అనిపిస్తుంది. చాలా మంచి వ్యక్తి. చిన్నప్పటి నుంచి తెలుసు. హీరో అయిన తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదు. 'అన్నా' అని పిలుస్తారు. వరుణ్ గారిలో చాలా ఫన్ వుంది. ఈ సినిమాతో అది బయటికి వచ్చింది. దీని తర్వాత ఆయన నుండి ఫన్ ఓరియంటడ్ సినిమాలు కూడా వస్తాయి.

ఎఫ్3 లో మీరు ఫేస్ చేసిన చాలెంజ్ ఏంటి ?
ఎఫ్ 3, పుష్ప ..  ఒకే సమయంలో షూట్స్ లో పాల్గొన్న. రెండూ డిఫరెంట్ రోల్స్. ఒక కామెడీ , రెండు విలనీ. పొద్దున్న కామెడీ చేసి రాత్రికి విలనీ చేయడం కాస్త చాలెజింగ్ అనిపించింది. 

ఇప్పుడు కామెడీ సినిమాలు చేసే దర్శకులు తగ్గిపోయారు కదా.. ఆర్టిస్ట్ గా మీ మీద ఎలాంటి ప్రభావం వుంటుంది? 
నామీద కంటే ప్రేక్షకుల మీద ఆ ప్రభావం ఎక్కువ వుంటుంది. నవ్వించే సినిమాలు చేయడం అంత తేలిక కాదు. నవ్వించడం కూడా అంత తేలిక కాదు. సరదాగా నవ్వుకొని వుంటే ఇమ్యునిటీ పెరుగుతుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా..  సో.. కామెడీ సినిమాలు ఎక్కువ రావాలి. ప్రేక్షకులని నవ్వించాలి. సీరియస్ పాత్రలతో పోల్చుకుంటే కామెడీ చేయడమే కష్టం. అన్ని జోనర్ సినిమాలూ రావాలి. కానీ కామెడీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటాను.

సీరియస్ రోల్స్ ఈజీ అంటున్నారు. కలర్ ఫోటోలో చాల సెటిల్ గా చేశారు.. దీనికి కూడా క్రాఫ్ట్ మీద కంట్రోల్ కావాలి కదా ?
నిజమే. అయితే ఆ క్రెడిట్ ఇప్పుడు వస్తున్న యంగ్ దర్శకులకు దక్కుతుంది. నా సినిమాలు స్కూల్ , కాలేజీ డేస్ లో చూశారు. ఇప్పుడు వాళ్ళు అప్డేటడ్ వర్షన్. నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలా వచ్చిందే కలర్ ఫోటో.

ఎక్కువ కామెడీ సినిమాలు రావాలని కోరుకుంటున్నారు కదా .. మీ వరకూ ఏం ప్లాన్స్ చేస్తున్నారు ? 
నిజానికి నేను ప్లాన్ చేయడం మానేశాను. నా కోసం నేచర్ ఏం ప్లాన్ చేస్తుందో గుర్తిస్తున్నాను. కామెడీ చేయమన్నా ఓకే, పదహారేళ్ళ అమ్మాయికి ఫాదర్ గా చేయమన్నా ఓకే. అయితే వచ్చిన అవకాశానికి న్యాయం చేయడానికి వంద శాతం కష్టపడతాను. ఐతే నా వరకూ కామెడీ చేసి నవ్వించడమే ఇష్టం. 

ఇతర భాషల నుంచి అవకాశాలు వస్తున్నాయా ? 
తమిళ్, కన్నడ, బాలీవుడ్ నుంచి విలన్ పాత్ర సంప్రదించారు. బాలీవుడ్ నుంచి కొన్ని కామెడీ రోల్స్ కూడా ఆఫర్స్ వచ్చాయి. రెండు ఓకే చేశాం. త్వరలోనే వివరాలు చెప్తాం.

మీ స్నేహితుడు త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు ?
తన కొత్త సినిమాలో నేను వుంటాను. అవకాశం వున్న ప్రతి చోట నన్ను పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఆఖరికి 'భీమ్లా నాయక్' సాంగ్ లో కూడా పెట్టారు ( నవ్వుతూ)  

ఎఫ్ 3లో వెంకటేష్ , వరుణ్ తేజ్ ఫెర్ఫార్మేన్స్ ఎలా ఉండబోతుంది ? 
వెంకటేష్ గారి టైమింగ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎఫ్ 3లో ఆయన స్టీల్ ది షో.  వరుణ్ తేజ్ గారిని ఇప్పటివరకూ ఇంత కామెడీ చేసిన రోల్ లో చూసి వుండరు. ఎఫ్ 3 గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాన్ స్టాప్ గా నవ్వుతూనే వుంటారు. ఈ సినిమాకి ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ వుంటారు.

కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? 
మెగాస్టార్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్, రామ్ చరణ్ -శంకర్ గారి సినిమా చేస్తున్నా.  మరో 13  చిన్న , మీడియం సినిమాలు కూడా వున్నాయి. అందరికీ అందుబాటులో వుండాలని నిర్ణయించుకున్నా. ఒక నాలుగు పెద్ద సినిమాలు చేస్తే మరో పది చిన్న సినిమాలు చేయాలని భావిస్తున్నాను. 

మరిన్ని వార్తలు