Wanted PanduGod Movie Review: బుల్లితెర తారలతో నిండిన 'వాంటెడ్‌ పండుగాడ్‌' మూవీ రివ్యూ

19 Aug, 2022 17:17 IST|Sakshi

టైటిల్: వాంటెడ్​ పండుగాడ్
నటీనటులు: సునీల్, సుడిగాలి సుధీర్​, అనసూయ భరద్వాజ్, దీపికా పిల్లి, విష్ణు ప్రియ, నిత్యా శెట్టి, వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస్​ రెడ్డి తదితరులు
కథ, స్క్రీన్​ప్లే: జనార్ధన మహర్షి
ఎడిటర్: తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ: మహిరెడ్డి పండుగల
సమర్పణ: కె. రాఘవేంద్ర రావు
నిర్మాతలు: సాయిబాబ కోవెలమూడి, వెంకట్​ కోవెలమూడి
దర్శకత్వం: శ్రీధర్​ సీపాన
విడుదల తేది: ఆగస్టు 19, 2022

బుల్లితెర నటీనటులు సుడిగాలి సుధీర్​, సునీల్​, యాంకర్​ అనసూయ భరద్వాజ్​, దీపికా పిల్లి, హాస్య నటులు వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస్​ రెడ్డి  తదితరులు నటించిన తాజా చిత్రం వాంటెడ్​​ పండుగాడ్. ఈ సినిమాకు శ్రీధర్​ సీపాన దర్శకత్వం వహించగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పణలో సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెల మూడి నిర్మించారు. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే టీజర్​, ట్రైలర్​, పోస్టర్స్​, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మేర కామెడీని పంచిందో రివ్యూలో చూద్దాం.

కథ:
పాండు ఉరఫ్‌ పండు (సునీల్‌) పోలీసులను కొట్టి చంచల్‌ గూడా జైలు నుంచి తప్పించుకుంటాడు. అలా జైలు నుంచి పారిపోయిన పండు నర్సాపురం అడవిలో దాక్కున్నాడని మీడియాలో కథనాలు వస్తాయి. పండును పట్టుకున్నవాళ్లకు రూ. కోటి రివార్డు ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ విషయం తెలిసి పండును పట్టుకునేందుకు అఖిల్‌ చుక్కనేని (వెన్నెల కిశోర్), విక్రమ్‌ రాథోడ్‌ (సప్తగిరి), బోయపాటి బాలయ్య (శ్రీనివాస్‌ రెడ్డి), మణిముత్యం (తనికెళ్ల భరణి), హాసిని (ఆమని) తదితరులు అడవిలోకి వెళ్తారు. అసలు వారికి డబ్బు ఎందుకు అవసరమైంది? ఆ డబ్బుతో ఏం చేద్దామనుకున్నారు? ఆ అడవిలో గంజాయి ఎవరు పెంచారు? కోయజాతి అమ్మాయిగా ఝాన్సీ (అనసూయ) అడవిలో ఎందుకు తిరుగుతుంది? అనే తదితర విషయాలు తెలియాలంటే వాంటెడ్‌ పండుగాడ్‌ చూడాల్సిందే. 

విశ్లేషణ:
'వాంటెడ్‌ పండుగాడ్‌' సినిమాకు 'పట్టుకుంటే కోటి' అనే క్యాప్షన్‌తోనే కథేంటో చెప్పేశారు. ఇక సునీల్ జైలు నుంచి తప్పించుకోవడం, అతన్ని పట్టుకున్నవాళ్లకు రూ. కోటి రివార్డు ప్రకటించడం, తర్వాత విభిన్న నేపథ్యాలతో పాత్రలను పరిచయం చేయడంతో సినిమా కథ అర్థమైపోతుంది. బుల్లితెరతో పాపులారిటీ సంపాందించుకున్న సుడిగాలి సుధీర్, యాంకర్‌ విష్ణుప్రియ, దీపికా పిల్లి కనిపించడంతో అది కూడా ఒక టీవీషోలా తోస్తుంది. కొద్దిసేపు సినిమాల ఫీల్‌ అవ్వడానికి సమయం పడుతుంది. కొంచెం అతికించిపెట్టినట్లుగా ఉన్న కామెడీ ట్రాక్‌తో పట్టాలు ఎక్కిన సినిమా అకడక్కడ బాగానే నవ్విస్తుంది. వివిధ హిట్‌ సినిమాల్లోని డైలాగ్‌లను స్ఫూఫ్‌ చేసి బాగానే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక పాటలు, అందులో హీరోహీరోయిన్స్‌ను చూపించిన విధానం దర్శకేంద్రుడి రాఘవేంద్ర రావు శైలి కనిపిస్తుంది. అయితే సినిమా కామెడీ జోనర్‌ కావడమో, మాములు ఆర్టిస్ట్‌లు కావడంచేతనో ఆ శైలి బాగా ఎక్కకపోయిన హీరోయిన్ల అభినయం, అందచందాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. 'అబ్బ అబ్బ' అనే పాట అలరించేలా ఉంది. చాలా గ్యాప్‌ తర్వాత  అతిథిపాత్రలో బ్రహ్మానందం మెరిసారు. ఆయన తరహా హాస్యంతో కామెడీ పండించారు. 

ఎవరెలా చేశారంటే?
ఖైది పండుగా సునీల్ నటన బాగానే ఉంది. కానీ సినిమా మొత్తం ఆ పాత్ర చుట్టూనే నడిచినా, నటనకు అంతా ప్రాధాన్యత ఇచ్చేలా లేదు. రెండు చోట్ల ఉండే యాక్షన్‌ సీన్లలో సునీల్ అదరగొట్టేశాడనే చెప్పవచ్చు. ఇక సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లి, అనసూయ, విష్ణు ప్రియ, నిత్యా శెట్టి, వాసంతి క్రిష్ణన్‌ తనికెళ్ల భరణి, ఆమని పాత్రలు పరిధిమేర నటించి పర్వాలేదనిపించారు. వెన్నెల కిశోర్, శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, పృథ్వీరాజ్‌ తమ కామెడీ టైమింగ్‌తో ఆద్యంత ఆకట్టుకున్నారు. నిజానికి సినిమాలో హైలెట్‌గా చెప్పుకోవాలంటే వారి కామెడి గురించే చెప్పుకోవచ్చు. స్క్రిప్టుకు తగినట్లుగా వచ్చే డైలాగ్‌లు నవ్వు తెప్పించేలా బాగున్నాయి. శ్రీధర్​ సీపాన దర్శకత్వం, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ పర్వాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే కొంత గ్లామర్‌, కొంత కామెడీతో ఆకట్టుకుంటాడు ఈ 'వాంటెడ్‌ పండుగాడ్‌'

-సంజు (సాక్షి వెబ్‌డెస్క్‌)

మరిన్ని వార్తలు