Saakini Daakini: ఆ క్రైమ్‌ గురించి ఎవరూ మాట్లాడటం లేదు.. మా చిత్రంలో చూపించాం

15 Sep, 2022 10:42 IST|Sakshi

‘‘ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న ఓ పెద్ద నేరం గురించి ఇండియాలో ఎవరూ మాట్లాడటం లేదు. మా ‘శాకిని డాకిని’ చిత్రంలో ఆ క్రైమ్‌ గురించి చెబుతున్నాం కాబట్టి ప్రతి మహిళ ఈ చిత్రం చూడాలి’’ అని నిర్మాత సునీత తాటి అన్నారు. రెజీనా కసాండ్రా, నివేదా థామస్‌ లీడ్‌ రోల్స్‌లో సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకిని డాకిని’. డి.సురేష్‌ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్‌ కిమ్‌ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. 

ఈ సందర్భంగా సునీత తాటి మాట్లాడుతూ– ‘‘గురు ఫిల్మ్స్‌పై నిర్మించిన 7వ చిత్రం ‘శాకిని డాకిని’. మహిళల సమస్యలపై మహిళలే మాట్లాడితే ఇంకా బాగా కనెక్ట్‌ అవుతారని లీడ్‌ రోల్స్‌లో రెజీనా, నివేదలను తీసుకున్నాం. ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక నేరాన్ని ఎలా పరిష్కరించగలిగారు? అనేది ఈ చిత్ర కథ. ఇదొక యూనివర్శల్‌ కథ.. అందరికీ నచ్చుతుంది.

సుధీర్‌ వర్మ  వేరే షూటింగ్‌లో ఉండటం వల్లే ‘శాకిని డాకిని’ ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు..  నేటి నుంచి పాల్గొంటారు. సురేశ్‌ బాబుగారితో అసోసియేట్‌ అవడం చాలా హ్యాపీ. మన చిత్రాలు కొరియన్, జపాన్‌ భాషల్లో చాలా రీమేక్‌ అవుతున్నాయి. థియేటర్‌లో సినిమా చూసినప్పుడు అందరం నవ్వుతాం.. ఏడుస్తాం. అదే ఓటీటీలో అయితే ఇంట్లో పర్సనల్‌గా అనుభూతి పొందుతాం. థియేటర్‌ అనుభూతే వేరు. మా బ్యానర్‌లో మరో నాలుగు కొరియన్‌ సినిమాలు రీమేక్‌ చేయనున్నాం.. వాటిలో సమంతతో ఓ సినిమా ఉంటుంది. డైరెక్టర్‌ బాపుగారంటే నాకు ఇష్టం. ఆయనలాంటి మూవీస్‌తో పాటు, ‘అవతార్‌’ లాంటి ఫ్యాంటసీ సినిమాలు డైరెక్ట్‌ చేయాలనుంది.. చేస్తాను’’ అన్నారు. 

మరిన్ని వార్తలు