Super Machi Review: ‘సూపర్‌ మచ్చి’మూవీ ఎలా ఉందంటే..?

14 Jan, 2022 08:16 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : సూపర్‌ మచ్చి
నటీ,నటులు: కల్యాణ్ దేవ్, రచిత రామ్, వీకే నరేష్, పోసాని కృష్ణ మురళి, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి, మహేష్ ఆచంట తదితరులు
నిర్మాత : రిజ్వాన్
దర్శకత్వం : పులి వాసు
సంగీతం: తమన్‌
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు
ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
విడుదల తేది:  జనవరి 7, 2022

మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడిగా ‘విజేత’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు కల్యాణ్‌దేవ్‌. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఆ ఉత్సాహంతోనే ‘సూపర్ మచ్చి’ అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యంగ్ హీరో.. లుక్స్, ఫిజిక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌ కూడా సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సూపర్‌ మచ్చి’సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే.. 
ఇన్ఫోసిస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే  మీనాక్షి (రచిత రామ్).. బార్‌లో పాటలు పాడుతూ.. ఆవారాగా తిరిగే (రాజు)ని అమితంగా ప్రేమిస్తుంది. అతను ఇష్టం లేదని చెప్పినా అతని వెంటే పడుతుంది. దీంతో ఆమెను వదిలించుకోవడానికి ఒక నైట్‌ తనతో గడిపితే నీ ప్రేమని అంగీకరిస్తానని కండీషన్‌ పెడతాడు. దానికి కూడా ఆమె ఒప్పుకుంటుంది. నెలకు లక్షన్నర సంపాదించినే మీనాక్షి.. చదువు సంధ్య లేని రాజుని ఎందుకు ప్రేమించింది? ప్రాణం కన్న మిన్నగా ప్రేమించిన మీనాక్షిని రాజు ఎందుకు దూరంగా పెట్టాడు? మీనాక్షిని చూడకుండా ప్రేమించిదెవరు? మీనాక్షి తండ్రి(రాజేంద్రప్రసాద్‌) చివరి కోరిక కోసం ఏంటి? చివరకు మినాక్షి , రాజులు ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ. 

ఎవరెలా చేశారంటే..?
బాధ్యతలేని యువకుడిగా, చూడని ప్రియురాలి కోసం తపన పడే ప్రేమికుడు రాజు పాత్రలో కల్యాణ్ దేవ్ మంచి నటనను కనబరిచాడు. డ్యాన్స్‌తో పాటు ఫైట్స్‌ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించారు. తెరపై చాలా జోష్‌గా కనిపిస్తాడు. ఇక మీనాక్షిగా రచిత రామ్ యాక్టింగ్‌ చాలా బాగుంది. సినిమా భారాన్ని మొత్తం భుజాన వేసుకొని నడిపించింది. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషన్స్‌ సినిమాలో కూడా అద్భుతంగా నటించింది. హీరో తల్లిదండ్రులుగా నరేశ్‌, ప్రగతి మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. మీనాక్షి తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్‌ ఒదిగిపోయారు. పొసాని కృష్ణమురళి, మహేష్ ఆచంట, భద్రంతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే..?
ప్రేమ, ఎమోషన్స్, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ లాంటి అంశాలు ఉన్న చిత్రమే సూపర్ మచ్చి. ఇలాంటి కథలు టాలీవుడ్‌లో చాలా వచ్చాయి. కానీ చూడకుండా ప్రేమించుకోవడం ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌లో కథను ముందుకు నడిపాడు దర్శకుడు పులి వాసు. ఆయన ఎంచుకొన్న పాయింట్‌ బాగున్నప్పటీకీ.. తెరపై చూపించడంలో కాస్త తడపడ్డాడు. ఫస్టాఫ్‌ అంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా నడిపించాడు. బాధ్యతలేని రాజుని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మీనాక్షి ఎందుకు ప్రేమిస్తుందనే విషయాన్ని ఇంటర్వెల్‌ వరకు ఆపి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగేలా చేశాడు. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ కూడా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.

అయితే సెకండాఫ్‌లో మాత్రం కథ కాస్త రోటీన్‌గా సాగుతుంది. తండ్రి, కూతుళ్ల మధ్య వచ్చే ఎమోషన్స్‌ సీన్స్‌ కూడా అంతగా వర్కౌట్‌ కాలేదు. కానీ ఎలాంటి అశ్లీలత, బూతులు లేకుండా సినిమాను తెరకెక్కించిన తీరు బాగుంది. ఇక సాంకెతిక విషయానికొస్తే.. తమన్‌ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది.  శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్‌ మార్తాండ్‌ వెంకటేష్‌ సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్‌ని ఇంకాస్త క్రిస్పీగా కట్‌ చేస్తే మరింత బాగుండేది. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి. మంచి కథను, దానికి తగిన నటీనటుల ఎంపిక విధానం చూస్తే.. సినిమాపై రిజ్వాన్‌కు ఉన్న అభిరుచి ఏంటో అర్థమవుతుంది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమా మొత్తాన్ని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. 

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు