స్క్రీన్‌ ప్లేతో సూపర్‌ బెట్టింగ్‌

23 Jan, 2021 08:48 IST|Sakshi

చిత్రం: ‘సూపర్‌ ఓవర్‌’
తారాగణం: నవీన్‌ చంద్ర, చాందినీ చౌదరి, రాకేందుమౌళి, ప్రవీణ్‌
నిర్మాత: సుధీర్‌ వర్మ
దర్శకత్వం: ప్రవీణ్‌ వర్మ
 ఓ.టి.టి. ప్లాట్‌ఫామ్‌: ఆహా
విడుదల తేది : జనవరి 22, 2021

క్రికెట్‌ బెట్టింగ్, హవాలా నేపథ్యంలో తెలుగులో పూర్తి స్థాయి సినిమాలు రాలేదనే చెప్పాలి. ఆ రెండు నేపథ్యాలనూ వాడుతూ, డబ్బు కోసం మనిషి ఎంత దూరం వెళతాడో విలక్షణమైన స్క్రీన్‌ప్లేతో చెబితే? క్రికెట్‌ బెట్టింగ్‌ నేపథ్యం కన్నా హవాలా నేపథ్యం ఎక్కువుండే ‘సూపర్‌ ఓవర్‌’లో దర్శక, నిర్మాతలు చేసిన యత్నం అదే. 

కథ
కాశీ (నవీన్‌ చంద్ర), మధు (చాందినీ చౌదరి), వాసు (రాకేందు మౌళి) – ముగ్గురూ చిన్నప్పటి స్నేహితులు. ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ కాశీ ఈజీ మనీ కోసం బెట్టింగ్‌కు దిగుతాడు. మిగతా ఇద్దరు ఫ్రెండ్లూ సమర్థిస్తారు. అనుకోకుండా కాశీ కోటీ 70 లక్షలు గెలుస్తాడు. ఆ డబ్బులు తీసుకొని, కష్టాలు తీర్చుకోవాలని ముగ్గురూ రాత్రివేళ బయల్దేరతారు. ఆ రాత్రి తెల్లవారే లోపల అసలు ట్విస్టులు, కష్టాలు మొదలవుతాయి. బుకీ మురళి (కమెడియన్‌ ప్రవీణ్‌), పోలీసు ఎస్‌.ఐ. (అజయ్‌), హవాలా డబ్బు డీల్‌ చేసే మనుషులు – ఇలా రకరకాల పాత్రలతో సాగే ఛేజింగ్‌ థ్రిల్లర్‌ మిగతా కథ. 

ఎలా చేశారంటే
హితుల కథలా మొదలై పూర్తిస్థాయి థ్రిల్లర్‌లా సాగే ఈ సినిమాలో నటీనటులందరూ పాత్రలకు సరిగ్గా అతికినట్టు సరిపోయారు. ముగ్గురు స్నేహితుల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. గంభీర కంఠస్వరం, ఒకింత రగ్డ్‌ లుక్‌తో నవీన్‌ చంద్ర ఈ కథను నడిపే కాశీ పాత్రలో బాగున్నారు. తెలుగమ్మాయి చాందిని పాత్రచిత్రణతో, ఆ ఎనర్జీతో ప్రేక్షకులు ప్రేమలో పడతారు. ‘మస్తీస్‌’, ‘కలర్‌ ఫోటో’ లాంటి హిట్‌ వెబ్‌ సినిమాల్లో కనిపించిన చాందినికి మంచి భవిష్యత్తు ఉందనిపిస్తుంది. ప్రతిదానిలో ఏదో ఒక అనుమానం లేవనెత్తే కామికల్‌ రిలీఫ్‌ పాత్రలో రచయిత వెన్నెలకంటి కుమారుడు రాకేందుమౌళి వినోదం అందిస్తారు. కమెడియన్‌ ప్రవీణ్, అజయ్‌ సహా ఈ సినిమాలో పాత్రలే తప్ప, ఎక్కడా నటీనటులు కనిపించరు. ఎవరెంతసేపున్నా సన్నివేశాలనూ, సందర్భాలనూ, పాత్రల ప్రవర్తననూ ఉత్కంఠ రేపేలా, శ్రద్ధగా రాసుకోవడం దర్శకుడి ప్రతిభ. 

ఎలా తీశారంటే..:
ఈ సినిమాకు బలం – స్క్రీన్‌ప్లేలోని వైవిధ్యం. ఇలాంటి కథ, దానికి వెండితెర కథనం రాసుకోవడం కష్టం. రాసుకున్నది రాసుకున్నట్టు తీయడం మరీ కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భుజానికెత్తుకొని, నలుగురూ ఇష్టపడేలా తీశారు – దర్శకుడు స్వర్గీయ ప్రవీణ్‌ వర్మ. షూటింగ్‌ ఆఖరులో వాహనప్రమాదంలో ప్రవీణ్‌ వర్మ దుర్మరణం పాలయ్యారు. దాంతో, ఆయనకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని ఇచ్చిన ‘స్వామిరారా’ సుధీర్‌వర్మ పోస్ట్‌ప్రొడక్షన్‌ చేశారు. సాంకేతిక విభాగాల పనితనం సినిమాకు మరో బలం. 25 రోజులకు పైగా సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో రాత్రివేళ షూటింగ్‌ జరుపుకొందీ సినిమా. నైట్‌ ఎఫెక్ట్‌లో, ఏరియల్‌ షాట్స్‌తో దివాకర్‌ మణి కెమేరావర్క్‌ కనిపిస్తుంది. ఈ థ్రిల్లర్‌కి నేపథ్య సంగీతం గుండెకాయ. సన్నీ ఈ చిత్రానికి గ్యాప్‌ లేకుండా సంగీతం ఇస్తూనే ఉన్నారు. అక్కడక్కడ కాస్తంత మితి మీరినా, ఆ నేపథ్య సంగీతమే లేకుండా ఈ సినిమాను ఊహించలేం.

ఎడిటింగ్‌ సైతం కథ శరవేగంతో ముందుకు కదిలేలా చేసింది. సెన్సార్‌ లేని ఓటీటీలో సహజంగా వినిపించే, అసభ్యమైన డైలాగులు కూడా చాలానే ఉన్న చిత్రమిది. అనేక చోట్ల లాజిక్‌ మిస్సయి, కథనంలో మ్యాజిక్‌ ఎక్కువున్న ఈ సినిమాకు ఓటీటీ రిలీజు లాభించింది. థియేటర్లలో కన్నా ఎక్కువ మంది ముంగిటకు వెళ్ళే అవకాశం వచ్చింది. ఛేజింగ్‌ థ్రిల్లర్‌ కావడంతో దర్శకుడు పలుచోట్ల తీసుకున్న సినిమాటిక్‌ లిబర్టీని ప్రేక్షకుడు క్షమిస్తాడు. అలాగే, దర్శకుడు ఎంచుకున్న విలక్షణ కథనం వల్ల ఒకే సీన్‌ సందర్భాన్ని బట్టి, పదే పదే వస్తున్నా సరే సహిస్తాడు. అక్కడక్కడా ఓవర్‌గా అనిపించే అలాంటివి పక్కన పెడితే, గంట 20 నిమిషాల కాలక్షేపం థ్రిల్లర్‌గా ఈ కథాకథనం సూపర్‌ అనిపిస్తుంది.
 
బలాలు:
విలక్షణమైన స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం
సహజంగా తోచే∙నటీనటులు, వారి అభినయం 
కెమేరా వర్క్, ఉత్కంఠ పెంచే నేపథ్య సంగీతం

 బలహీనతలు:
ట్విస్టుల హడావిడిలో మిస్సయిన లాజిక్కులు
స్క్రీన్‌ ప్లేలో భాగంగా రిపీటయ్యే సీన్లు 
వెండితెర కన్నా ఓటీటీకే పనికొచ్చే అంశాలు 

కొసమెరుపు: ఇది ఓటీటీలో ఓకే థ్రిల్లర్‌!
– రెంటాల జయదేవ

Poll
Loading...
మరిన్ని వార్తలు