SInger Bhuvanesh: శభాష్‌ భువనేష్‌... పాఠాలైన, పాటలైనా బ్రెయిలీ లిపిలోనే!

17 Sep, 2022 13:30 IST|Sakshi

ఎన్నిసార్లైనా ‘శబ్భాష్‌’ అంటూ మెచ్చుకోవచ్చు భువనేష్‌ను. ఒకే గొంతుపై ఎంతోమంది గాయకులను తీసుకు వస్తూ తీయని పాటలు వినిపిస్తున్నందుకు, జటిలమైన శ్లోకాలను అలవోకగా వల్లిస్తున్నందుకు, హుషారెత్తేలా గిటార్‌ వాయిస్తున్నందుకు, మైమరిచిపోయేలా వేణుగానం వినిపిస్తున్నందుకు, వాయిద్యాలతోనే కాదు నోటితో కూడా వాయిద్యాల ధ్వనిని అద్భుతంగా పలికిస్తున్నందుకు, మెరుపు వేగంతో నృత్యాలు చేస్తున్నందుకు, మిమిక్రీ చేస్తూ నవ్విస్తున్నందుకు.... మన భువనేషన్‌ను ఎన్నిసార్లైనా మెచ్చుకోవచ్చు.

స్టార్‌మా రియల్టీ షో సూపర్‌ సింగర్‌ జూనియర్‌లో థర్డ్‌ ప్లేస్‌లో నిలిచి సంగీతాభిమానులను ఆకట్టుకున్న భువనేష్‌ విజయనగరంలోని ద్వారకామాయి అంధుల పాఠశాల విద్యార్థి. పాఠాలైన, పాటలైనా బ్రెయిలీ లిపిలో రాసుకుంటాడు. చిన్నప్పుడెప్పుడో ఒక టీవీ సీరియల్‌ ప్రోమో సాంగ్‌ విని అచ్చంగా అలా పాడేశాడు. నిజానికి ఆ పాటలో కష్టతరమైన పదాలు ఉన్నాయి. అయితే అవేమీ తనకు కష్టం అనిపించలేదు. అమ్మానాన్నలకు సంగీతం తెలియదు. తనకు సంగీతం నేర్పించే గురువు అంటూ లేరు. యూట్యూబ్‌నే గురువుగా చేసుకొని రకరకాల జానర్స్‌లో పాటలు నేర్చేసుకున్నాడు.

విజయనగరం నుంచి హైదరాబాద్‌కు వచ్చి పాడి సామాన్యప్రేక్షకుల నుంచి సంగీత ఉద్దండుల వరకు ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాడు. పెద్దల ఆశీర్వాదబలం ఊరకే పోదు. ఆ బలం ఈ సూపర్‌సింగర్‌ను మరింత స్పీడ్‌గా ముందుకు తీసుకువెళుతుంది.

మరిన్ని వార్తలు