సినిమా బాగుందని కృష్ణగారు అన్నారు: 'హీరో' మూవీ డైరెక్టర్‌

11 Jan, 2022 08:31 IST|Sakshi

గల్లా అశోక్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘హీరో’. నిధీ అగర్వాల్‌ హీరోయిన్‌గా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో పద్మావతి గల్లా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. శ్రీరామ్‌ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘సినిమాల్లో హీరో కావాలనుకునే ఓ యువకుడి కథే ఈ చిత్రం. స్క్రీన్‌ ప్లే రేసీగా, ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. అశోక్‌ యాక్టింగ్‌ కోర్సులు చేసినప్పటికీ నాకు అవంటే పెద్దగా నమ్మకం లేదు. అందుకే అశోక్‌కు చిరంజీవి, మహేశ్‌బాబుగార్ల సినిమాలను రిఫరెన్సులుగా ఇచ్చాను.

ఆ సినిమాల్లో వారి బాడీలాంగ్వేజ్‌ను గమనించి, నేర్చుకోమని చెప్పాను. అశోక్‌ బాగా నటించాడు. కృష్ణగారు మా సినిమాను చూసి ‘బాగుంది’ అని మెచ్చుకున్నారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు కూడా ఇదే ఫీలింగ్‌ కలుగుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా షూటింగ్‌లో కోవిడ్‌ పరిస్థితులను ఎదుర్కోవడమే పెద్ద సవాల్‌గా అనిపించింది. ప్రస్తుతం ఓటీటీలపై ఆసక్తి లేదు. ప్రొడక్షన్‌ పరంగా ఏమైనా చేయాలనుకుంటున్నాను’’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు