Superstar Krishna Demise: కృష్ణ మృతి.. ఆయన అత్తగారి గ్రామంలో విషాదఛాయలు

16 Nov, 2022 15:14 IST|Sakshi
ఖమ్మంలో కళాకారుల ఐక్యవేదిక పురస్కారం అందుకుంటున్న విజయనిర్మల పక్కన కృష్ణ (ఫైల్‌)

ఖమ్మం గాంధీచౌక్‌ : తెలుగు సినిమా రంగంలో అనేక రికార్డులు నెలకొల్పిన సినీ హీరో, సూపర్‌స్టార్‌ కృష్ణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో విడదీయలేని బంధం ఉంది. ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం ముసలిమడుగుకు చెందిన ఇందిరాదేవిని కృష్ణ వివాహమాడారు. అత్తగారి ఇంటికి వచ్చివెళ్లే క్రమంలో ఆయనకు ఖమ్మంతో అనుబంధం ఏర్పడింది.

ఇక వందలాది సినిమాల్లో  హీరోగా నటించిన కృష్ణకు జిల్లాలో అభిమానులు కూడా ఎక్కువే. హీరోగా గురిపు సాధించిన ఆయన అభిమానులు ఏర్పాటుచేసిన కార్యక్రమాలతో పాటు రాజకీయ నాయకుడిగానూ జిల్లాకు పలు సార్లు వచ్చారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో 2000 మార్చి 27న జిల్లా కళాకారుల ఐక్యవేదిక నిర్వహించిన మిలీనియం కళా పురస్కార ఉత్సవాల్లో కృష్ణ తన సతీమణి విజయనిర్మలతో కలిసి పాల్గొన్నారు.

ఐక్యవేదిక ప్రతినిధులు వీ.వీ.అప్పారావు, డాక్టర్‌ నాగబత్తిని రవికుమార్‌ ఆధ్వర్యాన కృష్ణకు ఎన్టీఆర్‌ పురస్కారం, విజయనిర్మలకు మిలీనియం కళా పురస్కారం అందించి సన్మానించారు. అలాగే, ఖమ్మం కమాన్‌ బజార్‌లో ఏర్పాటు చేసిన విమల్‌ షోరూం ప్రారంభోత్సవానికి కృష్ణ వచ్చిన సమయాన ఉమ్మడి జిల్లా కృష్ణ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బాబాజీ, గౌరవ అధ్యక్షుడు తోట రంగారావు ఆయనకు జ్ఞాపిక అందించారు.
(చదవండి: ఇకపై అవేవి ఇంతకు ముందులా ఉండవు, మిస్‌ యూ తాతయ్య: సితార ఎమోషనల్‌)

సినిమా షూటింగ్‌లో కృష్ణతో అభిమానులు తోట రంగారావు, తదితరులు (ఫైల్‌) 

ఇక భద్రాచలం అడవులు, గోదావరి తీరంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ సినిమా షూటింగ్‌లో నూ సూపర్‌ స్టార్‌ పాల్గొన్నారు. కాగా, మాజీ మంత్రి జలగం ప్రసాదరావుతో కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో ప్రసాదరావు ఎమ్మెల్యేగా పోటీచేసిన సమయాన ప్రచారానికి హాజరయ్యారు.

నేతలతో పాటు అభిమానుల సంతాపం
ఖమ్మం మయూరిసెంటర్‌ : సూపర్‌స్టార్‌ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు తెలి యగానే ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పలువురు ఆయన చిత్రపటాల వద్ద నివాళులర్పించగా కొందరు కృష్ణకు కడసారి వీడ్కోలు పలికేందుకు హైదరాబాద్‌ వెళ్లారు. అలాగే, సీఎం కేసీఆర్‌తో కలిసి కృష్ణ నివాసానికి వెళ్లిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించడమే కాక మహేష్‌బాబు, కుటుంబీకులను ఓదార్చారు. ఇక ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా కృష్ణ మృతిపై సంతాపం ప్రకటించారు.
(చదవండి: సూపర్ స్టార్‌ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా?)

మరిన్ని వార్తలు