అమ్మపై అపురూపమైన ప్రేమ.. ఇందిరా దేవి మృతితో శోకసంద్రంలో మహేశ్‌బాబు

28 Sep, 2022 08:56 IST|Sakshi

తల్లి ఇందిరా దేవి(70) మృతితో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఏడాది జనవరిలోనే సోదరుడు రమేశ్‌ బాబు మరణించడం, ఇప్పుడు తల్లి కూడా చనిపోవడంతో ఆయన కుటుంబం కన్నీరుమున్నీరయ్యింది. మహేశ్‌కు తల్లి ఇందిరా దేవిపై అపురూపమైన ప్రేమ. పలు సందర్భల్లో ఆమె ప్రస్తావన రాగానే ఎంతో ఎమోషనల్ అయ్యాడు. పెళ్లికిముందు వరకు ఆయన తల్లి చాటునే పెరిగాడు. అందుకే ఆమె అంటే అంత ప్రేమ. ఓ వివాహ వేడుక‌కు ఇందిర వ‌చ్చిన‌ప్పుడు మ‌హేశ్‌బాబు ఆమెను రిసీవ్ చేసుకున్న విధానం అంద‌రినీ ఆకర్షించింది.

తండ్రికి రెండో వివాహం.. అందుకే తల్లి చాటున
ఇందిరా దేవి సూపర్ స్టార్ కృష్ణ మామ కూతురే. వరసకు మరదలు. ఆయన సినిమాల్లోకి వచ్చిన కొన్నాళ్లకే కుటుంబసభ్యుల సలహా మేరకు ఇందిరను పెళ్లి చేసుకున్నారు కృష్ణ. అయితే ఆ తర్వాత విజయ నిర్మలతో వరుసగా సినిమాలు తీయడంతో ఆమెతో ప్రేమలో పడ్డారు. దీంతో ఇందిరతో పెళ్లైన నాలుగేళ్లకే.. విజయ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు కృష్ణ. పెళ్లి విషయాన్ని ఇందిరకు చెప్పారు. ఆ తర్వాత కూడా అందరూ కలిసే ఉన్నారు. కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఇందిరా దేవి ఎప్పుడూ బ‌య‌ట‌కు రాలేదు. ఫంక్ష‌న్ల‌లోనూ  అరుదుగా కనిపించారు.

ఎమోషనల్ పోస్ట్‌
ఈ ఏడాది ఏప్రిల్‌ 20న ఇందిరా దేవి పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు చాలా ప్రత్యేకంగా ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్టు పెట్టాడు. అమ్మా మీరు నా తల్లికావడం అదృష్టం. మీ గురించి చెప్పడానికి ఒక్కరోజు సరిపోదు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని ట్వీట్ చేశాడు. మహేశ్‌ తన మాతృమూర్తి పట్ల చూపించిన ప్రేమను చూసి ఆయన అభిమానులు మురిసిపోయారు. కానీ ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె ప్రాణాలు కోల్పోవడం మహేశ్‌తో పాటు అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం

మరిన్ని వార్తలు