రజనీ రాజకీయాల్లోకి వచ్చినా ఉపయోగం లేదు.. వేస్ట్‌: సోదరుడు సత్యనారాయణ రావు

31 May, 2023 07:51 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆ మధ్య రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించి తర్వాత వెనక్కి తగిన విషయం తెలిసిందే. దానికి ఆరోగ్యం సహకరించడం లేదనే కారణాన్ని కూడా ఆయన చెప్పారు. కానీ,  అప్పటి నుంచి ఖాళీగా ఇంట్లో కూర్చోవడం లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం జైలర్‌తో పాటు తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్‌ సలాం చిత్రంలో అతిథి పాత్రలోనూ నటిస్తున్నారు.

ఇవి గాక మరో రెండు చిత్రాలకూ పచ్చజెండా ఊపేశారు. ఇదిలా ఉంచితే ఇప్పుడు నటుడు రజనీకాంత్‌  రాజకీయాల్లోకి వచ్చినా ఉపయోగం లేదని స్వయానా ఆయన సోదరుడు సత్యనారాయణ రావు పేర్కొనడం విశేషం. ఇందుకు కారణాన్ని కూడా వివరించారు.  రజనీకాంత్‌ ఇకపై రాజకీయాల్లోకి రావాలని, వచ్చినా ప్రయోజనం ఏమీ లేదనీ వ్యాఖ్యానించారు. కారణం ఆయన వయస్సు ఏడు పదులు దాటడమేనని పేర్కొన్నారు. అదే విధంగా ఆయన ఎవరికీ మద్దతు పలికే అవకాశం లేదని స్పష్టం చేశారు.  దేవుని దయ వల్ల ఆయన సుదీర్ఘ కాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సోదరుడు సత్యనారాయణ ఆకాంక్షించారు.

సోమవారం తిరుచెందూర్‌ కుమారస్వామి ఆలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రజినీకాంత్‌ నటిస్తున్న జైలర్, లాల్‌ సలాం చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయన్నారు.

మరిన్ని వార్తలు