‘ఆకాశమే నీ హద్దురా’ రివ్యూ

12 Nov, 2020 09:41 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : ఆకాశమే నీ హద్దురా
నటీనటులు : సూర్య, అపర్ణా బాలమురళీ, మోహన్‌ బాబు, పరేశ్‌ రావల్‌ తదితరులు
దర్శకత్వం : సుధా కొంగర
నిర్మాతలు : సూర్య, గునీత్‌ మొంగ
సంగీతం : జీవీ ప్రకాశ్‌ కుమార్‌
సినిమాటోగ్రఫీ:  నికెత్‌ బొమ్మిరెడ్డి
విడుదల తేది : నవంబర్‌ 12( అమెజాన్‌ ప్రైమ్‌)

వంద శాతం ఫలితాన్ని ఆశిస్తే అందుకోసం మనం వెయ్యి శాతం కష్టపడాలి అంటారు హీరో సూర్య. అందుకే విలక్షణత కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటారు. నటనకు ఆస్కారం ఉన్న కథాంశాలనే ఎన్నుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఒక్కోసారి అవి బెడిసి కొట్టినా పట్టు వదలరు. సినిమాకి, సినిమాకి మధ్య కథలో తన పాత్రలో వేరియేషన్స్‌ చూపిస్తుంటారు. ఇందుకు ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమానే ఉదాహరణ. రాజకీయాల నేపథ్యంలో చేసిన ఎన్‌జీకే, ఆ తర్వాత వచ్చిన బందోబస్తు ‌(కాప్పాన్‌)లు ఆశించిన ఫలితాల్ని ఇవ్వకపోయినా కమర్షియల్‌ సినిమా వైపు అడుగులు వేయకుండా ఓ వ్యక్తి జీవిత కథను ఎంచుకున్నారు. అయితే సూర్య ప్రయోగం బెడిసి కొట్టిందా? లేక ఫలించిందా?. నిజ జీవితంలో సక్సెస్‌ అయిన కథ వెండి తెరపై విజయాన్ని అందుకుందా? లేదా?  

కథ : 
ఓ సాధారణ స్కూల్‌ టీచర్‌ కొడుకు అహోరాత్రులు కష్టపడి ఓ ఎయిర్‌ లైన్స్‌ సంస్థను ఎలా స్థాపించాడు అన్నదే సినిమా కథ.

విశ్లేషణ :
హ్యూమన్‌ సక్సెస్‌ స్టోరీలు వెండి తెరపైకి రావటం కొత్తేమీ కాదు. దర్శకురాలు సుధ కొంగర డెక్కన్‌ ఎయిర్‌ లైన్స్‌ అధినేత జీఆర్‌ గోపినాథన్‌ జీవిత కథలో చిన్న చిన్న మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిజంగా జరిగిన కథ కాబట్టి దాని గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కమర్షియల్‌ సినిమాలో ఉన్నన్ని ట్విస్టులు, ఎలివేటెడ్‌ సీన్‌లు లేకపోయినా ఈ సినిమా మనల్ని మెప్పిస్తుంది. కథను ఎంచుకోవటంలోనే కాదు దాన్ని తెరకెక్కించటంలోనూ దర్శకురాలు సక్సెస్‌ అయింది. జీవీ ‍ ప్రకాశ్‌ అందించిన సంగీతం కూడా సినిమాకు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అయింది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ప్రతీ సీన్‌ను మరింత ఆకర‍్షణీయంగా మలిచిందని చెప్పటంతో అతిశయోక్తి లేదు. ఖర్చుకు వెనుకాడని నిర్మాతలు, నికెత్‌ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీతో ‍ప్రతీ ఫ్రేము అందంగా మలచబడింది. 

నటీనటులు : 
హీరో సూర్య నటించాడు అనటం కంటే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు అనటం బాగుంటుంది. కొన్ని కొన్ని సన్నివేశాల్లో తన నటనతో కంటతడి పెట్టిస్తాడు కూడా. ఒక రకంగా సూర్యది వన్‌ మ్యాన్‌ ఆర్మీ షో. ఇక హీరోయిన్‌ అపర్ణా బాల మురళీ నటన కూడా మనల్ని ఆకట్టుకుంటుంది. ఇక ఇద్దరి మధ్యా చోటుచేసుకునే సన్ని వేశాలు బాగా రక్తికట్టాయి. మోహన్‌ బాబు, పరేశ్‌ రావల్‌లు పోటాపోటీగా నటించారు. తమదైన నటనతో, శైలితో మెప్పించారు. సూర్య మిత్రులు ఇతర నటీనటులు తమ పాత్ర నిడివి తక్కువైనప్పటికి ఉన్నంత సమయంలో బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇచ్చారు.

ప్లస్‌ పాయింట్స్‌ 
సూర్య అత్యాద్భుతమైన నటన
పాటలు
కథలోని భావోద్వేగాలు

Rating:  
(3.5/5)
మరిన్ని వార్తలు