కాలాన్ని వెనక్కి తీసుకెళుతున్న హీరోలు..

24 Aug, 2022 09:05 IST|Sakshi

కొందరు తమిళ హీరోలకు కాలం ముందుకు వెళ్లడంలేదు.. వెనక్కి వెళుతోంది. టైమ్‌ మిషన్‌ ఎక్కలేదు. మరి.. ఎలా వెనక్కి వెళ్లారంటే చారిత్రాత్మక చిత్రాలు చేస్తున్నారు. వెండితెరపై పాతకాలంలోకి వెళ్తున్నారు. ఈ పీరియాడికల్‌ ఫిల్మ్స్‌ కోసం గడియారాన్ని వెనక్కి తిప్పుతున్నారు. ఇక ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ప్రముఖ దర్శకుడు మణిరత్నం పదో శతాబ్దం నేపథ్యంలో సాగే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమా తీశారు. కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. పదో శతాబ్దంలో చోళుల పాలన, రాజనీతి, యుద్ధనీతి వంటి అంశాల ఆధారంగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సాగుతుంది.

ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌లో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలు పోషించారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాది సెప్టెంబరు 30న విడుదల కానుంది. కాగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంతో పాటు మరో పీరియాడికల్‌ ఫిల్మ్‌కు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు విక్రమ్‌. పా. రంజిత్‌  దర్శకత్వంలో విక్రమ్‌ ఓ సినిమా చేయనున్నారు. 18వ శతాబ్దపు కథతో సాగనుందని కోలీవుడ్‌ టాక్‌. ఇక హీరో సూర్య కూడా పీరియాడికల్‌ ఫిల్మ్స్‌లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం వెట్రిమారన్‌ దర్శకత్వంలో ‘వాడి వాసల్‌’ సినిమాలో నటిస్తున్నారు. జల్లికట్టు నేపథ్యంలో సాగే ఈ చిత్రం 18వ శతాబ్దపు నేపథ్యంలో ఉంటుంది.

కాగా హీరో సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్‌లో వచ్చిన ‘సూరరై పోట్రు’ హిట్‌ సాధించిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. పీరియాడికల్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. అయితే ప్రస్తుతం బాల దర్శకత్వంలో ‘అచలుడు’, శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు సూర్య. ఈ రెండు చిత్రాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే సూర్య చేయాల్సిన పీరియాడికల్‌ ఫిల్మ్ప్‌ పూర్తి స్థాయిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు ‘కెప్టెన్‌ మిల్లర్‌’ అనే పీరియాడికల్‌ ఫిల్మ్‌ చేస్తున్నారు ధనుష్‌. 1930–1940ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అరుణ్‌ మాదేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ధనుష్‌ హీరోగా నటించాల్సిన మరో చిత్రం ‘అయిరత్తిల్‌ ఒరువన్‌ 2’.

చోళ సామ్రాజ్యానికి సంబంధించిన అంశాల పరిశోధనల నేపథ్యంలో 2010లో వచ్చిన ‘అయిరత్తిల్‌ ఒరువన్‌’ (తెలుగులో ‘యుగానికి ఒక్కడు’) చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందనుంది. అయితే తొలి భాగంలో కార్తీ హీరోగా నటించగా, మలి భాగంలో ధనుష్‌ హీరోగా నటిస్తారు. సీక్వెల్‌లో కార్తీ పాత్ర కూడా ఉంటుందనే వార్తలు వచ్చాయి. ఇక తొలి భాగానికి దర్శకత్వం వహించిన సెల్వ రాఘవన్‌నే సీక్వెల్‌నూ తెరకెక్కించనున్నారు. కాగా తమిళ, తెలుగు భాషల్లో ధనుష్‌ ‘సార్‌’ (తమిళంలో ‘వాత్తి’) సినిమా చేస్తున్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా కథ 2000 నేపథ్యంలో సాగతుందట. ఇంకోవైపు తమిళ హీరో శివ కార్తికేయన్‌ ‘మహావీరన్‌’ (తెలుగులో ‘మహావీరుడు’) అనే సినిమా చేస్తున్నారు. టైటిల్‌ని బట్టి ఇది కూడా పీరియాడికల్‌ ఫిల్మ్‌ అయ్యుండొచ్చు. మరి కొందరు తమిళ హీరోలు కూడా పీరియాడికల్‌ ఫిల్మ్స్‌ కోసం కొత్త కథలు వింటున్నారు. 

మరిన్ని వార్తలు