నీట్‌ను రద్దు చేయాలన్న సూర్య.. విరుచుకుపడుతున్న బీజేపీ నేతలు

20 Jun, 2021 14:06 IST|Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య శివకుమార్‌, కేంద్ర విద్యావ్యవస్థను మరోసారి తప్పుబడుతూ ఒక ప్రకటన విడుదల చేశాడు. నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌) ప్రవేశ పరీక్షలు నిర్వహించడం.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడడమే అవుతుందని తన అభిప్రాయాన్ని మళ్లీ వెలిబుచ్చాడు. కాబట్టి, అలాంటి ప్రవేశపరీక్షను రద్దు చేయడమే మంచిదని ఆ ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని కోరాడు. 

వైద్యవిద్యా ప్రవేశాల్లో నీట్‌ ప్రభావం ఏమేర ఉందో తెలుసుకునేందుకు ఒక అధ్యయనం నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ.. సూర్య తన అగరమ్‌ ఫౌండేషన్‌ తరపున ఒక ప్రకటన విడుదల చేశాడు. అంతేకాదు తన ఫౌండేషన్‌ తరపున ప్రభుత్వ ప్యానెల్‌కు నివేదిక సమర్పించిందని సూర్య ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ‘‘ఇలాంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షా విధానాలు సామాజిక న్యాయానికి విరుద్ధం. స్టూడెంట్స్‌ను బలి పశువుల్ని చేయొద్దు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యావ్యవస్థ తీరుతెన్నులను.. రాష్ట్రాలకే వదిలేయడం మంచిది’’ అని సూర్య ఆ ప్రకటనలో పేర్కొన్నాడు.

బీజేపీ విమర్శలు
కాగా, సూర్య తాజా ప్రకటనపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. సినిమాల్లో నటిస్తే చాలని.. సొసైటీలో నటించాల్సిన అవసరం లేదని సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈ విమర్శల పర్వంలో సూర్యకు ఫ్యాన్స్‌ సపోర్ట్‌ దొరుకుతోంది. ఆర్థిక పరిస్థితులు, భాషల ప్రతిపాదికన దేశంలో వేర్వేరు విద్యావిధానాలు అమలు అవుతున్నప్పుడు.. నీట్‌ తరహా ప్రవేశ పరీక్షలను అమలు చేయడం సరికాదని సూర్య ప్రస్తావించిన పాయింట్‌ను లేవనెత్తుతున్నారు ఫ్యాన్స్‌. ఇక నీట్‌ ప్రభావంపై అధ్యయనం కోసం స్టాలిన్‌ ప్రభుత్వం జస్టిస్‌ ఏకే రంజన్‌ నేతృత్వంలో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ప్రజలు తమ అభిప్రాయాల్ని neetimpact2021@com కు మెయిల్‌ చేయాలని ప్యానెల్‌ కోరింది.

చదవండి: నీట్‌పై కామెంట్లు.. చిక్కుల్లో సూర్య!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు