కాస్టింగ్‌ కౌచ్‌: దక్షిణాది అగ్ర దర్శకుడిపై బాలీవుడ్‌ నటి సంచలన వ్యాఖ్యలు

25 Jun, 2021 20:59 IST|Sakshi

దక్షిణాది పరిశ్రమకు చెందిన నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ దర్శకుడు తనని వేధించాడని బాలీవుడ్‌ నటి సుర్వీన్‌ చావ్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మొదటి సారి కాదని బాలీవుడ్‌, సౌత్‌ పరిశ్రమలో దాదాపు అయిదు సార్లు తాను కాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నట్లు ఆమె ఆరోపించారు. ఇటీవలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించారు. ‘ఏ పరిశ్రమలో అయిన క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. నేను కూడా దాని బాధితురాలినే. ఒక్కసారి కాదు 5 సార్లు ఈ సంఘటనను ఎదుర్కొన్నాను. ముఖ్యంగా దక్షిణాది సినీ పరిశ్రమలో మూడుసార్లు నాకు ఈ చేదు అనుభవం ఎదురైంది’ అని ఆమె చెప్పుకొచ్చారు. 

‘అక్కడ పేరు మోసిన ఓ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహిత తన సినిమా ఆఫర్‌ ఇచ్చాడు. దీంతో నేను ఆడిషన్స్‌కి వెళ్లాను. ఒక రోజంతా ఆడిషన్‌లోనే ఉన్నాను. దీంతో నాకు కాస్తా జబ్బు చేయడంతో ఆ రోజు రాత్రి తిరిగి ముంబై వెళ్లిపోయాను. నేను ముంబై వచ్చాక ఆ దర్శకుడు ఫోన్‌ చేసి ‘మీకు ఆరోగ్యం బాగలేదు కదా నన్ను ముంబయికి రమ్మంటారా?’  అని అడిగారు. నేను వద్దని చెప్పి ఫోన్‌ పెట్టేశాను. అయినా అతడు పదే పదే ఫోన్‌ చేసి విసిగించారు. దీంతో అతడిపై తనకు అనుమానం వచ్చిందని’ ఆమె వ్యాఖ్యానించారు. ‘అలా కొన్ని రోజులకు మళ్లీ అదే నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. లిఫ్ట్‌ చేసి మాట్లాడగా ఈ సారి ఆయన మాట్లాడకుండా మరో వ్యక్తితో ఫోన్‌ మాట్లాడించారని చెప్పారు.

‘ఆ వ్యక్తి మాట్లాడుతూ ‘సినిమా తెరకెక్కించడానికి చాలా సమయం పడుతుంది. డైరెక్టర్‌ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. ఇది కేవలం సినిమా పూర్తయ్యే వరకే’ అని అనడంతో అతడి మాటల్లోని భావం నాకు అర్థమైంది. దీంతో నా టాలెంట్‌ నచ్చితే అవకాశం ఇవ్వండి.. లేకపోతే అవసరం లేదు అని గట్టిగా సమాధానమిచ్చి ఫోన్‌ కట్‌ చేశాను’ అని చెప్పారు. అనంతరం ఆమె ఈ కాస్టింగ్‌ కౌచ్‌ దక్షిణాదిలోనే కాదని బాలీవుడ్‌లోనూ ఉందని పేర్కొన్నారు. ఇక్కడ ఓ నిర్మాత తన కాళ్లు ఎలా ఉన్నాయో చూడాలన్నారని,  మరొకరమో నా శరీరభాగాల్లోని ప్రతి అణువు తనకు తెలియాలంటూ అసభ్యంగా మాట్లాడారంటూ సుర్వీన్‌ చావ్లా వివరించారు. కాగా తెలుగులో ఆమె ‘రాజు మహారాజు’లో నటించారు.

చదవండి: 
సౌత్‌ నిర్మాత రాత్రంతా గదిలో ఉండమన్నాడు : నటి
ముద్దు సీన్‌ రిహార్సల్‌ అంటూ దారుణంగా ప్రవర్తించేవాడు: హీరోయిన్‌

మరిన్ని వార్తలు