అంతకు మించి దారి లేదు!

30 Oct, 2020 01:18 IST|Sakshi

సూర్య హీరోగా,  నిర్మాతగా  విలక్షణ నటుడు మోహన్‌ బాబు, అపర్ణా బాల మురళీ ప్రధాన పాత్రధారులుగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ (తమిళంలో ‘సూరరై పోట్రు’).
ఎయిర్‌డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపినాథ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నవంబర్‌ 12న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలకానుంది. ఈ సందర్భంగా సూర్య చెప్పిన విశేషాలు.

► ఒక కామన్‌ మ్యాన్‌ కల ఈ సినిమా. తను కన్న కలను నెరవేర్చుకోవటానికి ఒక వ్యక్తి తన  ప్రయాణంలో ఎదుర్కొన్న పరిస్థితుల సమాహారమే ‘ఆకాశం నీ హద్దురా’.  కర్ణాటకలోని ఓ స్కూల్‌ టీచర్‌ కొడుకు ఎయిర్‌ డెక్కన్‌ అనే ఎయిర్‌లైన్‌ సంస్థను స్థాపించి సామాన్యులకు ఎంత దగ్గరగా తన సామ్రాజ్యాన్ని తీసుకెళ్లాడు? ఇరవైనాలుగువేల రూపాయలు ఉండే విమాన టికెట్‌ ధరను నాలుగువేలకు, రెండువేలకు, చివరకు 1రూపాయితో సామాన్యుడు ఎలా ప్రయాణించాడు? అనే కథతో తెరకెక్కిన చిత్రమిది. ఈ కల కన్న గోపీనాథ్‌గారు రియల్‌ హీరో.

► 670 పేజీలుండే ‘సింప్లీ ఫ్లై’ బుక్‌ ఆధారంగా ఈ చిత్రాన్ని తీశాం. అందులోని నాలుగు ముఖ్య భాగాల్ని, 120 పేజీల కథని మాత్రమే ఈ సినిమాకి వాడుకున్నాం. పుస్తకమంతా సినిమాగా తీస్తే 7 గంటలపైనే కంటెంట్‌ వస్తుంది. అందుకే ముఖ్మమైన భాగాల్ని తీసుకుని 120 నిమిషాల్లో సినిమాని నిర్మించాం. 38 సినిమాలు చేసిన తర్వాత కూడా ఈ సినిమా నాకు ఒక కొత్త అనుభూతినిచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ కథకు నేను ఎంతగా కనెక్ట్‌ అయ్యానో.

► సుధాని నేను ‘యువ’ సినిమా టైమ్‌లో కలిశాను. అప్పుడామె మణిరత్నంగారి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేసేవారు. ఆమె దర్శకత్వంలో సినిమా చేయడాన్ని బాగా ఎంజాయ్‌ చేశాను. నేనే కాదు, నాతో పాటు టీమ్‌లో ఉన్న మిగతా 250మంది సుధాతో ఎంతో స్వీట్‌గా పని చేశాం. సుధ క్రమశిక్షణ, క్రాఫ్ట్‌ మీద ఆమెకు ఉన్న పట్టు మా అందరితో అంత బాగా పని చేయించింది.

► మోహన్‌బాబుగారి లాంటి లెజెండ్‌తో పనిచేయటం ఆనందంగా అనిపించింది. ఈ కథ విన్న వెంటనే ‘నేను సినిమా చేస్తున్నాను’ అని చెప్పారు. గొప్పవాళ్లంతా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారనడానికి ఇదే ఉదాహరణ. ముందురోజే తన డైలాగ్‌లను నేర్చుకుని ‘ఏమ్మా ఈ డైలాగ్‌ ఇలానేనా చెప్పేది’ అని దర్శకురాలిని అడుగుతూ తనను తాను కరెక్ట్‌ చేసుకోవటం నిజంగా గ్రేట్‌.

► ‘ఆకాశం నీ హద్దురా’ని హిందీలో రీమేక్‌ చేస్తామని అడుగుతున్నారు. ఒకవేళ రీమేక్‌ చేస్తే ఇందులో నేను చేసిన చంద్రమహేశ్‌ పాత్ర చేయను. వేరే క్యారెక్టర్‌  చేస్తాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటీటీలో సినిమాను విడుదల చేయటం ఉత్తమం. అంతకుమించి మరో దారి లేదు. థియేటర్, సౌండ్, ప్రేక్షకుల చప్పట్లు ఖచ్చితంగా మిస్సవుతున్నాను. నేనే కాదు.. అందరూ ఎప్పుడు సాధారణ పరిస్థితులు వస్తాయా? అని ఎదురు చూస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు