నేను పెద్ద సంగీత దర్శకుడిని అన్న గర్వం లేదు

21 Feb, 2021 10:32 IST|Sakshi

సలలితరాగ సుధారస సారం.. నిదురపోరా తమ్ముడా..
పరమ గురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడురా.. ప్రేమే నేరమౌనా..
వగలాడి వయ్యారం భలే జోరు.. జననీ శివ కామినీ ..

ఈ పాటలు మచ్చుకి మాత్రమే. 
మాధుర్యప్రధానమైన పాటలు, హాస్య గీతాలు, జోల పాటలతో తెలుగు చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానం సంపాదించారు సుసర్ల దక్షిణామూర్తి. ఇంటి దగ్గర పిల్లలతో ఒక మామూలు తండ్రిలానే ఉండేవారు. పిల్లలను సంతోషంగా ఉంచటం, మనవలకు జోల పాడటం సుసర్లకు ఇష్టం.. సెల్ఫ్‌మేడ్‌గా సంగీతజ్ఞానం సంపాదించుకుని, సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులతో ఎలా ఉండేవారో వారి ఆఖరి కుమార్తె అనూరాధ సాక్షికి వివరించారు.

నాన్నగారు పెదకళ్లేపల్లిలో పుట్టారు. తండ్రి కృష్ణ బ్రహ్మశాస్త్రి, తల్లి అన్నపూర్ణమ్మ. నాన్నగారి తాతగారి పేరే ఆయనకు పెట్టారు. ఆయన నేరుగా త్యాగరాజు శిష్యులు. నాన్నగారికి ఒక అక్క, నలుగురు చెల్లెళ్లు. అందరూ సంగీతం నేర్చుకున్నారు. మా పెళ్లిలో మా అత్తయ్యలే పాడారు. తాతయ్యగారి దగ్గర అందరూ వయొలిన్‌ నేర్చుకుంటుంటే, అది విని నాన్న సొంతంగా వాయించేవారట. 14 సంవత్సరాలకే వయొలిన్‌ వాయించటం వచ్చేసింది ఆయనకు. ఆకతాయితనంగా ఎక్కడికి కావాలంటే అక్కడకు వెళ్లి వయొలిన్‌ వాయించేవారట.

అలా సంగీతంలో మునిగిపోయిన నాన్నగారు ఒకసారి ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్లిపోయి, అలాఅలా తిరుగుతూ ఏలూరు చేరుకున్నారట. అక్కడ స్టేజీ మీద వయొలిన్‌ వాయించిన తీరు చూసి మురిసిపోయిన నిర్వాహకులు నాన్నను ఏనుగు మీద ఊరేగించారట. విషయం తెలుసుకున్న తాతగారు, నాన్నకి ఉన్న సంగీత పరిజ్ఞానం, శ్రద్ధ గమనించి నాన్నకు సంప్రదాయబద్ధంగా వయొలిన్‌ నేర్పించారట. సంగీత కచేరీలు చేస్తూ ఒకసారి నంద్యాలకు కార్యక్రమానికి వెళ్లినప్పుడు అక్కడ అమ్మని చూసి, ఇష్టపడి, చిన్న వయసులోనే పూరీ జగన్నాథుని సన్నిధిలో పెళ్లి చేసుకున్నారట. అలా ఆ రోజుల్లోనే నాన్నది ప్రేమ వివాహం అనుకోవచ్చు.

చిత్రమైన అనుభవం...
ఒకసారి నాన్న వయొలిన్‌ కచేరీకి ఒక ఊరు వెళ్లవలసి వచ్చి రైలు ఎక్కారట. తన దగ్గరున్న వయొలిన్‌ బాక్స్‌ చూసిన టీటీ, బాక్సులో ఏముందని అడిగారట. అందుకు నాన్న ‘వయొలిన్‌’ అని చెబితే, వెంటనే ఆ టీటీ నాన్నను వయొలిన్‌ వాయించమని రైలులో నుంచి కిందకు దింపారట. నాన్న తన్మయత్వంతో వాయించేసరికి టీటీ రూమ్‌లోకి జనమంతా గుంపులుగుంపులుగా చేరారట. అప్పుడు నాన్న వయసు 18 సంవత్సరాలు. అది బ్రిటిష్‌ కాలం. అక్కడున్న బ్రిటిష్‌ ఆఫీసర్‌ నాన్నగారికి టికెట్‌ అక్కర్లేకుండా రైలు ఎక్కించారట. అలా ఆయన తన సొంత కృషితో రైలు ప్రయాణం చేశారు.

కలకత్తాలోనే..
నాన్నగారు సినిమాల్లోకి ప్రవేశిస్తున్న తొలినాళ్లలో సినిమాలన్నీ కలకత్తాలోనే రూపొందేవి. అందుకేనేమో నాన్న ముందుగా కలకత్తా వెళ్లారట. అక్కడుండగానే కొన్ని సినిమాలకు, గ్రామఫోన్‌ రికార్డులకు పని చేశారట. గ్రామఫోన్‌ రికార్డు కంపెనీవారు నాన్నగారి సంగీత విధానానికి ఆశ్చర్యపడి, ‘ఈ అబ్బాయి సంగీతంలో నిష్ణాతుడు, సంగీత దర్శకత్వం బాగా చేయగలడు’ అని లెటర్‌ ఇచ్చారట. అప్పుడే కొత్తగా తమిళనాడులో స్టూడియోలు ప్రారంభం అవుతుండటంతో ఇక్కడకు వచ్చేశారట. చివరకు ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో సంగీతంలో ఏ గ్రేడ్‌ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారట. అంతకు ముందు ఎన్నో ఊళ్లు తిరిగారట నాన్న. అందులో భాగంగానే సిలోన్‌ కూడా వెళ్లారట. ‘నారద నారదీయం’ చిత్రంలో మొదటి అవకాశం వచ్చింది.

కాఫీ కోసం పోటీ పడేవాళ్లం..
నేను, అన్నయ్య నాన్న దగ్గరే పడుకునేవాళ్లం. పొద్దున్నే నాన్నకు కాళ్లు తొక్కితే పావు కప్పు కాఫీ ఇస్తాను అనేవారు. ఆ కాఫీ కోసం కాళ్లు తొక్కడా నికి పోటీపడేవాళ్లం. ఉప్మా అంటే చాలా ఇష్టం. అల్లం, కరివేపాకు, ఆవాలు, అన్నీ వేసిన మంచి బ్రాహ్మణ వంటకాలంటే ఇష్టం. తమలపాకులు నమిలే అలవాటు ఉండేది. డాక్టర్‌ సలహా మేరకు మానేశారు. ఎవరైనా ఏడుస్తుంటే, తట్టుకోలేక పక్కకు వెళ్లిపోయేవారు. ఎవ్వరి గురించీ చెడు మాట్లాడటం ఇష్టం ఉండదు నాన్నకి. టైమ్‌కి రెడీ అయిపోయేవారు. పాడుకుంటూ ఉండేవారు.. అకాల నిద్ర ఉండేది కాదు. నిత్యం ఉత్సాహం గా ఉండేవారు. ఆయన ముఖంలో తేజస్సు ఉండేది. ఎనిమిది వేళ్లకు ఉంగరాలు పెట్టుకునేవారు. ఆఖరి రోజుల వరకు తాళం వేస్తూ, ఆయనలో ఆయన పాడుకుంటూ ఉండేవారు. సమయ పాలన, సమయ పరిజ్ఞానం బాగా ఎక్కువ. అమ్మ పోయాక, నాన్న ముప్పై సంవత్సరాలు ఉన్నారు. సుగర్‌ కారణంగా చూపు దెబ్బ తింది. కళ్లు కనిపించకపోయినా, హాల్‌లోనే కూర్చునేవారు. లోపలకు వచ్చేవారు కాదు. ‘వర్షం పడుతోందా, ఎండ ఎక్కువగా ఉందా’ అంటూ ఏదో ఒకటి అడుగుతుండేవారు. ఆయనకు కనిపించదని ఎవరైనా చెబితేనే కానీ తెలియదు. 90 సంవత్సరాలు వచ్చేవరకు నా దగ్గర, అన్నయ్య దగ్గర ఉన్నారు.

సంపాదించారు – పోగొట్టుకున్నారు..
సినిమా రంగంలో మంచి పేరుతో పాటు ఎంతో డబ్బు కూడా సంపాదించారు. రెండు సినిమాలు తీయటం వల్ల ఆర్థికంగా నష్టపోయినా బాధపడలేదు. ఉన్నదానితో సంతృప్తి చెందేవారు. చక్రవర్తి గారు సంగీత దర్శకులుగా ఉన్న రోజుల్లో, నాన్న దగ్గరకు వచ్చి, ‘మీ చేతిలో ఇంత విద్య ఉండి ఇలా ఉంటే ఎలా, నాతో రండి’ అని కారులో తీసుకువెళ్లారు. ‘నేను పెద్ద సంగీత దర్శకుడిని’ అనే గర్వం నాన్నకి ఉండేది కాదు. ఎవరు ఏది అడిగినా చేసేవారు. ఒకసారి నాన్నకు ఇళయరాజా సన్మానం చేసి, ఉంగరం ఇచ్చారు. నాన్నగారితో రికార్డింగులకి ఎక్కువగా ప్రభు బాబాయ్‌  (కజిన్‌) వెళ్లేవారు. నాన్నగారికి కంటి ఆపరేషన్‌ అయినప్పుడు కూడా వెంటే ఉన్నారు.

స్నేహం వియ్యంగా మారింది..
 గోపీనాథ్‌ మీనన్‌ నాన్నకి ఆడిటర్‌గా చేశారు. ఆయనతో కలసి నాన్న ఆరు సార్లు శబరిమల వెళ్లారు. అక్కడికి వెళ్లి వచ్చిన తరవాతే అన్నయ్య పుట్టాడు. అందుకే అన్నయ్యకు హరిహర ప్రసాద్‌ అని పేరు పెట్టారు. ఆ తరవాత అన్నయ్య హరిప్రసాద్‌గా మారాడు. మీనన్‌గారితో ఉన్న స్నేహం వియ్యంగా మారింది. వారి ఆఖరి అబ్బాయితో నా వివాహం జరిగింది. నాన్న మా ఎవ్వరికీ సంగీతం నేర్పిం^è లేదు. అమ్మకి సినిమా వాళ్ల మీద మంచి అభిప్రాయం ఉండేది కాదు. మేం చదువుకుంటేనే ఆవిడకు ఇష్టం. నాన్నకి పుట్టిన రోజు పండుగ జరుపుకోవటం అంటే చాలా ఇష్టం. కేక్‌ తీసుకువచ్చి, పాట పాడాలి. అప్పుడే ఉత్సవం పూర్తయినట్లు. నాన్న పిల్లలుగా పుట్టడం మా అదృష్టంగా భావిస్తాం.

నవ్వించేవారు...
నాన్నగారికి మేం ఏడుగురం సంతానం. కల్యాణి (బంగారం వ్యాపారం), నళిని (డాక్టర్‌), పార్వతి (టీచర్‌), అన్నపూర్ణ (టీచర్‌), వరలక్ష్మి (డాక్టర్‌), హరిహరప్రసాద్‌ (టెక్నికల్‌ సైడ్‌). నేను (బి.కాం, టీచర్‌గా కూడా పనిచేశాను) ఆఖరి అమ్మాయిని. అంత మంది ఆడ పిల్లలమే అయినా మంచి స్కూల్‌లో చదివించారు. ఇంటి దగ్గర చాలా సరదాగా ఉండేవారు. మమ్మల్ని బాగా గారాబంగా చూసేవారు. మేం తలంటు పోసుకుంటే, ఆప్యాయంగా తల తుడిచేవారు. ఒకసారి మా నలుగురు అక్కలు స్కూల్‌కి కారులో బయలుదేరారు. ఆ రోజు పబ్లిక్‌ ఎగ్జామ్‌. చాలా టెన్షన్‌లో ఉన్నారు. రెండో అక్క మరీ టెన్షన్‌గా ఉంది. నాన్నగారు అది గమనించి, ‘పరీక్ష పేపర్‌లో వచ్చిన వాటిలో మీకందరికీ తెలిసింది రాయండి, మీకు తెలియనివి, పక్కన అమ్మాయి దాంట్లో చూసి రాయండి’ అంటూ, అందరినీ టెన్షన్‌ నుంచి తప్పించారు. పిల్లలు నిద్రపోతుంటే ఆనందంగా చూసేవారు. ఎవ్వరినీ నిద్రలేపేవారు కాదు. స్కూల్‌ టైమ్‌ అయిపోతున్నా, వర్షం పడుతున్నా కూడా నిద్ర లేపటం ఆయనకు ఇష్టం లేదు. 

పేకంటే ఇష్టం...
పేకలో రమ్మీ అంటే ఇష్టం. అందరం కలసి ఆడుకునేవాళ్లం. అమ్మ కూడా ఆడేది. మేం ఎక్కడికైనా వెళితే, ఇంటికి వచ్చేవరకు సందు చివర ఉన్న అరుగు మీద కూర్చునేవారు. ఆలస్యం అవుతుందని సమాచారం ఇవ్వడానికి అప్పట్లో ఫోన్‌ ఉండేది కాదు. ‘అయ్యో పాపం నాన్న కూర్చున్నారే’ అనిపించేది. ‘కాళ్లకి చెప్పులు అరిగిపోయేలా ఎందుకు వీధిలో తిరుగుతారు’ అని అమ్మ అనేది. మమ్మల్ని చూడగానే నవ్వేవారు. ఎప్పుడూ పరుషంగా ఒక్క మాట కూడా అనలేదు. మేం ఎక్కువ అల్లరి చేస్తే, అమ్మని పిలిచేవారు. ‘అలా పిలిచే బదులు మీరే ఒక దెబ్బ వెయ్యొచ్చు కదా’ అనేది అమ్మ. నాన్నకి కోపం రావటం, మమ్మల్ని కొట్టడం మాకు తెలియదు. మంగళ హారతులు ఇచ్చే సమయంలో ‘జననీ శివకామినీ’ పాట పాడతాం. నాన్న స్వరపరిచిన ఈ పాట మా అందరికీ చాలా ఇష్టం. ‘నర్తనశాల’  చిత్రం లోని ‘శీలవతీ నీ గతీ’ పాట చాలా ఇష్టం. బాలు గారు నాన్నను, ‘గురువులకు గురువు’ అంటూ సన్మానం చేశారు. నాన్న జోలపాటలకు ప్రసిద్ధి. మనవలందరికీ జోల పాడేవారు. 
- అనూరాధ, సుసర్ల దక్షిణామూర్తి ఆఖరి కుమార్తె

సంభాషణ: వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు