‘అప్పుడే ముంబై పోలీసులను అప్రమత్తం చేశా’

3 Aug, 2020 20:18 IST|Sakshi

ముంబై : తన కొడుకు ప్రమాదంలో ఉన్నాడని ఫిబ్రవరిలోనే ముంబై పోలీసులను సంప్రదించినట్లు దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ తండ్రి కేకే సింగ్‌ పేర్కొన్నారు. తన కుమారుడి ప్రాణానికి ప్రమాదం ఉందని ఫిబ్రవరి 25న ముంబై పోలీసులను అప్రమత్తం చేసినట్లు  వీడియో స్టేట్‌మెంట్ విడుదల చేశారు. ఈ వీడియోలో అతను మాట్లాడుతూ.  ‘ఫిబ్రవరి 25 న బాంద్రా పోలీసులకు సుశాంత్‌ ప్రమాదంలో ఉన్నాడని తెలియ జేశాను. ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులపై చర్య తీసుకోమని నేను వారిని కోరాను. సుశాంత్‌ జూన్ 14న మరణించాడు. తను మరణించిన 40 రోజుల తరువాత కూడా ముంబై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే నేను పట్నాలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశాను. వాళ్లు వెంటనే స్పందించారు’. అని పేర్కొన్నారు. దీంతో ఈ కేసు విచారణలో బిహార్, మహారాష్ట్ర పోలీసుల మధ్య వివాదం నడుస్తోంది. (సూసైడ్‌ ముందు సుశాంత్‌ ఏం సెర్చ్ చేశాడంటే..)

అంతేగాక సుశాంత్‌ ఆత్మహత్య కేసులో వాస్తవాలను వెలికి తీయడంలో పట్నా పోలీసులు సాయం చేయాలని బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను కూడా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కేకే సింగ్‌ తన ఫిర్యాదులో.. సుశాంత్‌ ముంబై బ్యాంక్ ఖాతా నుంచి రూ .15 కోట్లను అక్రమంగా స్నేహితురాలు రియా చక్రవర్తికి బదిలీ చేసినట్లు, తనను మానసికంగా వేధించినట్లు ఆరోపించారు. కాగా చనిపోవడానికి ముందు సుశాంత్ .. మ‌ర‌ణం గురించి ఇంట‌ర్నెట్‌లో వెతికిన‌ట్లు ముంబై పోలీసులు తెలిపారు. కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని బాంద్రా నివాసంలో ఉరికి వైలాడుతూ కనిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు సోమవారం ముంబై పోలీస్ చీఫ్ పరంవీర్‌ సింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. సుశాంత్‌ అకౌంట్‌ నుంచి రియా చక్రవర్తికి చట్ట విరుద్ధంగా డబ్బును బదిలీ చేశారనే వాదనలకు ఆధారాలు లేవన్నారు. (రక్షాబంధన్ : సుశాంత్ సోదరి భావోద్వేగం)

మరిన్ని వార్తలు