రియాకు వ్య‌తిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ ఒత్తిడి

31 Jul, 2020 11:00 IST|Sakshi

ముంబై:  బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రియా చక్రవర్తి పాత్రపై దర్యాప్తు చేయాల్సిందిగా సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రియాకు వ్య‌తిరేకంగా త‌ప్పుడు స్టేట్‌మెంట్లు ఇవ్వాల‌ని సుశాంత్ కుటుంబ‌స‌భ్యులు ఒత్తిడి చేస్తున్నార‌ని అతడి స్నేహితుడు, క్రియేటివ్ కంటెంట్ మేనేజర్ సిద్ధార్థ్ పిథాని ఆరోపించాడు. (రియాతో బంధం తెంచుకోవాలనుకున్నాడు: అంకిత)

ఈ విష‌యంపై బాంద్రా పోలీసుల‌కు ఈ మెయిల్ చేసిన పిథాని మాట్లాడుతూ జూలై 22న సుశాంత్ సోద‌రి మీతు సింగ్, ఆమె భ‌ర్త‌, సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఓపి సింగ్ నుంచి త‌న‌కు కాన్ఫ‌రెన్స్ కాల్ వ‌చ్చింద‌ని తెలిపాడు. రియా, సుశాంత్ క‌లిసి ముంబైలోని మౌంట్ బ్లాంక్‌లో నివాసం ఉన్న స‌మ‌యంలో ఆమె ఖ‌ర్చుల గురించి ప‌లు ప్ర‌శ్న‌లు అడిగార‌ని, దీనికి సంబంధించి రియాకు వ్య‌తిరేకంగా  పోలీసుల‌కు స్టేట్‌మెంట్ ఇవ్వాల‌ని ఒత్తిడి చేసినట్లు తెలిపాడు. వాస్త‌వానికి రియాకు సంబంధించిన విష‌యాల‌పై పెద్ద‌గా తెలియ‌ద‌ని చెప్పినా వాళ్లు త‌న‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న‌ట్లు ఆరోపించాడు. 

జూన్ 14న సుశాంత్  ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసు విచారణలో ప‌లు సంచ‌ల‌న‌ విష‌యాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. సుశాంత్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి 15 కోట్ల రూపాయలు రియా కాజేసిందంటూ సుశాంత్‌ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో అరెస్ట్ చేస్తారేమో అన్న భ‌యంతో రియా ముంద‌స్తు బెయిల్ సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా ఈ కేసు విచార‌ణ‌ను  బిహార్ నుంచి ముంబై పోలీసుల‌కు అప్ప‌గించాల‌ని ఆమె సుప్రీంకోర్టును ఆశ్ర‌యించడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. (సుశాంత్‌ బ్యాంక్‌ ఖాతాలు పరిశీలిస్తు‍న్న ఈడీ)

మరిన్ని వార్తలు