సుశాంత్‌ మరణానికి ఏడాది.. మరి న్యాయం??

14 Jun, 2021 10:42 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి చెంది ఏడాది పూర్తయ్యింది. అతనిది ఆత్మహత్యా లేదంటే అభిమానులు ఆరోపిస్తున్నట్లు బాలీవుడ్‌ మాఫియా ప్రొద్భలం వల్ల జరిగిన హత్య అనే విషయంపై ఎటూ తేలకుండా పోయింది. సోషల్‌ మీడియాలో దాదాపు ఏడాదిగా సుశాంత్‌ మీదే చర్చ. ఒక టాలెంటెడ్‌ నటుడి మరణంతో సినీ వర్గాల్లో నెపొటిజం చర్చ మాత్రం విపరీతంగా కొనసాగింది. అనుమానాలు, ఆరోపణలు, విచారణ, వివాదాలు.. వీటి నడుమే సుశాంత్‌ మరణం కేసుపై సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది. 

సాక్షి, వెబ్‌డెస్క్‌: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నిష్క్రమణతో సినీ లోకం ఒక్కసారిగా దిగ్‌భ్రాంతికి లోనయ్యారు. హిందీ సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది. ముఖంలో అమాయకత్వం.. అలరించిన అతని నటన్ని తల్చకుంటూ హఠాత్తుగా అతను లేడనే వార్తని అభిమానులు తట్టుకోలేకపోయారు. అందుకే అతని మరణం పూర్తైన ఏడాది రోజున మళ్లీ అతన్ని గుర్తు చేసుకుంటున్నారు. సుశాంత్‌ బాల్యం, అతని చదువు, వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, వీడియోలు, సినిమాలకు సంబంధించిన అన్ని విషయాల్ని గుర్తు చేసుకుంటున్నారు. పనిలో పనిగా సుశాంత్‌ కేసులో న్యాయం కావాలని కోరుకుంటూ.. ఇదొక ‘చీకటి రోజు’గా ప్రకటించారు.

 

మరణం తర్వాత..
34 ఏళ్ల బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14, 2020న బాంద్రాలోని తన ఇంట్లో ఉరి కొయ్యకు వేలాడుతూ కనిపించాడు. ముంబై పోలీసులు అది ఆత్మహత్య అని పేర్కొనడంతో మొదలైన చర్చ.. ఏడాది అయినా నడుస్తూనే ఉంది. డిప్రెషన్‌ సుశాంత్‌ ప్రధాన సమస్య అని మాజీ ప్రేయసి, సన్నిహితులు చెప్పగా,  కాదు.. బాలీవుడ్‌లో కొందరు అతనికి అవకాశాల్లేకుండా చేసి అతన్ని మానసికంగా చంపేసి ఆపై ఆత్మహత్యకు ఉసిగొల్పారనేది ఫ్యాన్స్‌ వాదన. కేవలం ఫ్యాన్స్‌ మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలోని కొందరు ప్రముఖులు కూడా ఇదే వాదనతో ఏకీభవించడంతో ఈ చర్చ ప్రముఖంగా నడిచింది. ఇంకోపక్క ఈ కేసులో అనుమానాలున్నాయని సుశాంత్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. చదవండి: ఇంతకీ ఈ దిశ ఎవరు?

చివరికి సీబీఐకి.. 
ఈ కేసులో సుశాంత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నటి రియా చక్రవర్తి మీదే అందరికీ అనుమానాలు రేకెత్తాయి. బాలీవుడ్‌ మాఫియాతో చేతులు కలిపి ఆమె సుశాంత్‌ను చంపేసిందని అభిమానులు ఆగ్రహం వెల్లకక్కారు. ఈ వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంతో ముంబై పోలీసుల దర్యాప్తు, అదే టైంలో అతని సొంతం రాష్ట్రం బిహార్‌ పోలీసుల దర్యాప్తు నడుమ కేసు గందరగోళంగా సాగింది. విచారణలో ముంబై పోలీసులు సహకరించడం లేదన్న బిహార్‌ ప్రభుత్వం ఆరోపణతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. దీన్నొక హై ప్రొఫైల్‌ కేసుగా అభివర్ణిస్తూ..  కేసును ఆగస్టు 19న సీబీఐకి అప్పజెప్పింది. మరోవైపు ఆర్థిక లావాదేవీల కోణంలో ఈడీ, డ్రగ్స్‌ లింకుల నేపథ్యంలో ఎన్‌సీబీ.. సుశాంత్‌ కుటుంబ సభ్యుల నుంచి బాలీవుడ్‌ సెలబ్రిటీల దాకా వీలైనంత ఎక్కువ మందిని ప్రశ్నించాయి.. అనుమానితుల్ని అరెస్ట్‌ చేశాయి. ఏదైతేనేం ఏడాది పూర్తయ్యింది. సీబీఐ నుంచి, ఇతర విభాగాల నుంచి సుశాంత్‌ కేసులో ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అందుకు సోషల్‌ మీడియా గట్టిగా #JusticeForSushantSinghRajput అని నినాదం చేస్తోంది.

మరిన్ని వార్తలు