సుశాంత్‌ది ఆత్మహత్యే.. హత్య కాదు!

3 Oct, 2020 14:57 IST|Sakshi

ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్‌ మరణించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలాగా అనేక ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు, సీబీఐ, ఎన్సీబీ, ఈడీ దర్యాప్తు బృందాలు విచారణ చేపట్టిననప్పటికీ అతనిది ఆత్మహత్యా, హత్యా అన్న విషయంలో స్పష్టత రాలేదు. బంధుప్రీతి, బాలీవుడ్‌ ప్రముఖుల విపరీత పోకడల అంశం చుట్టూ తిరిగిన ఈ కేసు డ్రగ్స్‌ వ్యవహారంతో మరో మలుపు తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌ది హత్య కాదని, అది ఆత్మహత్యేనని ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ల బృందం సీబీఐకు పేర్కొంది. చదవండి: సుశాంత్‌ కేసులో మరో మలుపు

కాగా జూన్ 14న సుశాంత్ తన అపార్ట్‌మెంట్‌లో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ముంబై పోలీసులు సుశాంత్‌ది ఆత్మహత్యేనని తెలిపారు. అయితే తన  కొడుకు చావుకు గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి కారణమని, సుశాంత్‌ నుంచి అధిక మొత్తంలో డబ్బులు లాక్కొందని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించిన డ్రగ్స్ సంబంధిత ఆరోపణలపై రియా ప్రస్తుతం జైలులో ఉన్నారు. చదవండి: రియా బెయిల్‌ పిటిషన్: తీర్పు రిజర్వులో

సుశాంత్‌కు విషం ఇచ్చారని, గొంతు నులిమి చంపారని చేసిన ఆరోపణలను ఏయిమ్స్‌ వైద్య బృందం పూర్తిగా తోసిపుచ్చింది. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు తమ మెడికో లీగల్ ఒపీనియన్‌ను న సీబీఐకు సమర్పించారు. సుశాంత్ పోస్ట్ మార్టం, అటాప్సీ రిపోర్టులను ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్లు సమగ్రంగా విశ్లేషించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారు. ఇది ఆత్మహత్య కేసే తప్ప, మర్డర్ కేసు కాదని ఘటనా స్థలం వద్ద లభ్యమైన ఆధారాల ద్వారా వెల్లడైందన్నారు. 45 రోజుల పాటు ఢిల్లీ ఎయిమ్స్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చెందిన నలుగురు డాక్టర్ల బృందం అనేక కోణాల‌లో దర్యాప్తు చేసి ఈ విష‌యాన్ని చెప్పారు.  దీంతో సుశాంత్ ఆత్మహత్య కేసు కోణంలో ఇక సీబీఐ దీన్ని దర్యాప్తు చేయనుంది. చదవండి: ప్లీజ్‌ ఆ వీడియో తొలగించండి: అంకిత

మరిన్ని వార్తలు