సుశాంత్ డిప్రెష‌న్: అత‌ని కుటుంబానికి ముందే తెలుసా?

1 Sep, 2020 09:39 IST|Sakshi

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం కేసులో రోజుకో విష‌యం వెలుగు చూస్తోంది. ఆయ‌న‌ అనారోగ్యం గురించి త‌మ‌కు తెలియ‌ద‌ని సుశాంత్ కుటుంబం గ‌తంలోనే వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అయితే అనూహ్యంగా అది అబ‌ద్ధ‌మ‌ని రుజువు చేస్తూ సుశాంత్ సోద‌రి ప్రియాంక చాట్ లీకైంది. ఇందులో సుశాంత్ మాన‌సిక స్థితి, డిప్రెష‌న్ గురించి ఆమె సోద‌రికి ముందే తెలుసని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు మందుల‌ను కూడా వాడాల‌ని ప్రియాంక సూచించారు. (చ‌ద‌వండి: సుశాంత్‌ అన్నలాంటి వాడు.. సిగ్గుపడండి)

డాక్ట‌ర్ ప్రిస్కిప్ష‌న్ లేకుండా మందుల వాడ‌కం?
లిబ్రియ‌మ్‌(క్లోర్డియాజిపోక్సైడ్‌)ను వారం రోజుల‌పాటు, ఆ త‌ర్వాత నెక్సిటోను ప్ర‌తిరోజూ ఉద‌యం అల్పాహారం తీసుకున్న త‌ర్వాత వాడాల‌ని సుశాంత్‌కు ఆమె సోద‌రి ప్రియాంక మెస్సేజ్ చేశారు. తీవ్ర ఆందోళ‌న‌గా అనిపించిన‌ప్పుడు లొనాజెప్‌ను వేసుకోమ‌ని తెలిపారు. కానీ డాక్ట‌ర్ ప్రిస్కిప్ష‌న్ లేకుండా ఎవ‌రూ ఇవ్వ‌రు క‌దా? అని సుశాంత్ అనుమానం వ్య‌క్తం చేయ‌గా తాను ఎలాగోలా మేనేజ్ చేస్తాన‌ని చెప్పారు. ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికే ఆమె సోద‌రుడికి కాల్ చేశారు. లిఫ్ట్ చేయ‌క‌పోవ‌డంతో మళ్లీ మెసేజ్ పెట్టారు. త‌న మిత్రురాలు డాక్ట‌ర్ అని, ఆమె స‌హాయంతో ముంబైలోని మంచి వైద్యున్ని క‌లిసి చికిత్స కోరుదామ‌ని తెలిపారు. అనంత‌రం మందుల ప్రిస్కిప్ష‌న్ ఆమె షేర్ చేశారు. ఇందులో ఉన్న మూడు ఔష‌ధాలు మాన‌సిక‌ ఒత్తిడి, ఆందోళ‌న‌కు వాడేవే కాగా లిబ్రియ‌మ్‌ను డ్ర‌గ్స్ నివార‌ణ‌కు కూడా వినియోగిస్తారు. కాగా సుశాంత్ కుటుంబ స‌భ్యులు అడిగితేనే ఆయ‌న వాడాల్సిన ఔష‌ధాలు రాసిచ్చాన‌ని ఢిల్లీలోని రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆస్ప‌త్రి వైద్యుడు డా. త‌రుణ్ కుమార్ వెల్ల‌డించారు. (చ‌ద‌వండి:బాడీషేమింగ్‌ అనేది మార్కెట్‌ గిమ్మిక్‌)

చాట్ చేసిన‌ రోజే రియా వెళ్లిపోయింది
మ‌రోవైపు లీకైన‌ ఈ మెసేజ్ చాట్ ఎన్నో సందేహాలకు తావిస్తోంది. అస‌లు సుశాంత్ అనారోగ్యం గురించి త‌మ‌కు తెలియ‌ద‌ని ఆయ‌న కుటుంబం అబ‌ద్ధం ఎందుకు చెప్పింది? రియాకు మాత్ర‌మే అత‌ను ఏ మందులు వేసుకోవాలో సూచించేవార‌ని చెప్పారు. కానీ ఇక్క‌డ ప్రియాంకే మందుల ప్రిస్కిప్ష‌న్ పంపిందంటే అర్థం ఏమిటి? మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. సుశాంత్‌తో ప్రియాంక‌ జూన్ 8న ఉద‌యం 10 గంట‌ల‌కు చాట్ చేయ‌డంతో పాటు ఫోన్ మాట్లాడారు. అదే రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు రియా చ‌క్ర‌వ‌ర్తి అత‌ని ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ మ‌ధ్య‌లో ఇంకా ఏమైనా జ‌రిగి ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

రోగి లేకుండా మందులు రాసివ్వ‌డం నేరం
ఈ చాట్‌పై రియా లాయ‌ర్ స‌తీష్ మ‌నేషిండే మాట్లాడుతూ.. సుశాంత్ అనారోగ్యం గురించి వారి కుటుంటానికి ముందే తెలుస‌ని పేర్కొన్నారు. నిజానికి రియా అత‌డికి ఎలాంటి మందులు ఇవ్వ‌లేద‌ని,  ఆస్ప‌త్రులకు మాత్ర‌మే తీసుకెళ్లేద‌ని తెలిపారు. కానీ సుశాంత్ సోద‌రి ప్రియా అత‌డికి ఏ మందులు వేసుకోవాలో సూచించింద‌ని తెలిపారు. అస‌లు 2019 న‌వంబ‌ర్‌లోనే సుశాంత్ ఆరోగ్య ప‌రిస్థితి గురించి వారికి తెలుస‌ని ప్రియాంక మెసేజ్‌ల ద్వారా వెల్ల‌డ‌వుతుంద‌న్నారు. రోగి లేకుండానే, అత‌ని ఆరోగ్య ప‌రిస్థితిని స‌మీక్షించ‌కుండానే మందులు రాసివ్వ‌డం మాన‌సిక ఆరోగ్య చ‌ట్ట ప్ర‌కారం నేర‌మ‌ని తెలిపారు. (చ‌ద‌వండి: రియాకు మంచు ల‌క్ష్మి, తాప్సీ మ‌ద్ద‌తు)

మరిన్ని వార్తలు