కృతికి టైం కేటాయించాలి, వాళ్లతో టూర్‌ వెళ్లాలి..

17 Sep, 2020 17:40 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అతడి మరణం తర్వాత ఇండస్ట్రీలో బంధుప్రీతి మొదలు డ్రగ్స్‌ వ్యవహారం దాకా అన్ని విషయాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఔట్‌సైడర్‌ అయిన సుశాంత్‌ పరిశ్రమలోని ప్రముఖుల అవమానాలు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటే, మరికొందరు మాత్రం ఇది ముమ్మాటికి హత్యేనంటూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సుశాంత్‌ ప్రవర్తనా శైలి, అతడి ఫామ్‌హౌజ్‌లో డ్రగ్స్‌ పార్టీలు జరిగేవంటూ అక్కడి మేనేజర్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. పవనాలోని ఫాంహౌజ్‌లో సుశాంత్‌కు సంబంధించిన నోట్స్‌ ఇండియా టుడే చేతికి చిక్కాయి. ఇందులో ఏప్రిల్‌ 27, 2018లో అతడు రాసుకున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. (చదవండి: సుశాంత్‌తో టచ్‌లో లేను.. కానీ నాకు తెలుసు!)

అందులో ఉన్న వివరాల ప్రకారం.. ఆరోజు సుశాంత్‌ ఉదయం 2.30 గంటలకే నిద్రలేచి, టీ తాగి, చన్నీళ్లతో స్నానం చేశాడు. ఆ తర్వాత వేద మంత్రాలు పఠించాడు. అంతేగాక స్మోకింగ్‌ వదిలేయాలని అతడు నోట్‌లో రాసుకున్నాడు. ఆ మరుసటి రోజు కేదార్‌నాథ్‌ సినిమా స్క్రిప్టు వినాలని నిర్ణయించుకున్నాడు. కాగా కేదార్‌నాథ్‌ షూటింగ్‌ సమయంలోనే సుశాంత్‌ గంజాయి తాగడం అలవాటు చేసుకున్నాడని, అతడి ప్రేయసి రియా చక్రవర్తి తెలిపిన సంగతి తెలిసిందే.

ఇక మరో నోట్‌లో తన రాబ్తా సినిమా కోస్టార్‌  కృతి సనన్‌ కోసం మరింత సమయం కేటాయించాలని సుశాంత్‌ రాసుకున్నాడు.(అంకితా లోఖండేతో విడిపోయిన తర్వాత సుశాంత్‌- కృతి ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరిగింది). అదే విధంగా తన అక్క ప్రియాంక సింగ్‌, ఆమె భర్త మహేష్‌తో ట్రిప్‌కు వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నాడు. వీటితో పాటు.. ‘‘ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి?’’, సంతోషం ఎందుకు?, అనుభవం-విశ్లేషణ-ధైర్యం, ప్రతిభ, దైవత్వం, యోగ, తపస్య, కైలాష్‌, మూడో కన్ను వంటి పదాలు రాసుకున్నాడు. ‘‘నేను ఉన్నపుడు దేవుడు లేడు, దేవుడు ఉన్నపుడు నేను ఉండను’’అన్న కబీర్‌ పద్యంలోని పంక్తులను రాశాడు. (చదవండి: ఎన్‌సీబీ దృష్టి అంతా ఆ ఫామ్‌హౌస్‌ పైనే!)

అంతేగాక 2018లో వరుణ్‌ మాథుర్‌ అనే వ్యక్తితో ఇన్సాయ్‌ వెంచర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి సంబంధించిన వివరాలు కూడా సుశాంత్‌ ఈ నోట్‌లో ప్రస్తావించాడు. అయితే అప్పటికింకా రియాతో పరిచయం లేనందు వల్ల ఆమె గురించి ఎక్కడా ఒక్కమాట కూడా రాయలేదు. ఇక ఈ నోట్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో సుశాంత్‌ క్రమశిక్షణతో మెలిగేవాడు అనడానికి ఇదొక ఉదాహరణ అని అతడి అభిమానులు అంటే, రియాకు దగ్గరకాకముందే అతడు కుంగుబాటులో ఉన్నాడని, కాబట్టి రియాను టార్గెట్‌ చేయడం మంచిది కాదంటూ ఆమె మద్దతుదారులు కామెంట్లు చేస్తున్నారు.

ఇక తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని డైరీలో రాసుకోవడం సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు అలవాటు అని అతడి సహ నటుడు దీపక్‌ ఖజీర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. సుశాంత్‌ మృతి నేపథ్యంలో బుధవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన దీపక్‌.. ‘‘రాయడం అంటే సుశాంత్‌కు ఇష్టం. ఒకవేళ తను నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే సూసైడ్‌ నోట్‌ ఎందుకు రాయలేదు’’ అని అనుమానం వ్యక్తం చేశారు.


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా